పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : ఋషభుని తపంబు

  •  
  •  
  •  

5.1-73-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియుఁ బితృ గురు జననీ బంధు పతి దైవతంబులలో నెవ్వరైనను సంసార రూప మృత్యు రహితం బైన మోక్షమార్గంబుం జూపకుండిరేని వారెవ్వరును హితులు గా నేరరు; నాదు శరీరంబు దుర్విభావ్యంబు; నాదు మనంబు సత్త్వయుక్తంబును, ధర్మసమేతంబును, బాపరహితంబు నగుటంజేసి పెద్దలు నన్ను ఋషభు డండ్రు; గావున శుద్ధ సత్త్వమయం బైన శరీరంబునం బుట్టిన కుమారులైన మీర లందఱును సోదరుండును మహాత్ముండును నగ్రజుండును నైన భరతు నన్నెకాఁ జూచి యక్లిష్టబుద్ధిచే భజింపుం; డదియ నాకు శుశ్రూషణంబు; ప్రజాపాలనంబు చేయుట మీకును బరమధర్మం" బని మఱియు నిట్లనియె.

టీకా:

మఱియున్ = ఇంకను; పితృ = తండ్రి; గురు = గురువు; జననీ = తల్లి; బంధు = బంధువు; పతి = భర్త; దైవతంబుల్ = దైవత్వము గలవారల; లోన్ = అందు; ఎవ్వరైనను = ఎవరైన సరే; సంసార = సంసార యొక్క; రూప = రూపములో ఉన్న; మృత్యు = మృత్యువు; రహితంబు = లేనిది; ఐన = అయిన; మోక్ష = ముక్తిని చెందించు; మార్గంబున్ = దారిని; చూపకుండిరేని = చూపనిచో; వారు = వారు; ఎవ్వరును = ఎవరూ కూడ; హితులు = మంచి కోరువారు; కానేరరు = కాలేరు; నాదు = నా యొక్క; శరీరంబున్ = దేహము; దుర్విభావ్యంబున్ = భావింపలేనిది; నాదు = నా యొక్క; మనంబున్ = మనసు; సత్త్వ = సత్త్వగుణముతో; యుక్తంబునున్ = కూడినది; ధర్మ = ధర్మముతో; సమేతంబునున్ = కూడినది; పాప = పాపములు; రహితంబున్ = లేనిది; అగుటన్ = అగుట; చేసి = వలన; పెద్దలు = పెద్దవారు; నన్నున్ = నన్ను; ఋషభుడు = ఋషభుడు; అండ్రు = అనెదరు; కావునన్ = అందుచేత; శుద్ధ = పరిశుద్ధమైన; సత్త = సత్త్వగుణముతో; మయంబున్ = కూడినది; ఐన = అయిన; శరీరంబునన్ = దేహము నందు; పుట్టిన = జన్మించిన; కుమారులు = పుత్రులు; ఐన = అయిన; మీరలు = మీరు; అందఱును = అందరూ; సోదరుండును = సహోదరుడు; మహాత్ముండునున్ = గొప్పవాడు; అగ్రజుండునున్ = అన్నగారు {అగ్రజుడు – ముందు పుట్టినవాడు, అన్న}; ఐన = అయిన; భరతున్ = భరతుడిని; నన్నె = నేను; కాన్ = అగునట్లు; చూచి = చూసి; అక్లిష్ట = శిథిలము గాని; బుద్ధి = బుద్ధి; చేన్ = తోటి; భజింపుండు = సేవించండి; అదియ = అదే; నాకున్ = నాకు; శుశ్రూషణంబు = సేవించుట; ప్రజా = ప్రజలను; పాలనంబున్ = పరిపాలించుట; చేయుట = చేయుట; మీకునున్ = మీకు కూడ; పరమ = అతి ముఖ్యమైన; ధర్మంబున్ = ధర్మము; అని = అని; మఱియున్ = ఇంకనూ; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇంకా తండ్రి, గురువు, తల్లి, బంధువు ఎవరైనా సరే అక్షయమైన మోక్షమార్గం చూపలేక పోతే వారెవరూ హితులు కారు. నా శరీరం ఎలా ఏర్పడించో మీరు ఏమాత్రం ఊహించలేరు. నా మనస్సు సత్త్వగుణంతోను, ధర్మంతోను కూడి పాపరహితమైనట్టిది. అందువల్లనే ఆర్యులు నన్ను ఋషభుడు అన్నారు. శుద్ధ సాత్త్వికమైన నా శరీరంనుండి కుమారులై పుట్టిన మీరందరూ తోడబుట్టినవాడు, మీకు పెద్దవాడు, మహాత్ముడు అయిన భరతుణ్ణి నాలాగే భావించి సద్బుద్ధితో సేవించండి. అదే మీరు నాకు చేసే శుశ్రూష. ప్రజలను పరిపాలించడమే మీకు పరమధర్మం” అని చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు.