పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : భూ ద్వీప వర్ష విస్తారములు

  •  
  •  
  •  

5.2-34-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు సీత యను పేర వినుతి నొందిన యమ్మహానదీప్రవాహంబు బ్రహ్మసదన పూర్వద్వారంబున వెడలి కేసరావలయంబుఁ దడుపుచు గంధమాదనాద్రికిం జని భద్రాశ్వవర్షంబుం బావనంబు జేయుచుఁ బూర్వలవణసాగరంబునం బ్రవేశించు; చక్షు వను పేరం దేజరిల్లెడు దీర్ఘప్రవాహంబు పశ్చిమద్వారంబున వెడలి మాల్యవత్పర్వతంబు నుత్తరించి కేతుమాలవర్షంబుం బవిత్రంబు జేయుచుఁ బశ్చిమ లవణార్ణవంబునం గలయు; భద్ర యనుపేర వెలుఁగొందిన యతుల ప్రవాహం బుత్తరద్వారంబున వెడలి కుముద నీల శ్వేతాఖ్య పర్వత శిఖరంబులం గ్రమంబునఁ బ్రవహించుచు శృంగ నగరంబునకుం జని మానసోత్తరంబు లగు నుత్తర కురుభూములఁ బవిత్రంబు జేయుచు నుత్తర లవణ సాగరంబుఁ జేరు; నలకనంద యనం బ్రఖ్యాతి గాంచిన యమ్మహానదీ ప్రవాహంబు బ్రహ్మ సదన దక్షిణద్వారంబున వెడలి యత్యంత దుర్గమంబు లైన భూధరంబులఁ గడచి హేమకూట హిమకూట నగంబుల నుత్తరించి యతివేగంబునఁ గర్మక్షేత్రంబగు భారతవర్షంబుఁ బావనంబు జేయుచు దక్షిణ లవణాంబుధిం గలయు; నంత.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; సీత = సీత; అను = అనెడి; పేరన్ = పేరుతో; వినుతిన్ = ప్రసిద్ధి; ఒందిన = పొందినట్టి; ఆ = ఆ; మహా = పెద్ద; నదీ = నది యొక్క; ప్రవాహంబున్ = ప్రవాహమును; బ్రహ్మసదన = బ్రహ్మపురము; పూర్వ = తూర్పు; ద్వారంబునన్ = ద్వారము నందు; వెడలి = వెలువడి; కేసర = కేసరముల; వలయంబున్ = మండలమును; తడుపుచున్ = తడుపుతూ; గంధమాదనాద్రి = గంధమాదన పర్వతమున; కిన్ = కు; చని = వెళ్ళి; భద్రాశ్వవర్షంబున్ = భద్రాశ్వవర్షమును; పావనంబున్ = పవిత్రము (తడపుట); చేయుచున్ = చేయుచు; పూర్వ = తూర్పు; లవణ = ఉప్పు; సాగరంబున్ = సముద్రమును; ప్రవేశించున్ = చేరును; చక్షువు = చక్షువు; అను = అనెడి; పేరన్ = పేరుతో; తేజరిల్లెడు = ప్రకాశించెడి; దీర్ఘ = పొడవైన; ప్రవాహంబున్ = ప్రవాహము; పశ్చిమ = పడమర; ద్వారంబునన్ = ద్వారము నందు; వెడలి = వెలువడి; మాల్యవత్పర్వతంబున్ = మాల్యవత్పర్వతములను; ఉత్తరించి = దాటి; కేతుమాలవర్షంబున్ = కేతుమాలదేశమును; పవిత్రంబున్ = పావనము; చేయుచున్ = చేయుచు; పశ్చిమ = పడమర; లవణ = ఉప్పు; ఆర్ణవంబున్ = సముద్రమును; కలయు = కలియును; భద్ర = భద్ర; అను = అనెడి; పేరన్ = పేరుతో; వెలుగొందిన = ప్రకాశించెడి; అతుల = పెద్ద; ప్రవాహంబున్ = ప్రవాహము; ఉత్తర = ఉత్తరము వైపు; ద్వారంబునన్ = ద్వారము నందు; వెడలి = వెలువడి; కుముద = కుముదపర్వతములు; నీల = నీలపర్వతములు; శ్వేత = శ్వేత పర్వతములు; ఆఖ్యన్ = పేరు కలిగిన; పర్వతశిఖరంబులన్ = కొండకోన లందు; క్రమంబునన్ = వరుసగా; ప్రవహించుచున్ = ప్రవహించుతూ; శృంగనగరంబున్ = శృంగపట్టణమున; కున్ = కు; చని = వెళ్ళి; మానస = మానససరోవరమునకు; ఉత్తరంబులున్ = ఉత్తరదిక్కున ఉన్నట్టివి; అగు = అయిన; ఉత్తరకురుభూములన్ = ఉత్తరకురుదేశములను; పవిత్రంబున్ = పావనము; చేయుచున్ = చేయుచు; ఉత్తర = ఉత్తరపు; సాగరంబున్ = సముద్రమును; చేరున్ = చేరును; అలకనంద = అలకనంద; అనన్ = అని; ప్రఖ్యాతి = ప్రసిద్ధి; కాంచిన = పొందినట్టి; ఆ = ఆ; మహా = పెద్ద; నదీ = నది యొక్క; ప్రవాహంబున్ = ప్రవాహము; బ్రహ్మసదన = బ్రహ్మపురము; దక్షిణ = దక్షిణపు; ద్వారంబునన్ = ద్వారము నందు; వెడలి = వెలువడి; అత్యంతదుర్గమంబులు = ఏ మాత్రమును చొరరానివి; ఐన = అయినట్టి; భూధరంబులన్ = పర్వతములను; కడచి = దాటి; హేమకూట = హేమకూటము; హిమకూట = హిమకూటము అనెడి; నగంబులన్ = పర్వతశిఖరములను; ఉత్తరించి = దాటి; అతి = మిక్కిలి; వేగంబునన్ = వేగముతో, గతితో; కర్మక్షేత్రంబున్ = కర్మక్షేత్రము; అగు = అయిన; భారతవర్షంబున్ = భారతదేశమును; పావనంబున్ = పవిత్రము (తడపుట); చేయుచున్ = చేయుచు; దక్షిణ = దక్షిణపు; లవణ = ఉప్పు; అంబుధి = సాగరమున; కలయున్ = చేరును; అంత = అంతట;

భావము:

సీత అనే పేరుతో ప్రఖ్యాతమైన నదీ ప్రవాహం బ్రహ్మపురం తూర్పుద్వారం నుంచి ప్రవహించి కేసరగిరి శిఖరాలను తడుపుతూ గంధమాదన పర్వతం మీదుగా సాగి భద్రాశ్వ వర్షాన్ని పవిత్రం చేస్తూ తూర్పువైపున లవణ సముద్రంలో ప్రవేశిస్తుంది. బ్రహ్మపురం పడమటి ద్వారం నుండి వెలువడిన చక్షువు అనే ప్రవాహం మాల్యవంత పర్వతాన్ని దాటి కేతుమూల వర్షాన్ని పవిత్రం చేస్తూ పడమటి సముద్రంలో సంగమిస్తుంది. బ్రహ్మపట్టణం ఉత్తరద్వారం గుండా వెలువడిన భద్ర అనే ప్రవాహం కుముదం, నీలం, శ్వేతం అనే పర్వత శిఖరాల మీదుగా ప్రవహిస్తూ, శృంగనగరం చేరుకొని అక్కడనుండి మానసోత్తరాలైన కురుభూములను పవిత్రం చేస్తూ ఉత్తర సముద్రంలో కలుస్తుంది. బ్రహ్మనగరం దక్షిణద్వారం నుండి వెలువడిన అలకనందా ప్రవాహం మిక్కిలి దుర్గమాలైన పర్వత పంక్తుల గుండా ప్రవహించి హేమకూటం, హిమకూటం అనే పర్వతాలను దాటి వచ్చి మిక్కిలి ఉరవడితో కర్మక్షేత్రమైన భారతవర్షాన్ని పవిత్రం చేస్తూ దక్షిణ సముద్రంలో కలుస్తుంది.