పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : భూ ద్వీప వర్ష విస్తారములు

  •  
  •  
  •  

5.2-20-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు పూర్వపశ్చిమంబులు లవణసాగరాంతంబులై యున్న సీమాపర్వతంబుల యందు నీలశ్వేతశృంగవ త్పర్వతంబులు నిడివిని యథాక్రమంబుగా దశమాంశ న్యూనప్రమాణ యోజనంబులు గలవిగా నుండు; వీని మధ్య ప్రదేశంబున రమ్యక హిరణ్మయ కురువర్షంబు లను నామంబులు గల వర్షంబులుండు; వాని విస్తారంబులు నవ సహస్ర యోజనంబులు గలిగి లవణ సముద్రాంతంబులై క్రమంబున నీలాది పర్వతదీర్ఘ పరిమాణంబుల నుండు; నిలావృత వర్షంబునకు దక్షిణంబున నిషధ హేమకూట హిమవత్పర్వతంబు లను సీమాపర్వతంబులును, బూర్వపశ్చిమంబులు నిడుపును, దక్షిణోత్తరంబులు విశాలంబును నగుచు, నా నీలాదిపర్వతంబుల తీరున నుండు; నా గిరుల మధ్యప్రదేశంబున హరివర్ష కింపురుషవర్ష భారతవర్షంబు లను నామంబులు గల వర్షంబు లుండు; నా యిలావృతవర్షంబునకుఁ బశ్చిమంబున మాల్యావత్పర్వతంబును, బూర్వభాగంబున గంధమాదనంబును, సీమాపర్వతంబులు; పూర్వపశ్చిమంబులు నిడుపును దక్షిణోత్తరంబులు విశాలంబును నగుచు నీలపర్వత నిషధపర్వతంబులం గదిసి, ద్విసహస్ర యోజనంబుల విస్తారంబై యుండు; మాల్యవత్పర్వతంబు పశ్చిమసముద్రాంతంబై కేతుమాలవర్షంబును, గంధమాదనపర్వతంబునకుఁ బూర్వభాగంబున సముద్రాంతం బగుచు భద్రాశ్వవర్షంబును, మేరువునకుం దూర్పున మందరపర్వతంబును, దక్షిణంబున మేరు మందర పర్వతంబులును, బడమటి పార్శంబుల నుత్తరమునం గుముదపర్వతంబులు నను నామంబులు గలిగి యయుత యోజనోన్నతంబులయి మేరునగం బను మధ్యోన్నత మేధి స్తంభంబునకుం జతుర్ముఖంబుల హ్రస్వస్తంభములుం బోలె నుండు; నా చతుస్తంభంబుల యందును బర్వతశిఖరంబులఁ వెలుఁగొందు కేతువులబోలె చూత జంబూ కదంబ న్యగ్రోధంబు లను వృక్షరాజంబులు గ్రమంబున నొండొంటికి నేకాదశశత యోజనాయతంబును శత యోజన విస్తారంబును గలిగి యుండు; మఱియు నా పర్వత శిఖరంబులం గ్రమంబునం బయో మధ్విక్షు రస మృష్ట జలంబులు గలిగి శత యోజన విస్తారంబు లయిన సరోవరంబులు దేజరిల్లు; నందు సుస్నాతు లగు వారలకు యోగైశ్వర్యంబులు స్వభావంబునం గలుగు మఱియు నందన చైత్రరథ వైభ్రాజిక సర్వతోభద్రంబు లను నామంబులుగల దేవో ద్యానంబు లా పర్వతశిఖరంబుల వెలుఁగొందుచుండు; నందు దేవతాగణంబులు దేవాంగనలం గూడి గంధర్వుల గీతనృత్యంబులు గనుంగొనుచు విహరింతు; రంత.

టీకా:

ఇట్లు = ఈ విధముగను; పూర్వ = తూర్పు; పశ్చిమంబులు = పడమరలను; లవణసాగర = ఉప్పుసముద్రము; అంతంబులు = వరకు గలవి; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; సీమా = సరిహద్దులలోని; పర్వతంబులన్ = పర్వతములు; అందున్ = అందలి; నీల = నల్లని; శ్వేత = తెల్లని; శృంగవత్ = శృంగవంతము; పర్వతంబులు = పర్వతములు; నిడివిని = పొడవులో; యథాక్రమంబుగా = వరుసగా; దశమాంశ = పదవవంతు (1/10వంతు); న్యూన = తక్కువ; ప్రమాణ = కొలతలు కలిగిన; యోజనంబులున్ = యోజనముల; కలవిగాన్ = కలిగినవిగా; ఉండున్ = ఉండును; వీని = వీటి యొక్క; మధ్య = నడిమి; ప్రదేంబునన్ = ప్రదేశములో; రమ్యక = రమ్యకవర్షము; హిరణ్మయ = హిరణ్మయవర్షము; కురు = కురు; వర్షంబులున్ = వర్షములు; అను = అనెడి; నామంబులున్ = పేర్లు; కల = కలిగిన; వర్షంబులున్ = వర్షములు, దేశములు; ఉండున్ = ఉండును; వాని = వాటి; విస్తారంబులు = వైశాల్యములు; నవసహస్ర = తొమ్మిదివేల (9,000); యోజనంబులున్ = యోజనములు; కలిగి = ఉండి; లవణసముద్ర = లవణసముద్రములు; అంతంబులు = వరకుగలవి; ఐ = అయ్యి; క్రమంబునన్ = వరుసగా; నీల = నీలికొండలు; ఆది = మొదలైన; పర్వత = పర్వతముల; దీర్ఘ = పొడవైన; పరిమాణంబుల = కొలతలు కలిగి; ఉండున్ = ఉండును; ఇలావృత = ఇలావృత మనెడి; వర్షంబున్ = వర్షమున; కున్ = కు; దక్షిణంబునన్ = దక్షిణమువైపున; నిషద = నిషదము; హిమకూట = హిమకూటము; హిమవత్ = హిమవంతములు అనెడి; పర్వతంబులు = పర్వతములు; అను = అనెడి; సీమా = సరిహద్ధు; పర్వతంబులును = పర్వతములు; పూర్వ = తూర్పు; పశ్చిమంబులు = పడమరలు; నిడుపునున్ = పొడవులు; దక్షిణ = దక్షిణము; ఉత్తరంబున్ = ఉత్తరములతో; విశాలంబున్ = వైశైల్యములు గలవి; అగుచున్ = అగుచూ; ఆ = ఆ; నీల = నీలికొండలు; ఆది = మొదలగు; పర్వతంబుల = పర్వతముల; తీరునన్ = వలె; ఉండున్ = ఉండును; ఆ = ఆ; గిరుల = కొండల; మధ్య = మధ్య; ప్రదేశంబునన్ = ప్రదేశములో; హరివర్ష = హరివర్షము; కింపురుషవర్ష = కింపురుషవర్షము; భారతవర్షంబులు = భారతవర్షము; అను = అనెడి; నామంబులున్ = పేర్లు; కల = కలిగిన; వర్షంబులున్ = దేశములు; ఉండున్ = ఉండును; ఆ = ఆ; ఇలావృతవర్షంబున్ = ఇలావృతవర్షమున; కున్ = కు; పశ్చిమంబున = పడమర వైపు; మాల్యవత్ = మాల్యవంతము యనెడి; పర్వతంబును = పర్వతమును; పూర్వ = తూర్పు; భాగంబునన్ = దిక్కున; గంధమాదనంబును = గంధమాదనపర్వతమును; సీమా = సరిహద్ధు; పర్వతంబులు = పర్వతములు; పూర్వ = తూర్పు; పశ్చిమంబులున్ = పడమరలకు; నిడుపునున్ = పొడవును; దక్షిణ = దక్షిణము; ఉత్తరంబులున్ = ఉత్తరములకు; విశాలంబున్ = వెడల్పును; అగుచు = కలిగియుండి; నీలపర్వత = నీలికొండలు; నిషధ = నిషధ అనెడి; పర్వతంబులన్ = పర్వతములను; కదిసి = చేరి; ద్విసహస్ర = రెండువేల (2,000); యోజనంబులున్ = యోజనముల; విస్తారంబున్ = విస్తృతి కలిగినవి; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; మాల్యవత్ = మాల్యవంతము అనెడి; పర్వతంబు = పర్వతము; పశ్చిమసముద్ర = పశ్చిమసముద్రము; అంతంబు = వరకు గలది; ఐ = అయ్యి; కేతుమాలవర్షంబును = కేతుమాలవర్షము; గంధమాదనపర్వతంబున్ = గంధమాదనపర్వతమున; కున్ = కు; పూర్వ = తూర్పు; భాగంబునన్ = దిక్కువైపున; సముద్ర = సముద్రము; అంతంబు = వరకు కలది; అగుచున్ = అగుచూ; భద్రాశ్వవర్షంబును = భద్రాశ్వవర్షము; మేరువున్ = మేరునగమున; కున్ = కు; తూర్పునన్ = తూర్పువైపున; మందరపర్వతంబును = మందరపర్వతమును; దక్షిణంబునన్ = దక్షిణమువైపున; మేరు = మేరు మరియు; మందర = మందర; పర్వతంబులును = పర్వతములును; పడమటి = పశ్చిమము; పార్శంబులన్ = వైపుల; ఉత్తరమునన్ = ఉత్తరపువైపు; కుముదపర్వతంబులును = కుముదపర్వతములును; అను = అనెడి; నామంబులున్ = పేర్లు; కలిగి = కలిగినట్టి; అయుత = పదివేల (10,000); యోజన = యోజనముల; ఉన్నతంబులున్ = పెద్దవి; అయి = అయ్యి; మేరునగంబు = మేరుశిఖరము; అను = అనెడి; మధ్య = నడిమి నుండెడి; ఉన్నత = ఎత్తైన; మేధిస్తంభంబున్ = నట్రాట, నెడికఱ్ఱ, ఇరుసు; కున్ = కు; చతుర్ = నాలుగు (4); ముఖంబులన్ = వైపులను; హ్రస్వ = పొట్టి; స్తంభంబులున్ = రాటలు; పోలెన్ = వలె; ఉండున్ = ఉండును; ఆ = ఆ; చతుః = నాలుగు (4); స్తంభంబులన్ = స్తంభముల; అందున్ = అందలి; పర్వత = పర్వతముల; శిఖరంబులన్ = కొండకొన లందు; వెలుగొందు = ప్రకాశించెడి; కేతువులన్ = జండాల; పోలెన్ = వలె; చూత = మామిడి; జంబూ = నేరేడు; కదంబ = కడిమి; న్యగ్రోధంబులను = జువ్వి; అను = అనెడి; వృక్షరాజంబులున్ = మహావృక్షములు {వృక్షరాజము - వృక్షములలో రాజు వంటివి, మహావృక్షములు}; క్రమంబునన్ = వరుసగా; ఒండొంటికిన్ = ఒకదానికొకటి; ఏకాదశశత = పదకొండువేల (11,000); యోజన = యోజనముల; ఆయతంబును = పొడవును; శత = వంద (100); యోజన = యోజనముల; విస్తారంబునున్ = విస్తీర్ణమును; కలిగి = ఉండి; ఉండున్ = ఉండును; మఱియున్ = ఇంకనూ; ఆ = ఆ; పర్వతశిఖరంబులన్ = కొండకొన లందు; క్రమంబునన్ = చక్కగా; పయస్ = పాలు; మధు = తేనె; ఇక్షురస = చెరుకురసము; మృష్ట = రుచిగల; జలంబులున్ = నీరును; కలిగి = కలిగి నట్టి; శత = నూరు (100); యోజన = యోజనముల; విస్తారంబులున్ = వైశాల్యములు; అయిన = అయిన; సరోవరంబులున్ = సరోవరములు; తేజరిల్లున్ = విలసిల్లును; అందున్ = వానిలో; సుస్నాతులు = చక్కగా స్నానము చేసినవారు; అగు = అయిన; వారల్ = వారి; కున్ = కి; యోగ = అపూర్వ వస్తు ప్రాప్తి; ఐశ్వర్యంబులున్ = సంపదలు; స్వభావంబునన్ = సహజసిద్ధముగ; కలుగున్ = కలుగును; మఱియున్ = ఇంకను; నందన = నందనము; చైత్రరథ = చైత్రరథము; వైభ్రాజిక = వైభ్రాజికము; సర్వతోభద్రంబుల్ = సర్వతోభద్రము; అను = అనెడి; నామంబులున్ = పేర్లు; కల = కలిగిన; దేవ = దివ్యమైన; ఉద్యానంబులున్ = ఉద్యానవనములు; ఆ = ఆ; పర్వతశిఖరంబులన్ = కొండకొన లందు; వెలుగొందుచుంచున్ = ప్రకాశిస్తుండును; అందున్ = వానిలో; దేవతా = దేవతల; గణంబులున్ = సమూహములు; దేవాంగనలన్ = దేవతాస్త్రీలను; కూడి = కలిసి; గంధర్వుల = గంధర్వుల యొక్క; గీత = గీతములు, పాటలు; నృత్యంబులున్ = నృత్యములు; కనుగొనుచు = తిలకించుతూ; విహరింతురు = విహరిస్తుంటారు; అంత = అంతట;

భావము:

తూర్పు పడమరలలో ఉప్పునీటి సముద్రం వరకూ ఉన్న సరిహద్దు పర్వతాలలో నీల శ్వేత శృంగవత్పర్వతాలు క్రమంగా ఒకదాని కంటె ఒకటి పది యోజనాలు తక్కువ పొడవు కలిగి ఉంటాయి. ఈ మూడు పర్వతాల నడిమి ప్రదేశంలో రమ్యకం, హిరణ్మయం, కురు అనే మూడు వర్షాలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటి తొమ్మిది వేల యోజనాల విస్తృతి కలిగి ఉన్నాయి. ఇవన్నీ సముద్రం దాకా వ్యాపించి ఉన్నాయి. ఆ మూడు వర్షాల పొడవు నీల శ్వేత శృంగవత్పర్వతాల పొడవుతో సమానంగా ఉంటుంది. ఇలావృత వర్షానికి దక్షిణంగా మూడు సరిహద్దు పర్వతాలు ఉన్నాయి. అవే నిషధ పర్వతం, హేమకూట పర్వతం, హిమవత్పర్వతం. ఇవి తూర్పునుండి పడమటి వరకు పొడవు, ఉత్తరం నుండి దక్షిణం వరకు వెడల్పు కలిగి ఉన్నాయి. వీని నిడివి నీల శ్వేత శృంగవత్పర్వతాలతో సమానంగా ఉంటుంది. ఈ మూడు పర్వతాల నడుమ మూడు భూప్రదేశాలు ఉన్నాయి. అవే హరివర్షం, కింపురుషం, భారతవర్షం అనేవి. ఇలావృత వర్షానికి పడమట మాల్యవంతం, తూర్పున గంధమాదనం అనే సరిహద్దు పర్వాలున్నాయి. అవి తూర్పు పడమరలకు పొడవూ, ఉత్తర దక్షిణాలకు వెడల్పూ కలిగి నీలపర్వత నిషధపర్వతాలను ఆనుకొని ఉన్నాయి. వాని విస్తృతి రెండు వేల యోజనాలు. మాల్యవంతం, గంధమాదనం అనే ఈ రెండూ కేతుమాల భద్రాశ్వ వర్షాలకు సరిహద్దు పర్వతాలుగా ఉన్నాయి. సుమేరు పర్వతానికి తూర్పున మందర పర్వతం, దక్షిణాన మేరుమందర పర్వతం, పడమట సుపార్శ్వ పర్వతం, ఉత్తరాన కుముద పర్వతం ఉన్నాయి. ఈ నాలుగు పర్వతాలు పదివేల యోజనాలు ఎత్తు కలిగి ఉన్నవి. ఇన్నిటికి నడుమ మేరుపర్వతం ఎత్తుగా పొడుగైన స్తంభంలాగా ఉంటే మిగిలిన పర్వతాలు నాలుగు ప్రక్కల నాటిన పొట్టి గుంజల లాగా ఉన్నాయి. ఈ నాలుగు పర్వత శిఖరాల మీద పతాకాల లాగా క్రమంగా పెద్ద పెద్ద మామిడి చెట్లూ, నేరేడు చెట్లూ, కడిమి చెట్లూ, మఱ్ఱిచెట్లూ ఉంటాయి. ఈ వృక్షరాజాలు ఒక్కొక్కటి పదకొండు వందల యోజనాల పొడవు, నూరు యోజనాల వెడల్పు కలిగి ఉంటాయి. ఇంతేకాక ఆ నాలుగు పర్వత శిఖరాల మీద వంద యోజనాల విస్తీర్ణం కలిగిన నాలుగు పెద్ద పెద్ద సరోవరాలు ఉన్నాయి. క్రమంగా వాటి పేర్లు క్షీరసరస్సు, మధు సరస్సు, ఇక్షురస సరస్సు, నిర్మల జల సరస్సు. ఆ సరస్సులలో స్నానం చేసేవారికి స్వభావం చేతనే యోగనిష్ఠ, అణిమాది సిద్ధులు సిద్ధిస్తాయి. ఇంకా ఆ పర్వత శిఖరాలపై నందనం, చైత్రరథం, వైభ్రాజకం, సర్వతోభద్రం అనే దేవోద్యానాలు ఉన్నాయి. ఈ ఉద్యానవనాలలో దేవతలు దేవకాంతలతో కూడి గంధర్వుల ఆటపాటలను ఆలకిస్తూ, ఆలోకిస్తూ ఆనందంగా విహరిస్తారు.