పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : భూ ద్వీప వర్ష విస్తారములు

  •  
  •  
  •  

5.2-43-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియుఁ గేతుమాల వర్షంబునందు భగవంతుండు శ్రీదేవికి సంతోషంబు నొసంగుటకుఁ గామదేవరూపంబున నుండును; అమ్మహాపురుషుని యస్త్రతేజః ప్రకాశంబునఁ బ్రజాపతి దుహితలగు రాత్ర్యధి దేవతల గర్భంబులు సంవత్సరాంతంబున నిర్జీవంబు లై స్రవించును; ఆ కామదేవుండును దన గతి విలాసలీలావిలోకన సుందర భ్రూమండల సుభగ వదనారవింద కాంతులంజేసి శ్రీరమాదేవిని రమింపం జేయు; భగవన్మాయారూపిణి యగు శ్రీదేవియుఁ బ్రజాపతి పుత్రికలును బుత్రులు నైన రాత్రులం బగళ్ళం గూడి కామదేవుని స్తోత్రపఠన పూజాధ్యానాదులం బూజించుచుండు; మఱియును.

టీకా:

మఱియున్ = ఇంకను; కేతుమాలవర్షంబున్ = కేతుమాలవర్షము; అందున్ = లో; భగవంతుండు = నారాయణుడు; శ్రీదేవి = లక్ష్మీదేవి; కిన్ = కి; సంతోషంబున్ = సంతోషమును; ఒసగుట = ఇచ్చుట; కున్ = కు; కామదేవ = మన్మథుని; రూపంబునన్ = స్వరూపములో; ఉండునున్ = ఉండును; ఆ = ఆ; మహా = పరమ; పురుషునిన్ = పురుషుని యొక్క; అస్త్ర = అస్త్రముల; తేజస్ = తేజస్సు యొక్క; ప్రకాశంబునన్ = ప్రకాశము వలన; ప్రజాపతి = ప్రజాపతి యొక్క; దుహితలు = పుత్రికలు; అగు = అయిన; రాత్రి = రాత్రులకు; అధిదేవతల = అధికారము కల దేవతల యొక్క; గర్భంబులున్ = గర్భములు; సంవత్సర = అహోరాత్రంబుల, సంవత్సరము; అంతంబునన్ = చివరకు; నిర్జీవంబులు = నిర్జీవములు; ఐ = అయ్యి; స్రవించును = స్రవించును; ఆ = ఆ; కామదేవుండునున్ = మన్మథుడును; తన = తన యొక్క; గతి = వర్తన; విలాస = విలాసములు; లీలా = క్రీడలు; విలోకన = దృక్కులు; సుందర = అందమైన; భ్రూమండల = భ్రుకుటి ప్రదేశము; సుభగ = సౌభాగ్యవంతమైన; వదన = మోము అనెడి; అరవింద = పద్మము యొక్క; కాంతులన్ = ప్రకాశములు; చేసి = వలన; శ్రీ = శ్రీ; రమాదేవినిన్ = లక్ష్మీదేవిని; రమింపన్ = సంతోషింప; చేయున్ = చేయును; భగవత్ = భగవంతుని; మాయా = మాయ యొక్క; రూపిణి = రూపము ధరించినామె; అగు = అయిన; శ్రీదేవియున్ = లక్ష్మీదేవికూడ; ప్రజాపతి = ప్రజాపతి యొక్క; పుత్రికలు = కుమార్తెలు; పుత్రులు = కుమారులు; ఐన = అయినట్టి; రాత్రులు = రాత్రులు; పగళ్ళన్ = పగళ్ళతో; కూడి = తో కలసి; కామదేవునిన్ = మన్మథుని; స్తోత్రపఠన = స్తుతించుట; పూజ = పూజలు; ధ్యాన = ధ్యానములు; పూజించుచుండున్ = కొలచుతుండును; మఱియునున్ = ఇంకను;

భావము:

ఇంకా కేతుమాల వర్షంలో భగవంతుడు శ్రీదేవిని సంతోషపెట్టడం కోసం మన్మథరూపంలో సాక్షాత్కరిస్తాడు. ఆ కామదేవుని అస్త్ర ప్రభావం వల్ల ప్రజాపతి కుమార్తెలైన రాత్రులకు అధిదేవతలైనవారి గర్భాలు సంవత్సరకాలం సంరక్షింపబడి నప్పటికీ నిర్జీవములై స్రవిస్తాయి. ఆ కామదేవుని రూపంలో ఉన్న శ్రీహరి తన నడకల సొగసులతో, విలాస వీక్షణాలతో, అందమైన కనుబొమలతో, పద్మాలవంటి మనోహర ముఖ కాంతులతో రమాదేవిని సంతోషపెడతాడు. భగవంతుని మాయకు ప్రతిరూపమైన ఆ శ్రీదేవి కూడా ప్రజాపతి పుత్రికలు, పుత్రులు అయిన రాత్రులతో, పగళ్ళతో కామదేవుణ్ణి స్తుతిస్తూ, పూజలు చేస్తూ, ధ్యానిస్తూ, ఆరాధిస్తూ ఉంటుంది. ఇంకా…