పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : ఋషభుని తపంబు

  •  
  •  
  •  

5.1-69-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు నంగనాసక్తులగు కాముకుల సంగంబు నిరయరూపం బయిన సంసారంబగు; మహత్సంగంబు మోక్షద్వారం బగు; నట్టి మహాత్ము లెవ్వ రనిన శత్రు మిత్ర వివేకంబు లేక సమచిత్తులును శాంతులును గ్రోధరహితులును సకలభూత దయాపరులును సాధువులును నగువారలు మహాత్ము లనందగుదు; రట్టి మహాత్ములు నా యందలి స్నేహంబె ప్రయోజనంబుగాఁ గలిగి యుండుటం జేసి విషయ వార్తాప్రవృత్తు లగు కుజనులందుఁ దమ దేహ గృహ మిత్ర దారాత్మజాదులందుఁ బ్రీతిలేక యుండుదురు; విషయాసక్తుఁ డయినవాఁడు వ్యర్థకర్మంబులం జేయు నట్టి దుష్కృత కర్మంబులం జేయువాఁ డెప్పుడును బాపకర్ముం డగుచుం గ్లేశదంబగు దేహంబు నొందుచుండుఁ; గావునఁ బాపమూలంబు లయిన కామంబులు గోరకుఁ; డీ జ్ఞానం బెంత కాలంబుఁ లేకయుండు నంతకాలంబు నాత్మతత్త్వం బెఱుంగంబడ; దా తత్త్వం బెఱుంగకుండుటజేసి దేహికి దుఃఖం బధికంబై యుండు; లింగదేహం బెంత దడ వుండు నంత దడవును మనంబు కర్మవశంబై జ్ఞానవంతంబుగాక యవిద్యం బాయకుండు; శరీరంబు గర్మమూలం బగుట వలనఁ గర్మంబులు చేయఁజనదు; వాసుదేవుం డగు నా యందుఁ బ్రీతి యెంత తడవు లేక యుండు నంతదడవును దేహధర్మంబులు బాధించు; విద్వాంసు డైనను దేహేంద్రియాదుల యందుఁ బ్రీతిచేసిన మిథునీభావ సుఖప్రధానం బగు గృహస్థాశ్రమంబు నంగీకరించి స్వరూప స్మృతి శూన్యుండై మూఢుం డగుచు, నందు సంసారతాపంబులఁ బొందుఁ; బురుషుండు స్త్రీతోడం గూడి యేకీభావంబు నొందుట దనకు హృదయ గ్రంథియై యుండు; నందు జనునకు గృహక్షేత్ర సుతాప్త విత్తంబులందు "నేను నాయది" యనియెడి మోహంబు గలుగు; నట్టి స్త్రీపురుష మిథునీ భావంబుచే సంతానంబు గలుగు; నా సంతాన కారణంబున గృహక్షేత్ర విత్తాదులు సంపాదింపంబడు; నందు మోహం బధికం బగుటంజేసి మోక్షమార్గంబు దవ్వగు; నిట్లు సంసారంబునం దుండియు మనంబున నెపుడు ముక్తిచింతం జేయు నప్పుడు సంసారంబును బాయు; మోక్షోపాయంబులు పరమగురుండనైన నా యందుల భక్తి చేయుటయు, విగతతృష్ణయు, ద్వంద్వ తితిక్షయు, సర్వలోకంబు లందుల జంతు వ్యసనావగతియు, నీశ్వరవిషయక జ్ఞానాపేక్షయుఁ, దపంబును, విగతేచ్ఛయు, మత్కృతకర్మంబులు మత్కథలు వినుటయు, నన్నె దైవంబు గా నెఱుంగుటయు, నస్మద్గుణ కీర్తనంబులును, నిర్వైరత్వసామ్యోపశ మంబులును, దేహగేహంబులందు నాత్మబుద్ధి జిహాసయు, నధ్యాత్మ యోగంబును, నేకాంతసేవయుఁ, బ్రాణేంద్రియాత్మలఁ గెలుచుటయుఁ, గర్తవ్యాపరిత్యాగంబును, సచ్ఛ్రద్ధయు, బ్రహ్మచర్యంబును, గర్తవ్యకృత్యంబు లందుల నప్రమత్తుండగుటయు, వాజ్ఞియమనంబును, సర్వంబు నన్నకా దలంచుటయు, జ్ఞానంబును, విజ్ఞాన విజృంభితంబైన యోగంబును, ధృత్యుద్యమంబును, సాత్త్వికంబును నాదిగాఁ గల తెఱంగుల చేత లింగదేహంబు జయించి దేహి కుశలుం డగుచు నుండవలయు.

టీకా:

మఱియున్ = ఇంకను; అంగనా = స్త్రీల ఎడ; ఆసక్తులు = లాలస గలవారు; అగున్ = అయిన; కాముకులన్ = కాముకుల తోడి; సంగంబున్ = సాంగత్యము; నిరయ = నరక; రూపంబు = రూపమన ఉన్నది; అయిన = అయిన; సంసారంబు = సంసారము; అగున్ = అగును; మహత్ = గొప్పవారి తోడి; సంగంబున్ = సాంగత్యము; మోక్ష = ముక్తికి; ద్వారంబున్ = దారితీయించెడిది; అగున్ = అగును; అట్టి = అటువంటి; మహాత్ములు = గొప్పవారు; ఎవ్వరు = ఎవరు; అనినన్ = అన్నచో; శత్రు = శత్రువులు; మిత్ర = మిత్రులు; వివేకంబు = అనెడి ఆలోచన; లేక = లేకుండగ; సమ = సమత్వము గల; చిత్తులును = మనసు గలవారు; శాంతులును = శాంతస్వభావులు; క్రోధ = కోపము; రహితులును = లేనివారు; సకల = సర్వ; భూత = జీవుల ఎడ; దయాపరులును = దయ గలవారును; సాధువులును = సాధుస్వభావులును; అగు = అయిన; వారలు = వారు; మహాత్ములు = గొప్పవారు; అనన్ = అనుటకు; తగుదురు = తగినవారు; అట్టి = అటువంటి; మహాత్ములు = గొప్పవారు; నా = నా; అందలి = ఎడ; స్నేహంబె = ప్రీతి మాత్రమే; ప్రయోజనంబుగా = లాభముగా; కలిగి = కలిగి; ఉండుటన్ = ఉండుట; చేసి = వలన; విషయ = ఇంద్రియార్థముల యందు; వార్తా = వర్తించుట; ప్రవృత్తులు = ప్రవర్తనగా కలవారు; అగు = అయిన; కు = చెడ్డ; జనులు = వారు; అందున్ = ఎడల; తమ = తమ; దేహ = శరీరము; గృహ = ఇల్లు; మిత్ర = హితులు; దార = భార్య; ఆత్మజ = సంతానము; ఆదులు = మొదలగువారి; అందున్ = ఎడల; ప్రీతి = మిక్కిలి ఆసక్తి; లేక = లేకుండగ; ఉండుదురు = ఉంటారు; విషయ = ఇంద్రియార్థము లందు; ఆసక్తుడు = తగులుకొన్నవాడు; అయిన = అయినట్టి; వాడు = వాడు; వ్యర్థ = అనవసర; కర్మంబులన్ = కర్మములను; చేయున్ = చేయును; అట్టి = అటువంటి; దుష్కృత = చెడ్డపనులైన; కర్మంబులన్ = కర్మములను; చేయువాడు = చేసెడివాడు; ఎప్పుడునున్ = ఎప్పుడును; పాపకర్ముండు = పాపము చేసినవాడు; అగుచున్ = అగుచూ; క్లేశదంబున్ = చిక్కులను కలిగించెడివి; అగు = అయిన; దేహంబున్ = జన్మములను; ఒందుచుండు = పొందుచుండును; కావునన్ = అందుచేత; పాప = పాపమును; మూలంబులు = కలిగించునవి; అయిన = అయిన; కామంబులన్ = కామములను; కోరకుడు = కోరుకొనకండి; ఈ = ఈ విధమైన; జ్ఞానంబున్ = జ్ఞానము; ఎంతకాలంబున్ = ఎంతకాలమైతే; లేక = లేకుండగా; ఉండున్ = ఉండునో; అంతకాలము = అంతవరకు; ఆత్మతత్త్వంబున్ = ఆత్మతత్త్వము; ఎఱుంగబడదు = తెలియదు; ఆ = ఆ; తత్త్వంబున్ = తత్త్వము; ఎఱుంగకుండుట = తెలియకపోవుట; చేసి = వలన; దేహి = జీవుని {దేహి - దేహము ధరించినవాడు, జీవుడు}; కిన్ = కి; దుఃఖంబు = దుఃఖము; అధికంబున్ = ఎక్కువగా; ఐ = కలిగి; ఉండు = ఉండును; లింగదేహంబు = లింగదేహము {లింగదేహము - పూర్వసంస్కార రూపమైన దేహము}; ఎంతతడవున్ = ఎంత వరకు; ఉండున్ = ఉండునో; అంతతడవునున్ = అంత వరకు; మనంబున్ = మనసు; కర్మ = కర్మములకు; వశంబున్ = లొంగినది; ఐ = అయ్యి; జ్ఞానవంతంబున్ = జ్ఞానము గలిగినది; కాక = కాకుండగా; అవిద్యన్ = మాయను {అవిద్య - ఆత్మతత్త్వ విద్యకు అన్యమైనది, మాయ}; పాయక = విడువడక; ఉండున్ = ఉండును; శరీరంబు = జన్మములు; కర్మ = కర్మములు; మూలంబులు = ఆధారభూతముగా కలవి; అగుటన్ = అగుట; వలనన్ = వలన; కర్మంబులున్ = కర్మములను; చేయన్ = చేయుట; చనదు = తగదు; వాసుదేవుండు = నారాయణుడు {వాసుదేవుడు - (సర్వభూతము లందు) వసించెడి దేవుడు, విష్ణువు}; అగు = అయిన; నా = నా; అందున్ = ఎడల; ప్రీతిన్ = భక్తిని; ఎంతతడవున్ = ఎంతవరకు; లేక = లేకుండగ; ఉండున్ = ఉండునో; అంతతడవునున్ = అంత వరకు; దేహ = శారీరక; ధర్మంబులు = ధర్మములు; బాధించున్ = బాధించును; విద్వాంసుడు = జ్ఞాని; ఐననున్ = అయినప్పటికని; దేహ = దేహము నందు; ఇంద్రియ = ఇంద్రియార్థముల; అందున్ = ఎడల; ప్రీతిన్ = మిక్కిలి ఆసక్తి; చేసిన = కలిగిన; మిథునీ = దాంపత్య; భావ = భావము నందలి; సుఖ = సుఖములు; ప్రధానంబు = ముఖ్య మగునవి; అగు = అయిన; గృహస్థాశ్రమంబున్ = గృహస్తు జీవితమును; అంగీకరించి = స్వీకరించి; స్వరూప = తన తత్త్వము యొక్క; స్మృతి = జ్ఞానము, తలపు; శూన్యుండు = లేనివాడు; ఐ = అయ్యి; మూఢుండున్ = తెలివి లేనివాడు; అగుచున్ = అగుచూ; అందున్ = దానిలో; సంసార = సాంసారిక; తాపంబులన్ = బాధలను; పొందున్ = పొందెడి; పురుషుండు = పురుషుడు; స్త్రీ = స్త్రీ; తోడన్ = తోటి; కూడి = కలిసి; ఏకీభావంబున్ = కలియుట; ఒందుట = పొందుట; తన = తన; కున్ = కు; హృదయగ్రంథి = హృదయ మనెడి బంధనము; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; అందున్ = దానిలో; జనున్ = మానవుని; కున్ = కి; గృహ = ఇల్లు; క్షేత్ర = భూములు; సుత = పుత్రులు; ఆప్త = బంధువులు; విత్తంబున్ = సంపదలు; అందున్ = ఎడల; నేను = నేను, అహంకారము; నాయది = నాది, మమకారము; అనియెడి = అనెడి; మోహంబున్ = మోహములు; కలుగును = ఏర్పడును; అట్టి = అటువంటి; స్త్రీపురుష = స్త్రీపురుషుల; మిథునీ = దాంపత్య; భావంబు = భావము; చేన్ = వలన; సంతానంబున్ = పిల్లలు; కలుగున్ = కలుగును; ఆ = ఆ; సంతాన = సంతానము; కారణంబునన్ = వలన; గృహ = ఇళ్ళు; క్షేత్ర = భూములు; విత్త = సంపదలు; ఆదులు = మొదలగునవి; సంపాదింపంబడు = సంపాదింపబడును; అందున్ = వాని ఎడ; మోహంబున్ = మోహము; అధికంబున్ = ఎక్కువ; అగుటన్ = అగుట; చేసి = వలన; మోక్ష = ముక్తికి చేరెడి; మార్గంబున్ = దారి; దవ్వగు = దూరము అగును; ఇట్లు = ఈ విధముగ; సంసారంబున్ = సంసారము; అందున్ = లో; ఉండియున్ = ఉండి కూడ; మనంబునన్ = మనసులో; ఎప్పుడున్ = ఎల్లప్పుడు; ముక్తి = మోక్షమును గూర్చిన; చింతన్ = చింతనను; చేయున్ = చేయునో; అప్పుడున్ = అప్పుడు; సంసారంబునున్ = సంసారమును; పాయును = దూరము అగును; మోక్ష = ముక్తిని పొందెడి; ఉపాయంబులున్ = ఉపాయములు; పరమ = అత్యుత్తమ; గురుండను = గురువును; ఐన = అయిన; నా = నా; అందులన్ = ఎడల; భక్తి = భక్తిని; చేయుటయు = కలిగి ఉండుట; విగత = వదలివేసిన; తృష్ణయున్ = వాంఛలు; ద్వంద్వ = శీతోష్ణాది ద్వంద్వములను; తితిక్షయున్ = ఓర్చుకొనుట; సర్వ = అన్ని; లోకంబులన్ = లోకముల; అందులన్ = లోని; జంతు = జంతువుల; వ్యసన = బాధలను; అవగతియున్ = అర్థము చేసికొనుట; ఈశ్వర = భగవంతునికి; విషయక = చెందిన విషయముల యొక్క; జ్ఞాన = విజ్ఞానము నందు; ఆపేక్షయున్ = ఆసక్తి; తపంబునున్ = తపస్సు; విగత = విడిచిపెట్టిన; ఇచ్ఛయున్ = కోరికలు; మత్ = నా చేత; కృత = చేయబడెడి; కర్మంబులున్ = పనులు; మత్ = నా యొక్క; కథలు = కథలు; వినుటయున్ = వినుట; నన్నె = నన్ను మాత్రమే; దైవంబు = భగవంతుని; కాన్ = అగునట్లు; ఎఱుంగుటయున్ = తెలియుట; అస్మత్ = నా యొక్క; గుణ = సుగుణముల; కీర్తనంబులున్ = స్తుతించుటలు; నిర్వైరత్వ = వైరభావము లేకపోవుట; సామ్య = సమత్వభావము; ఉపశమంబులున్ = శాంతములు; దేహ = శరీరము; గేహంబులున్ = ఇళ్ళు; అందున్ = ఎడల; ఆత్మ = నాది, మమకారము; బుద్ధి = బుద్ధిని; జిహాసయున్ = విడుచుట; అధ్యాత్మ = ఆధ్యాత్మిక; యోగంబునున్ = యోగము; ఏకాంతసేవయున్ = అనన్య సేవయు; ప్రాణ = ప్రాణములు; ఇంద్రియ = ఇంద్రియములు; ఆత్మలన్ = ఆత్మలను; గెలుచుటయున్ = గెలుచుట; కర్తవ్య = చేయవలసిన పనులను; అపరిత్యాగంబును = విడువకుండుట; సత్ = మంచి యందు; శ్రద్ధయున్ = శ్రద్ద; బ్రహ్మచర్యంబును = బ్రహ్మచర్యము; కర్తవ్య = చేయవలసిన; కృత్యంబులు = పనులు; అందులన్ = లలో; అప్రమత్తుండు = ఏమరుపాటు లేకుండువాడు; అగుటయున్ = అగుట; వాక్ = మాటలను వాడుట యందు; నియమనంబును = సంయమనము; సర్వంబున్ = సమస్తమును; నన్న = నన్ను మాత్రమే; కాన్ = అగునట్లు; తలంచుటయున్ = భావించుట; జ్ఞానంబునున్ = జ్ఞానము; విజ్ఞాన = విజ్ఞానమువలన; విజృంభితంబు = అతిశయించినది; ఐన = అయిన; యోగంబునున్ = యోగము; ధృతి = ధైర్యము; ఉద్యమంబునున్ = వహించి యుండుట; సాత్వికంబున్ = సత్త్వగుణము కలిగి ఉండుట; ఆది = మొదలగునవి; కాగల = ఐయున్న; తెఱంగులన్ = విదానముల; చేతన్ = వలన; లింగదేహంబున్ = లింగదేహమును; జయించి = గెలిచి; దేహి = జీవుడు; కుశలుండు = క్షేమము గలవాడు; అగుచునుండవలయున్ = అగుచూ ఉండవలెను.

భావము:

ఇంకా స్త్రీ వ్యామోహంలో ఉండే కాముకులతో సంబంధం వల్ల సంసారం నరకమే అవుతుంది. మహాత్ముల సహవాసం మోక్షానికి దారి తీస్తుంది. అటువంటి మహాత్ములు ఎవరని అంటారా? శత్రు మిత్ర భేదభావం లేకుండా అందరిపై సమదృష్టి కలవారు, శాంతస్వభావులు, కోపం లేనివారు, సమస్త జీవుల పట్ల దయాస్వభావం కలవారు, సాధు స్వభావులు మహాత్ములని పిలువబడతారు. అలాంటి మహానుభావులకు నాయందే పరిపూర్ణ భక్తి ఉండడం వల్ల విషయ లంపటులైన దుర్మార్గుల పట్ల ప్రీతి, తమ దేహమన్నా, ఇల్లన్నా, మిత్రులన్నా, భార్యాపుత్రులన్నా వ్యామోహం ఏమాత్రం ఉండదు. ఇంద్రియ సుఖాలకు లోనైనవాడు పనికిరాని పనులు చేస్తూ ఉంటాడు. చెడ్డపనులు చేసేవాడు పాపం కొనితెచ్చుకుంటాడు. దుఃఖకారణమైన దేహాన్ని మోస్తూ ఉంటాడు. అందువల్ల మీరు పాపాలకు మూలాలైన కోరికలను కోరకండి. యథార్థ జ్ఞానం ప్రాప్తించనంత వరకు మీకు ఆత్మతత్త్వం బోధపడదు. ఆ తత్త్వం తెలియని కారణాన దేహికి దుఃఖం ఎక్కువవుతుంది. లింగదేహ మెంతకాలం ఉంటుందో అంతకాలం మనస్సు కర్మవశమై ఉంటుంది. జ్ఞానం లభించదు. అవిద్య వదలదు. శరీరం కర్మమూలం. అందుచేత కర్మలు చేయడం తగదు. వాసుదేవుడినైన నామీద ఆసక్తి కుదరనంత వరకు మిమ్మల్ని దేహధర్మాలు బాధిస్తాయి. ఎంత చదువుకున్న వాడైనా దేహేంద్రియ సుఖాలపట్ల ఆసక్తుడై సంభోగ సుఖ ప్రధానమైన గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తాడు. మూఢుడై సంసార క్లేశాలకు లోనౌతాడు. సంసారికి ఇల్లన్నా, పొలాలన్నా, కొడుకులన్నా, ఆప్తులన్నా, ధనమన్నా నేను నాది అనే వ్యామోహం పెరుగుతుంది. స్త్రీ పురుషుల కలయిక వల్ల సంతానం కలుగుతుంది. ఆ సంతానం కోసం ఇల్లు కట్టడమో, పొలాలు కొనడమో, ధనం సంపాదించడమో జరుగుతుంది. వాటిపట్ల మోహం పెంచుకొనడంతో వానికి మోక్షమార్గం దూరమౌతుంది. సంసారంలో మునిగి ఉన్నవానికి ఎపుడయితే మోక్షాసక్తి కలుగుతుందో అపుడే అతడు సంసారాన్ని వదలి పెడతాడు. మోక్షోపాయం చెప్తాను. పరమేశ్వరుడనైన నా మీద భక్తి ఉండడం, కోరికలు లేకపోవడం, సుఖ దుఃఖాలలో సహనం, సమస్త జీవుల కష్టాలపట్ల సానుభూతి కలిగి ఉండడం, భగవద్విషయమైన జ్ఞానంపట్ల ఆసక్తి, తపస్సు, నా కథలను, లీలలను ఆలకించడం, నన్నే దైవంగా భావించడం, నా గుణాలను కీర్తించడం, ఎవరితోను విరోధభావం లేకుండడం, సర్వత్ర సమబుద్ధి కలిగి ఉండడం, శాంతితో జీవించడం, ‘నా గేహం, నా దేహం’ అనే బుద్ధిని వదలిపట్టడం, ఆధ్యాత్మయోగం అవలంబించడం, ఏకాంత భక్తిభావం, ఇంద్రియాలను జయించడం, కర్తవ్య పరాయణత్వం, సత్కార్యాలందు శ్రద్ధ, బ్రహ్మచర్యం, జాగరూకత, వాక్కులను సంయమనంతో వాడడం, అన్నిటిలో నన్నే చూడడం… ఇవి ముక్తి మార్గాలు. జ్ఞానంతో విజ్ఞాన విజృంభితమైన యోగంతో, గుండె దిటవుతో, సాత్త్వికమైన ప్రవృత్తితో లింగదేహాన్ని జయించి మానవుడు క్షేమాన్ని పొందాలి.