పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : భూ ద్వీప వర్ష విస్తారములు

  •  
  •  
  •  

5.2-30-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నరేంద్రా! కురంగ కురర కుసుంభ వైకంకత త్రికూట శిశిర పతంగ రుచక నిషధ శితివాస కపిల శంఖాదులయిన పర్వతంబులు మేరుపర్వతకర్ణికకుఁ గేసరంబులయి పరివేష్టించి యుండు; నా మేరు నగేంద్రంబునకుఁ బూర్వభాగంబున జఠర దేవకూటంబులును, బశ్చిమంబునం బవన పారియాత్రంబులు నను పర్వతంబులు నాలుగు, దక్షిణోత్తరంబు లొండొంటికి నష్టాదశసహస్ర యోజనంబుల నిడుపును బూర్వపశ్చిమంబులు ద్విసహస్ర యోజనంబుల వెడల్పును నగుచు దక్షిణంబునఁ గైలాస కరవీరంబులు నుత్తరంబున ద్రిశృంగ మకరంబు లను నామంబులు గల పర్వతంబులు నాలుగును, బూర్వపశ్చిమంబుల నష్టాదశసహస్ర యోజనంబుల నిడుపును దక్షిణోత్తరంబుల ద్విసహస్ర యోజనంబుల వెడల్పు నగుచు నగ్నిపురుషునకుం బ్రదక్షిణం బగు పరిస్తరణంబుల చందంబున మేరువునకుం బ్రదక్షిణంబుగా నష్ట నగంబులు నిలిచి యుండు; మేరుశిఖరంబున దశసహస్ర యోజనంబుల నిడుపు నంతియ విస్తారంబు నగుచు సువర్ణమయం బైన బ్రహ్మపురంబు దేజరిల్లు చుండు; నా పట్టణంబునకు నష్టదిక్కుల యందును లోకపాలుర పురంబు లుండు.

టీకా:

నరేంద్ర = రాజా {నరేంద్రుడు - నరులలో ఇంద్రునివంటివాడు, రాజు}; కురంగ = కురంగము {కురంగము - లేడి}; కురర = కురరము {కురురము - గొఱ్ఱె}; కుసుంభ = కుసుంభము {కుసుంభము - కుంకుమ పువ్వు}; వైకంకత = వైకంకతము; త్రికూట = త్రికూటము {త్రికూటము - మూడు శిఖరములు గలది}; శిశిర = శిశిరము {శిశిరము - చల్లనిది}; పతంగ = పతంగము {పతంగ - సూర్యుడు}; రుచక = రుచకము; నిషధ = నిషధము {నిషదము - కఠినమైనది}; శితివాస = శితివాసము {శితివాస - శితి (శివుని) వాసము (నివాసము)}; కపిల = కపిలము; శంఖ = శంఖము; ఆదులున్ = మొదలగునవి; అయిన = అయినట్టి; పర్వతంబులున్ = పర్వతములు; మేరుపర్వత = మేరుపర్వతము అనెడి; కర్ణిక = బొడ్డున; కున్ = కు; కేసరంబులు = కేసరములు; అయి = అయ్యి; పరివేష్టించి = చుట్టుకొని; ఉండున్ = ఉండును; ఆ = ఆ; మేరు = మేరువు యనెడి; నగ = పర్వతములలో; ఇంద్రంబున్ = ఇంద్రునివంటిదాని; కున్ = కి; పూర్వ = తూర్పు; భాగంబునన్ = వైపు; జఠర = జఠరకూటము; దేవకూటంబులునున్ = దేవకూటము; పశ్చిమంబునన్ = పశ్చిమదిక్కున; పవన = పవనయాత్రంబు; పారియాత్రంబులు = పారియాత్రము; అను = అనెడి; పర్వతంబులున్ = పర్వతములు; నాలుగు = నాలుగు (4); దక్షిణ = దక్షిణము; ఉత్తరంబులన్ = ఉత్తరము లందు; ఒండొంటికి = ఒక్కోదానికి; అష్టాదశసహస్ర = పద్దెనిమిదివేలు (18,000); యోజనంబులన్ = యోజనముల; నిడుపును = పొడవు; పూర్వ = తూర్పు; పశ్చిమంబులున్ = పడమరలు; ద్విసహస్ర = రెండువేల (2,000); యోజనంబులన్ = యోజనముల; వెడల్పునున్ = వెడల్పును; అగుచున్ = అగుచూ; దక్షిణంబునన్ = దక్షిణమువైపున; కైలాస = కైలాసపర్వతము; కరవీరంబులు = కరవీరపర్వతములు; ఉత్తరంబునన్ = ఉత్తరదిక్కున; త్రిశృంగ = త్రిశృంగపర్వతము; మకరంబులు = మకరపర్వతములు; అను = అనెడి; నామంబులు = పేర్లు; కల = కలిగిన; పర్వతంబులున్ = పర్వతములు; నాలుగును = నాలుగు (4); పూర్వ = తూర్పు; పశ్చిమంబులన్ = పడమరలకి; అష్టాదశసహస్ర = పద్దెనిమిదివేలు (18,000); యోజనంబులున్ = యోజనములు; నిడుపును = పొడవు; దక్షిణ = దక్షిణము; ఉత్తరంబులన్ = ఉత్తరములకి; ద్విసహస్ర = రెండువేల (2, 000); యోజనంబుల = యోజనములు; వెడల్పునున్ = వెడల్పును; అగుచున్ = అగుచు; అగ్నిపురుషున్ = అగ్నిహోత్రున; కున్ = కు; ప్రదక్షిణంబు = చుట్టుకొని ఉండునవి; అగు = అయినట్టి; పరిస్తరణంబుల = చుట్టు పరచిన దర్భల; చందంబునన్ = విధముగ; మేరువున్ = మేరు పర్వతమున; కున్ = కు; ప్రదక్షిణంబుగా = చుట్టును; అష్ట = ఎనిమిది (8); నగంబులున్ = కొండలు; నిలిచి = నిలబడి; ఉండున్ = ఉండును; మేరు = మేరుపర్వత; శిఖరంబునన్ = శిఖరము నందు; దశసహస్ర = పదివేల (10, 000); యోజనంబుల = యోజనముల; నిడుపును = పొడవును; అంతియ = అంతే; విస్తారంబును = వెడల్పును; అగుచున్ = అగుచూ; సువర్ణ = బంగారముతో; మయంబున్ = నిండినది; ఐన = అయినట్టి; బ్రహ్మపురంబున్ = బ్రహ్మపురము; తేజరిల్లుచుండున్ = ప్రకాశిస్తుండును; ఆ = ఆ; పట్టణంబున్ = పట్టణమున; కున్ = కు; అష్ట = ఎనిమిది (8); దిక్కులన్ = దిక్కుల; అందునున్ = వైపునను; లోకపాలుర = లోకపాలకుల; పురంబులున్ = పట్టఁములు; ఉండున్ = ఉండును;

భావము:

రాజా! మేరుపర్వతం తామరదుద్దు. దాని చుట్టూ కురంగం, కురరం, కుసుంభం, వైకంకతం, త్రికూటం, శిశిరం, పతంగం, రుచకం, విషధం, శితివాసం, కపిలం, శంఖం మొదలైన పర్వతాలు కేసరాలుగా ఉన్నాయి. ఆ మేరుపర్వతానికి తూర్పుభాగంలో జఠరగిరి, దేవకూటం అనే పర్వతాలున్నాయి. పడమట పవనగిరి, పారియాత్రం అనే పర్వతాలున్నాయి. ఈ నాలుగు పర్వతాలు ఒక్కొక్కటి దక్షిణం నుండి ఉత్తరం వరకు పద్దెనిమిది యోజనాల పొడవు, తూర్పు నుండి పడమటి వరకు రెండువేల యోజనాల వెడల్పు కలిగి ఉంటాయి. మేరువు చుట్టూ ఉన్న ఎనిమిది కొండలు అగ్నిహోత్రునికి ప్రదక్షిణం చేస్తున్న జ్వాలల వలె నిలిచి ఉన్నాయి. మేరుపర్వత శిఖరంలో బ్రహ్మపురం ఉంది. అది పదివేల యోజనాల పొడవు, అంతే వెడల్పు కలిగిన ప్రదేశం. అదంతా బంగారు భూమి. ఆ బ్రహ్మపురానికి ఎనిమిది దిక్కులలోను అష్టదిక్పాలకుల పట్టణాలున్నాయి.