పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : గయుని చరిత్రంబు

  •  
  •  
  •  

5.2-10-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్టి మహాపురుషగుణగణ పరిపూర్ణుండగు గయునికి దక్షకన్యక లగు శ్రద్ధా మైత్రీ దయాదులు దమయంతన వచ్చి కోరిక లొసంగ, నతని ప్రజలకు వసుంధర కామధేనువై పిదుక, వేదంబులు సకల కామంబుల నిచ్చుచుండ, సంగరంబున భంగంబు నొందిన రాజులప్పనంబు లొసంగ, విప్రులు ధర్మం బాఱవపాలు పంచియిడ, నిరంతర సోమపానంబును శ్రద్ధాభక్తి యోగంబుఁ గలిగి యొనర్చు యజ్ఞంబుల నింద్రాది దేవతలు దృప్తులై యజ్ఞ ఫలంబుల నొసంగ, బ్రహ్మాది తృణగుల్మలతాంతంబుగా సకలలోకంబుల వారినిం దృప్తిం బొందించుచు, శ్రీహరిం దృప్తిఁ బొందఁ జేయుచు, గయుండు పెక్కుకాలంబు రాజ్యంబు జేసె; నట్టి గయునికి జయంతియందుఁ జిత్రరథ స్వాత్యవరోధను లను మువ్వురు గొడుకలు పుట్టిరి; యా చిత్రరథునికి నూర్ణయందు సామ్రాట్టును, వానికి నుత్కళ యందు మరీచియు, నా మేటికి బిందుమతియందు బిందుమంతుండును, నా బిందుమంతునకు సరఘయందు మధువును, మధువునకు సుమనస యనుదాని యందు వీరవ్రతుండును, నా వీరవ్రతునకు భోజయందు మన్యు ప్రమన్యువు లను నిరువురును, నందు మన్యువునకు సత్యయందు భువనుండును, నతనికి దోషయందుఁ ద్వష్టయు, నా త్వష్టకు విరోచనయందు విరజుం డను వాఁడును జనియించి; రంత.

టీకా:

అట్టి = అటువంటి; మహా = గొప్ప; పురుష = పురుషుల యొక్క; గుణ = సుగుణముల; గణ = సమూహమున; పరిపూర్ణుండు = పూర్తిగా గలవాడు; అగు = అయిన; గయుని = గయుని; కిన్ = కి; దక్ష = దక్షుని యొక్క; కన్యకలు = పుత్రికలు; అగు = అయిన; శ్రద్ధా = శ్రద్ధ; మైత్రి = మైత్రి; దయ = దయ; ఆదులున్ = మొదలగువారు; తమయంతనన్ = తమంత తామె; వచ్చి = వచ్చి; కోరికలున్ = వరములను; ఒసంగన్ = ఇవ్వగా; అతని = అతని; ప్రజల్ = ప్రజల; కున్ = కు; వసుంధర = భూదేవి {వసుంధర - వసు (సంపదలను) ధర (ధరించెడిది), భూమి}; కామధేనువు = కామధేనువు; ఐ = అయ్యి; పిదుకన్ = పితుకుతుండగ; వేదంబులున్ = వేదములు; సకల = సమస్తమైన; కామంబులన్ = వాంఛితములను; ఇచ్చుచుండన్ = కలుగజేయుచుండగ; సంగరంబునన్ = యుద్ధములలో; భంగంబున్ = ఓటమిని; ఒందిన = పొందినట్టి; రాజులు = రాజులు; అప్పనంబులు = కప్పములు; ఒసంగన్ = ఇచ్చుచుండగ; విప్రులున్ = బ్రాహ్మణులును; ధర్మంబున్ = పుణ్యములో; ఆరవ = ఆరవ (1/6); పాలు = వంతు; పంచియిడ = పంచివ్వగ; నిరంతర = ఎడతెగని; సోమపానంబునున్ = సోమపానము {సోమపానము - సోమరసము తాగుట, సామవేదమునందలి స్తోత్రము స్తోమము స్తోభము నుమ్నము శస్త్రము మొదలగువాని గానము ఆస్వాదించుట}; శ్రద్ధా = శ్రద్ధ; భక్తి = భక్తి; యోగంబులు = యోగములు; కలిగి = కలిగి ఉండి; ఒనర్చు = ఆచరించెడి; యజ్ఞంబులన్ = యజ్ఞములతో; ఇంద్ర = ఇంద్రుడు; ఆది = మొదలగు; దేవతలున్ = దేవతలు; తృప్తులు = సంతృప్తి చెందినవారు; ఐ = అయ్యి; యజ్ఞ = యజ్ఞముల యొక్క; ఫలంబున్ = ఫలితములను; ఒసంగన్ = ఇస్తూ ఉండగ; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆది = మొదలు; తృణ = గడ్డిపరక; గుల్మ = పొదలు; లతాంతబుగాన్ = పూవులు కలదిగా; సకల = నిఖిలమైన; లోకంబుల = లోకములలోని; వారినిన్ = వారి నందరను; తృప్తిన్ = సంతృప్తులను; పొందించుచున్ = కలిగించుచూ; శ్రీహరిన్ = నారాయణుని; తృప్తిన్ = సంతృప్తిని; పొందజేయుచున్ = కలిగించుచూ; గయుండు = గయుడు; పెక్కు = ఎక్కువ; కాలంబున్ = కాలము; రాజ్యంబున్ = రాజ్యమును; చేసెన్ = చేసెను; అట్టి = అటువంటి; గయుని = గయుని; కిన్ = కి; జయంతి = జయంతి; అందున్ = ద్వారా; చిత్రరథ = చిత్రరథుడు; స్వాతి = స్వాతి; అవరోధనులు = అవరోధనుడు; అను = అనెడి; మువ్వురు = ముగ్గురు; కొడుకులు = పుత్రులు; పుట్టిరి = జన్మించిరి; ఆ = ఆ; చిత్రరథుని = చిత్రరథుని; కిన్ = కి; ఊర్ణ = ఊర్ణ {ఊర్ణ - అల్లిక, సాలెగూడు, కనుబొమల ముడి యందలి సుడి}; అందు = వలన; సామ్రాట్టును = సామ్రాట్టు; వాని = వాని; కిన్ = కి; ఉత్కళ = ఉత్కళ {ఉత్కళ - నిర్వహకురాలు, ధురీణురాలు}; అందున్ = వలన; మరీచియున్ = మరీచి {మరీచి - వాయువు}; ఆ = ఆ; మేటి = గొప్పవాని; కిన్ = కి; బిందుమతి = బిందుమతి; అందున్ = వలన; బిందుమంతుడునున్ = బిందుమంతుడు; ఆ = ఆ; బిందుమంతున్ = బిందుమంతుని; కున్ = కి; సరఘ = సరఘ; అందున్ = వలన; మధువును = మధువు; మధువున్ = మధువున; కున్ = కు; సుమనస = సుమనస; అను = అనెడి; దాని = ఆమె; అందున్ = ద్వారా; వీరవ్రతుండును = వీరవ్రతుడు; ఆ = ఆ; వీరవ్రతున్ = వీరవ్రతుని; కున్ = కి; భోజ = భోజ; అందున్ = వలన; మన్యు = మన్యువు; ప్రమన్యువుల్ = ప్రమన్యువు; అను = అనెడి; ఇరువురును = ఇద్దరు (2); అందు = వారిలో; మన్యువున్ = మన్యువున; కున్ = కు; సత్య = సత్య; అందున్ = అందు; భువనుండును = భువనుడు; అతని = అతని; కిన్ = కి; దోష = దోష; అందున్ = వలన; త్వష్టయున్ = త్వష్ట; ఆ = ఆ; త్వష్ట = త్వష్ట; కున్ = కు; విరోచన = విరోచన; అందున్ = వలన; విరజుండు = విరజుడు; అనువాడునున్ = అనెడివాడు; జనియించిరి = పుట్టిరి; అంత = అంతట;

భావము:

మహాపురుషుల గుణగణాలు కలిగిన ఆ గయునికి దక్షప్రజాపతి కుమార్తెలైన శ్రద్ధ, మైత్రి, దయ మొదలైనవారు తమంత తాముగా వచ్చి కోరిన వరాలు ప్రసాదించారు. భూదేవి అతని ప్రజలకు కామధేను వయింది. వేదాలు కోరిన కోరికలను ఇచ్చాయి. అతనిచేత యుద్ధంలో ఓడిన రాజులు కప్పం చెల్లిస్తున్నారు. బ్రాహ్మణులు తమ పుణ్యంలో ఆరవపాలు పంచి ఇస్తున్నారు. ఎడతెగని సోమపానంతో, శ్రద్ధాభక్తులతో చేసే యజ్ఞాలతో ఇంద్రాది దేవతలు సంతృప్తి పడుతూ యజ్ఞఫలాన్ని ప్రసాదిస్తున్నారు. బ్రహ్మ మొదలు గడ్డిపరక వరకు అన్ని లోకాల ప్రాణులను, శ్రీహరిని తృప్తిపరుస్తూ గయుడు రాజ్యాన్ని పరిపాలించాడు. ఆ గయునికి “జయంతి” అనే భార్యవల్ల “చిత్రరథుడు”, “స్వాతి”, “అవరోధకుడు” అనే ముగ్గురు కొడుకులు పుట్టారు. అందులో చిత్రరథునికి “ఊర్ణ” అనే భార్యవల్ల “సమ్రాట్టు”; అతనికి “ఉత్కళ” వల్ల “మరీచి”; శ్రేష్ఠుడైన మరీచికి “బిందుమతి” వల్ల “బిందుమంతుడు”; అతనికి “సరఘ” వల్ల “మధువు”; మధువుకు “సుమనస” అనే భార్య వల్ల “వీరవ్రతుడు”; అతనికి “బోజ” వల్ల “మన్యువు”, “ప్రమన్యువు” అనే ఇద్దరు కుమారులు; అందులో మన్యువుకు “సత్య” అనే భార్య వల్ల “భువనుడు”; అతనికి “దోష” వల్ల “త్వష్ట”, ఆ “త్వష్ట”కు “విరోచన” వల్ల “విరజుడు” జన్మించారు.