పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : భూ ద్వీప వర్ష విస్తారములు

  •  
  •  
  •  

5.2-36-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు సురతసుఖానందంబున మోక్షంబు నైనం గైకొనక సకృత్ప్రసూతు లగుచు ననవరతంబును ద్రేతాయుగకాలంబు గలిగి ప్రవర్తింతు; రీ యష్ట వర్షంబులయందు దేవతాగణంబులు దమ భృత్యువర్గంబు లత్యుపచారంబులు జేయుచుండ నెల్ల ఋతువుల యందుం గిసలయ కుసుమ ఫల భరితంబులైన లతాదుల శోభితంబు లగు వనంబులు గల వర్ష నిధి గిరిద్రోణుల యందును, వికచ వివిధ నవ గమలా మోదితంబు లగు రాజహంస కలహంసలు గల సరోవరంబుల యందును జలకుక్కుట కారండవ సారస చక్రవాకాది వినోదంబులు గలిగి మత్తాళిఝంకృతి మనోహరంబులై నానావిధంబు లయిన కొలంకుల యందును దేవాంగనల కామోద్రేకజంబు లయిన విలాస హాస లీలావలోకనంబులం దివియంబడిన మనోదృష్టులు గలిగి దేవగణంబులు విచిత్ర వినోదంబులఁ దగిలి యిచ్చావిహారంబులు సలుపుచుండుదురు.

టీకా:

మఱియున్ = ఇంకను; సురత = స్త్రీ సంగమము యొక్క; సుఖ = సుఖము అనెడి; ఆనందంబునన్ = ఆనందముల ముందు; మోక్షంబున్ = మోక్షమును; ఐనన్ = అయినప్పటికి; కైకొనక = గ్రహించక; సకృత్ = ఎప్పుడైనా ఒకమారు; ప్రసూతులు = పిల్లలు కనువారు; అగుచున్ = అగుచు; అనవరతంబున్ = ఎల్లప్పుడు; త్రేతాయుగంబునన్ = త్రేతాయుగపు; కాలంబున్ = కాలధర్మములు; కలిగి = కలిగి; ప్రవర్తింతురు = ప్రవర్తిస్తుంటారు; ఈ = ఈ; అష్ట = ఎనిమిది (8); వర్షములు = దేశములు; అందున్ = లోను; దేవతా = దేవతల; గణంబులున్ = సమూహములు; తమ = తమ యొక్క; భృత్యు = భక్తుల; వర్గంబులన్ = సమూహములు; అతి = అధికమైన; ఉపాచారములు = సేవలు; చేయుచుండన్ = చేయుచుండగ; ఎల్ల = సమస్తమైన; ఋతువులన్ = ఋతువుల; అందున్ = లోను; కిసలయ = చిగురుటాకులు; కుసుమ = పూలు; ఫల = పండ్లుతో; భరితంబులున్ = నిండినవి; ఐనన్ = అయినట్టి; లత = లతలు; ఆదుల = మొదలగువాటితో; శోభితంబులున్ = శోభిల్లుతున్నవి; అగు = అయినట్టి; వనంబులున్ = అడవులు; కల = కలిగిన; వర్షనిధి = సరోవరములు {వర్షనిధి - వర్షపు నీటికి నిధివంటిది, సరస్సు}; గిరిద్రోణుల = కొండపల్లములు, కుంటలు; అందునున్ = లోను; వికచ = వికసించిన; వివిధ = అనేక రకముల; నవ = తాజా; కమల = కలువలతో; ఆమోదితంబులు = సంతృప్తి చెందినవి; అగు = అయినట్టి; రాజహంసలు = రాయంచలు; కలహంసలు = కలహంసలు; కల = కలిగిన; సరోవరంబుల = సరస్సుల; అందున్ = లో; జలకుక్కుట = నీటికోళ్ళు; కారండవ = కారండవములు; సారస = బెగ్గురు పక్షులు; చక్రవాక = చక్రవాక పక్షులు; ఆది = మొదలగువాటి; వినోదంబులు = సంతోషములు; కలిగి = ఉండి; మత్త = మదించిన; అళి = తుమ్మెదల; ఝంకృతిన్ = ఝంకారములుచేత; మనోహరంబులు = బహు చక్కగ నైనవి; ఐ = అయ్యి; నానా = అనేక; విధంబులు = విధములు; అయిన = అయిన; కొలంకుల = కొలనుల; అందునున్ = లోను; దేవాంగనల = దేవతాస్త్రీల; కామ = కామమును; ఉద్రేకజంబులు = ప్రేరేపించునవి; అయిన = అయిన; విలాస = విలాసములు; హాస = నవ్వులు; లీలా = క్రీడలు; అవలోకనంబులన్ = చూపులచే; తివియంబడిన = ఆకర్షించబడిన; మనః = మనసులు; దృష్టులు = చూపులు; కల = కలిగిన; దేవ = దేవతల; గణంబులున్ = సమూహములు; విచిత్ర = విచిత్రములైన; వినోదంబులు = వేడుక లందు; తగిలి = తగుల్కొని; ఇచ్చా = ఇష్టము వచ్చినట్లు; విహారంబులు = తిరుగుటలు; సలుపుచుండుదురు = చేయుచుందురు;

భావము:

ఇంకా ఈ ఎనిమిది వర్షాలలో ఉన్నవారు సురత సుఖానంద పరవశులై మోక్షాన్ని సైతం కోరుకోరు. అక్కడి స్త్రీలు ఎప్పుడైనా ఒకసారి మాత్రమే బిడ్డలను కంటూ ఉంటారు. అక్కడ ఎల్లప్పుడూ త్రేతాయుగమే ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ ఎనిమిది వర్షాలలోను దేవతలు తమ సేవకులు చేసే ఉపచారాలను గ్రహిస్తూ విహరిస్తూ ఉంటారు. అన్ని ఋతువులలోను చివుళ్ళతో, పువ్వులతో, ఫలాలతో నిండిన తీగెలు, వృక్షాలు గల వనాలు అక్కడ ఉంటాయి. సరోవరాలలో వికసించిన పద్మాలు ఉంటాయి. ఆ పద్మాల పరిమళం ఆఘ్రాణిస్తూ రాజహంసలు, కలహంసలు విహరిస్తూ ఉంటాయి. నీటికోళ్ళు, కొక్కెరలు, బెగ్గురు పక్షులు, జక్కవలు కొలకులలో ఈదులాడుతూ ఉంటాయి. మత్తెక్కిన తుమ్మెదలు ఝంకారాలు చేస్తుంటాయి. అటువంటి వనాలలో, సరస్సులలో, కొండ లోయలలో దేవతాస్త్రీలు విహరిస్తూ విలాసంగా ఆడుతూ, పాడుతూ, పకపక నవ్వుతూ, ప్రక్కచూపులు చూస్తూ, కామేద్రేకం కలిగిస్తూ సంచరిస్తూ ఉంటారు. వారి విలాస చేష్టలకు ఆకర్షితులైన పురుషులు అక్కడ స్వేచ్ఛావిహారాలు చేస్తుంటారు.