పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : భూ ద్వీప వర్ష విస్తారములు

  •  
  •  
  •  

5.2-32-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు చరణనఖస్పర్శం జేసి భేదింపబడ్డ యూర్ధ్వకటాహ వివరంబు వలన నంతఃప్రవేశంబు జేయుచున్న బాహ్యజలధార శ్రీహరిపాదస్పర్శం జేయుచుఁ జనుదెంచి, సకలలోకజనంబుల దురితంబులు వాపుచు భగవత్పాదియను పేరం దేజరిల్లుచు దీర్ఘకాలంబు స్వర్గంబున విహరించు విష్ణుపదంబున నుత్తానపాద పుత్రుండును బరమ భాగవతుండును నైన ధ్రువుండు దన కులదేవత యైన శ్రీహరి పాదోదకంబుఁ బ్రతిదినంబును భక్తియోగంబున నిమీలితనేత్రుండై యానందబాష్పంబుల రోమాంచితగాత్రుండై యత్యాదరంబున నేఁడును శిరంబున ధరియించుచు నున్నవాఁడు; యతనికి నధోభాగంబున నుండు మండలాధిపతు లైన సప్తర్షులును హరిపాదోదక ప్రభావంబు నెఱింగి తాము పొందు తపస్సిద్ధి యాకాశగంగాజలంబుల స్నాతు లగుటయే యని సర్వభూతాంతర్యామి యగు నీశ్వరుని యందు భక్తి సలిపి యితరపదార్థాపేక్ష జేయక మోక్షార్థి ముక్తిమార్గంబు బహుమానంబు జేయు తెఱంగున బహుమానయుక్తంబుగాఁ దమ జటాజూటంబుల యందు నేడును ధరియించుచుండుదురు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; చరణనఖ = కాలిగోరు; స్పర్శన్ = తగులుట; చేసి = వలన; భేదింపబడ్డ = పగలగొట్టబడిన; ఊర్ధ్వకటాహ = పైకప్పు {ఊర్ధ్వకటాహము - బ్రహ్మాండము యొక్క పై కప్పు}; వివరంబున్ = కన్నము; వలనన్ = ద్వారా; అంతః = లోనికి; ప్రవేశంబున్ = ప్రవేశము; చేయుచున్న = చేస్తున్న; బాహ్య = బయటి; జలధార = నీటిధార; శ్రీహరి = విష్ణుని; పాద = పాదములను; స్పర్శన్ = తగులుట; చేయుచున్ = చేయుచూ; చనుదెంచె = వచ్చెను; సకల = నిఖిల; లోక = భువనముల; జనంబుల = ప్రజల యొక్క; దురితంబులున్ = పాపములను; వాపుచున్ = పోగొడుతూ; భగవత్పాది = భగవత్పాది {భగవత్పాది - భగవంతుని పాదము లందు పుట్టినది}; అను = అనెడి; పేరన్ = పేరుతో; తేజరిల్లుచు = విలసిల్లుతూ; దీర్ఘ = పెద్ద; కాలంబున్ = కాలము; స్వర్గంబునన్ = స్వర్గము నందు; విహరించున్ = ప్రవహించును; విష్ణుపదంబునన్ = విష్ణులోకము నందు; ఉత్తానపాద = ఉత్తానపాదుని; పుత్రుండునున్ = కొడుకు; పరమ = అత్యుత్తమ; భాగవతుండునున్ = భాగవతానుయాయి; ఐన = అయిన; ధ్రువుండు = ధ్రువుడు; తన = తన యొక్క; కులదేవత = కులదేవత {కులదేవత - వంశస్థుల ప్రధాన ఆరాధ్య దైవము}; ఐన = అయిన; శ్రీహరి = నారాయణుని; పాదోదకంబున్ = కాళ్ళు కడిగిన నీరు; ప్రతి = ప్రతి యొక్క; దినంబునున్ = దినమును; భక్తియోగంబునన్ = భక్తిపూర్వకంబుగా; నిమీలిత = అరమోడ్పు; నేత్రుండు = కన్నులు కలవాడు; ఐ = అయ్యి; ఆనంద = ఆనందముచే కలగిన; బాష్పంబులన్ = కన్నీటితో; రోమాంచిత = రోమములు గగుర్పాటు చెందిన; గాత్రుండు = దేహము కలవాడు; ఐ = అయ్యి; అత్యాదరంబునన్ = మిక్కిలి ఆదరముతో; నేడునున్ = ఈ నాటికిని; శిరంబునన్ = తలపైన; ధరియించుచున్నవాడు = ధరిస్తున్నాడు; అతని = తని; కిన్ = కి; అధోభాగంబునన్ = కిందివైపున; ఉండు = ఉండెడి; మండలాధిపతులు = సప్తర్షిమండలమునకు అధిపతులు; ఐన = అయిన; సప్తర్షులును = సప్తర్షులు {సప్తర్షులు - 1మరీచి 2అత్రి 3అంగిరుడు 4పులస్త్యుడు 5పులహుడు 6క్రతువు 7వసిష్ఠుడు (మరియొక క్రమమున) 1కశ్యపుడు 2అత్రి 3భరద్వాజుడు 4విశ్వామిత్రుడు 5గౌతముడు 6జమదగ్ని 7వసిష్ఠుడు}; హరి = నారాయణుని; పాదోదక = కాళ్ళు కడిగిన నీటి; ప్రభావంబున్ = ప్రభావమును; ఎఱింగి = తెలిసి; తాము = తాము; పొందు = పొందెడి; తపస్ = తపస్సు; సిద్ధి = సిద్ధియనగా; ఆకాశగంగా = ఆకాశగంగ యందు; స్నాతులు = స్నానము చేసినవారు; అగుటయే = అగటే; అని = అని; సర్వ = నిఖిల; భూత = భూతము లందు; అంతర్యామి = లోపల ఉండెడివాడు; అగు = అయినట్టి; ఈశ్వరుని = భగవంతుని; అందు = అందు; భక్తి = భక్తి; సలిపి = చేసి; ఇతర = ఇతరమైన ఏ; పదార్థ = పదార్థముల యందు; ఆపేక్ష = కోరుట; చేయక = చేయకుండ; మోక్షార్థి = మోక్షమును అపేక్షించువాడు; ముక్తిమార్గంబున్ = ముక్తిమార్గమును; బహుమానంబున్ = సమ్మానము; చేయు = చేసెడి; తెఱంగునన్ = విధముగా; బహుమాన యుక్తంబుగాన్ = గౌరవపూర్వకముగా; తమ = తమ యొక్క; జటాజూటంబులన్ = జటల చుట్టల; అందున్ = అందు; నేడునున్ = ఈనాటికిని; ధరియించుచుందురు = ధరించెదరు;

భావము:

ఈ విధంగా నారాయణుని ఎడమకాలి గోటిచేత బ్రహ్మాండం పైకప్పు బ్రద్దలు కాగా ఒక రంధ్రం ఏర్పడింది. అప్పుడు అంతవరకు వెలుపలి వైపు ప్రవహిస్తున్న జలధార అంతర్వాహినియై త్రివిక్రమదేవుని పాదాన్ని స్పృశిస్తూ ప్రవహించింది. ఆ ప్రవాహమే భగత్పాది అనే పేరుతో సకల లోకాల పాపాలను పరిహరిస్తూ చాలాకాలం స్వర్గంలో విహరించింది. ఉత్తానపాదుని కుమారుడు, భాగవతులలో అగ్రేసరుడు అయిన ధ్రువుడు తన ఇలవేల్పు అయిన శ్రీహరి పాదోదకాన్ని ప్రతిదినం నిమీళిత నేత్రుడై భక్తితో స్వీకరిస్తూ, ఆనంద బాష్పాలతో పులించిన దేహంతో ఎంతో ఆదరంతో నేటికీ తలపై చల్లుకొంటూ ఉంటాడు. ఆ ధ్రువునికి దిగువ భాగంలోనే మండలాధిపతులైన సప్తర్షు లున్నారు. వారు శ్రీమన్నారాయణుని పాదోదక ప్రభావం తెలిసికొని ఆకాశగంగలో స్నానం చేయడమే తమ తపస్సిద్ధి అని భావిస్తారు. అలా స్నానం చేయడం వల్ల తమ జన్మ చరితార్థ మౌతున్నట్లు విశ్వసిస్తారు. అఖిల జగత్తులో అంతర్యామిగా ఉన్న శ్రీమన్నారాయణునిపై భక్తి దృఢంగా నిలిపి, వేరే ప్రాపంచికమైన వస్తువులపై అపేక్ష లేకుండా, మోక్షం కోరే వ్యక్తి ముక్తిమార్గాన్ని గౌరవించినట్లు భక్తి గౌరవాలతో సప్తర్షులు ఆ ఆకాశగంగా జలాన్ని తమ జటాజూటాలలో ఈనాటికీ ధరిస్తూ ఉంటారు.