పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : భూ ద్వీప వర్ష విస్తారములు

  •  
  •  
  •  

5.2-17-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నరేంద్ర జంబుద్వీపంబు భూపద్మంబునకు మధ్యప్రదేశంబున లక్ష యోజనంబుల వెడల్పు నంతియ నిడుపునుం గలిగి కమలపత్రంబునుం బోలె వర్తులాకారంబు నవసహస్ర యోజన పరిమితాయామంబు గల నవవర్షంబుల నష్ట మర్యాదా గిరులునుం గలిగి విభక్తం బయి యుండు; నందు మధ్యవర్షం బిలావృతవర్షం బగు; నందు మధ్యప్రదేశంబున సువర్ణమయంబయి.

టీకా:

నరేంద్ర = రాజా; జంబుద్వీపంబున్ = జంబూద్వీపము; భూ = భూమి యనెడి; పద్మంబున్ = పద్మమున; కున్ = కు; మధ్య = నడిమిది యైన; ప్రదేశంబునన్ = స్థలము యందు; లక్ష = లక్ష (1,00,000); యోజనంబుల = యోజనముల; వెడల్పు = వెడల్పు; అంతియ = అంతే; నిడుపునున్ = పొడుగు; కలిగి = ఉండి; కమల = తామర; పత్రంబునున్ = ఆకు; పోలెన్ = వలె; వర్తుల = గుండ్రని; ఆకారంబున్ = ఆకారము; నవసహస్ర = తొమ్మిదివేల (9,000); యోజన = యోజనముల; పరిమిత = వరకు గల; ఆయంబున్ = వైశాల్యమును; కల = కలిగిన; నవ = తొమ్మిది (9); వర్షంబులన్ = వర్షములను; అష్ట = ఎనిమిది; మర్యాదా = సరిహద్దులవలె; గిరులునున్ = పర్వతములు; కలిగి = ఉండి; విభక్తంబు = విభజింపబడినది; అయి = అయ్యి; ఉండున్ = ఉండును; అందున్ = దానిలో; మధ్య = నడిమినిగల; వర్షంబున్ = వర్షము; ఇలావృతంబున్ = ఇలావృతవర్షము {ఇలావృతము - ఇల (భూమి)చేత ఆవృతము (చుట్టబడినది), సముద్రము ఏసరిహద్దున లేనిది}; అగున్ = అయియున్నది; అందున్ = దానిలో; మధ్య = నడిమి; ప్రదేశంబునన్ = స్థలము యందు; సువర్ణ = బంగారముతో; మయంబున్ = నిండియున్నది; ఆయి = అయ్యి.

భావము:

“రాజా! పద్మాకారమైన భూమి మధ్య జంబూద్వీపం తామరరేకు వలె గుండ్రంగా కనిపిస్తుంది. అది లక్ష యోజనాల పొడవు, లక్షయోజనాల వెడల్పు కలిగి ఉంటుంది. దానిలో గుండ్రటి ఆకారాలతో తొమ్మిది వేల యోజనాల విస్తీర్ణం కలిగిన తొమ్మిది వర్షాలు ఉన్నాయి. వాటి నన్నిటినీ విభజించే సరిహద్దులుగా ఎనిమిది పర్వతాలు ఉన్నవి. ఆ తొమ్మిది వర్షాలలో నట్టనడుమ ఇలావృతం అనే వర్షం ఉంది. దాని నడుమ బంగారు రంగుతో కూడి…