పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : ఋషభుని జన్మంబు

  •  
  •  
  •  

5.1-51-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు, నిస్సంగులై నిశితజ్ఞానంబునంజేసి దోషరహితులై భగవత్స్వభావులు నాత్మారాములు నగు మునులకు స్తుతియింపఁ దగిన గుణంబులు గలవాడ వగుచుండియుఁ బ్రసన్నుండవు; స్ఖలన క్షుత పతన జృంభణాది దురవస్థ లందును జరామరణాది దుర్దశలందును వివశుల మగు మాకుఁ గల్మష నాశకరంబులయిన భవద్దివ్యనామంబులు మా వచనగోచరంబులగుం గాక; మఱియు నీ రాజర్షి పుత్రకాముండై నీ తోడ సమానుండయిన కుమారునిం గోరి కామంబుల స్వర్గాపవర్గంబుల నీనోపిన నినుం బూజించి ధనకాముం డైనవాఁడు ధనవంతునిం జేరి తుషమాత్రం బడిగిన చందంబున మోక్షనాథుండ వైన నీవలన సంతానంబు గోరుచున్నవాఁడు; జయింపరాని నీ మాయ చేత నెవ్వండు మోహంబు నొంది విషయాసక్తుండు గాక యుండు? నర్థకాములము మదాంధులము నగు మేము నిన్ను నాహ్వానంబు చేసిన యపరాధంబు సర్వాత్మకుండ వగుటం జేసి సామ్యంబుచే మన్నింప దగుదువు; మమ్ము దయఁ జూడు" మని ప్రణమిల్లిన సర్వేశ్వరుండు వర్షాధిపతి యగు నాభిచేతను, ఋత్విక్కులచేతను, వంద్యమానుండై దయాకలితుం డగుచు యిట్లనియె.

టీకా:

మఱియున్ = ఇంకను; నిస్సంగులు = విరాగులు {నిస్సంగులు – సాంగత్యముసు అన్నింటిని విసర్జించినవారు, విరాగులు}; నిశిత = వాడియైన; జ్ఞానంబునన్ = జ్ఞానము; చేసి = వలన; దోష = పాపములు; రహితులు = లేనివారు; ఐ = అయ్యి; భగవత్ = భగవంతుని వంటి; స్వభావులు = స్వభావములు గలవారు; ఆత్మారాములు = ఆనందము ఆత్మగా కలవారు; అగు = అయిన; మునులు = మునుల; కున్ = కు; స్తుతియింపన్ = స్తుతించుటకు; తగిన = తగినట్టి; గుణంబులున్ = సుగుణములు; కలవాడవు = కలిగినవాడవు; అగుచుండియు = అయినప్పటికిని; ప్రసన్నుండవు = ప్రసన్నమైనవాడవు; స్ఖలన = జారుట; క్షుత = తుమ్ముట; పతన = పడుట; జృంభణ = ఆవులింతలు; ఆది = మొదలగు; దురవస్థలు = చెడుస్థితుల; అందునున్ = లోను; జర = ముసలితనము; మరణ = మరణము; ఆది = మొదలగు; దుర్దశల్ = చెడు సమయములు; అందున్ = లోను; వివశులము = స్వాధీనము తప్పెడి వారము; అగు = అయిన; మాకున్ = మాకు; కల్మష = పాపములను; నాశ = నాశనము; కరంబులు = చేసెడివి; అయిన = అయినట్టి; భవత్ = నీ యొక్క; దివ్య = దివ్యమైన; నామంబులు = నామములు; మా = మా యొక్క; వచన = మాటలకు; గోచరంబులున్ = అందునవి; అగుగాక = అగుగాక; మఱియున్ = ఇంకను; ఈ = ఈ; రాజర్షి = రాజులలో ఋషివంటివాడు; పుత్ర = కొడుకులను; కాముండు = కోరెడివాడు; ఐ = అయ్యి; నీ = నీ; తోడన్ = తోటి; సమానుండు = సమానమైనవాడు; అయిన = అయినట్టి; కుమారునిన్ = పుత్రుని; కోరి = కోరుతూ; కామంబులన్ = కోరికలను; స్వర్గ = స్వర్గము; అపవర్గంబుల్ = ముక్తులను; ఈన్ = ఇచ్చుటకు; ఓపిన = సమర్థత కలిగిన; నినున్ = నిన్ను; పూజించి = సేవించి; ధన = సంపదలను; కాముండు = కోరెడివాడు; ఐన = అయిన; వాడు = వాడు; ధనవంతునిన్ = భాగ్యశాలిని; చేరి = సమీపించి; తుష = వట్టి ఊకను; మాత్రంబున్ = మాత్రమే; అడిగిన = కోరిన; చందంబునన్ = వలె; మోక్ష = ముక్తికి; నాథుండవు = ప్రభువు; ఐన = అయిన; నీ = నీ; వలనన్ = వలన; సంతానంబున్ = సంతానమును; కోరుచున్నవాడు = కోరెడివాడు; జయింపరాని = జయించుటకు సాధ్యముగాని; నీ = నీ యొక్క; మాయన్ = మాయ; చేతన్ = వలన; ఎవ్వండున్ = ఎవడైతే; మోహంబున్ = మోహమును; ఒంది = పొంది; విషయ = విషయములు యందు; ఆసక్తుండు = ఆసక్తిగలవాడు; కాక = కాకుండగా; ఉండు = ఉండెడి; అర్థ = సంపదలను; కాములము = కోరెడివారము; మద = గర్వముతో; అంధులము = గుడ్డివారము; అగు = అయిన; మేమున్ = మేము; నిన్నున్ = నిన్ను; ఆహ్వానంబు = ఆహ్వానించుట; చేసిన = చేసినట్టి; అపరాధంబున్ = తప్పులను; సర్వ = నిఖిలమైన జీవుల; ఆత్మకుండు = ఆత్మలయందు ఉండెడివాడు; అగుటన్ = అగుట; చేసి = వలన; సామ్యంబున్ = సమదృష్టి; చేన్ = తోటి; మన్నింపన్ = మన్నించుటకు; తగుదువు = తగినవాడవు; మమ్మున్ = మమ్ములను; దయన్ = కృపతో; చూడుము = చూడుము; అని = అని; ప్రణమిల్లిన = నమస్కరించిన; సర్వేశ్వరుండు = నారాయణుడు {సర్వేశ్వరుడు - అఖిలమైనవారికిని ఈశ్వరుడు, విష్ణువు}; వర్ష = వర్షములకు; అధిపతి = అధికారి; అగు = అయిన; నాభి = నాభి; చేతను = చేతను; ఋత్విక్కుల్ = యజ్ఞము నడపెడివారి; చేతను = చేతను; వంద్యమానుండు = వందనముచేయబడినవాడు; ఐ = అయ్యి; దయా = కృప; కలితుండు = కలిగినవాడు; అగుచున్ = అగుచూ; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇంకా మునులు కోరికలు లేనివారు. సునిశ్చితమైన జ్ఞానం కలవారు. దోషాలు లేనివారు. భగవంతుని ప్రతిరూపాలు. ఆత్మారాములు. అలాంటి మునులకు స్తోత్రార్హుడ వైనప్పటికీ అందరిపట్ల అనుగ్రహం చూపుతున్నావు. కాలు జారినప్పుడు, క్రింద పడ్డప్పుడు, తుమ్మినప్పుడు, ఆవులించినప్పుడు, జ్వరంతో పీడింపబడుతున్నపుడు, చావుకు చేరువ అయినప్పుడు, మా మీద మాకే అధికారం తప్పినప్పుడు మా పాపాలను పోగొట్టే నీ దివ్యనామాలు మా నోటివెంట వెడలే విధంగా అనుగ్రహించు. ఈ రాజర్షి అయిన నాభి నీకు సమానమైన సంతానం కావాలని నిన్ను పూజించాడు. కోరిన కోరికలను, స్వర్గాన్ని, మోక్షాన్ని సైతం ఇవ్వగల నిన్ను ఇలా అడగడం ధనం కోసం ధనవంతుని దగ్గరకు వెళ్ళి ఊక అడిగినట్టుంది. మోక్ష ప్రదాతవైన నిన్ను సంతానం కోసం ప్రార్థిస్తున్నాడు. మీ మాయ దాటరానిది. అలాంటి మాయకు లోబడి ఇంద్రియ కాంక్షలకు లోనుకాని వా డెవడు? ప్రతి పనిని ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని చేసేవాళ్ళం మేము. గర్వాంధులము. అయినా నిన్ను ఆహ్వానించిన మా అపరాధాన్ని మన్నించు. మమ్ము అనుగ్రహించు” అని నమస్కరించారు. అప్పుడు సర్వేశ్వరుడు జంబూద్వీపంలోని ఒక వర్షానికి అధిపతి అయిన నాభి ఋత్విక్కులతో కలిసి చేసిన వందనాలు అందుకొంటూ దయతో ఇలా అన్నాడు.