పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : ఋషభుని జన్మంబు

  •  
  •  
  •  

5.1-47-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు నీవు సంసారాసక్తమతి గలిగిన వారికి వశ్యుండవుగావు; యీశ్వరుండవును బ్రకృతి పురుష వ్యతిరిక్తుండవును బరమ పురుషుండవును నయిన నిన్నుఁ బొందని ప్రపంచాంతర్గతంబు లయిన నామరూపంబులు గల యస్మదాదులచేత నిరూపింప నశక్యంబగు; సర్వజీవులం జెందిన దురిత సంఘంబుల నిరసించు స్వభావంబు గల నీ యుత్తమ గుణంబులందు నేకదేశంబ గాని సర్వగుణనిరూపణంబు చేయ శక్యంబుగానేరదు; నీ భక్తులు మిక్కిలి భక్తింజేసి సంస్తుతించు గద్గదాక్షరంబులను సలిల శుద్ధ పల్లవ తులసీదళ దుర్వాంకురంబులను సంపాదించిన పూజను సంతసిల్లెడి నీకు బహువిధ ద్రవ్య సంపాదనంబు గలిగి విభవ యుక్తంబు లయిన యశ్వమేధాదులును దృప్తికరంబులు గానేరవు స్వభావంబున సర్వకాలంబులందును సాక్షాత్కరించి యతిశయంబై వర్తించుచు నశేషపురుషార్థ స్వరూపంబుఁ బరమానంద రూపంబు నైనవాఁడ వగుటం జేసి యజ్ఞాదుల యందు నీకుఁ దృప్తి లేక యున్న నస్మదాదుల కోరికల కుపచరించు కతంబున యజ్ఞాదుల నొనరింతు; మని మఱియు నిట్లనిరి.

టీకా:

మఱియున్ = ఇంకను; నీవున్ = నీవు; సంసార = సంసారమునందు; ఆసక్త = ఆసక్తిగల; మతిన్ = బుద్ధి; కలిగిన = కలిగిన; వారి = వారి; కిన్ = కి; వశ్యుండవు = వశమగువాడవు; కావు = కావు; ఈశ్వరుండవును = ప్రభువునవు; ప్రకృతిపురుషువ్యతిరిక్తుండవును = ప్రకృతి పురుషలకు అతీతమైనవాడవు; పరమపురుషుండవును = అత్యుత్తమ పురుషుడవును; అయిన = అయినట్టి; నిన్నున్ = నిన్ను; పొందని = పొందని; ప్రపంచ = ప్రపంచము యొక్క; అంతర్గతంబులు = లోపల ఉండునవి; అయిన = అయినట్టి; నామ = పేర్లు; రూపంబులున్ = స్వరూపములు; కల = కలిగినట్టి; అస్మదాదుల్ = నావంటివారి; చేతన్ = వలన; నిరూపింపన్ = నిరూపించుటకు; అశక్యంబు = అసాధ్యము; అగు = అగును; సర్వ = సకల; జీవులన్ = ప్రాణులను; చెందిన = చెందినట్టి; దురిత = పాపముల యొక్క; సంఘంబులన్ = సమూహములను; నిరసించు = తిరస్కరించెడి; స్వభావంబున్ = స్వభావము; కల = కలిగిన; నీ = నీ యొక్క; ఉత్తమ = ఉత్తమమైన; గుణంబుల్ = గుణములు; అందున్ = లలో; ఏకదేశంబ = అనన్యముగ, ఒక భాగము లేక అంశము మాత్రమె; కాని = కాని; సర్వ = సకల; గుణ = గుణములను; నిరూపణంబున్ = నిరూపించుటకు; చేయన్ = చేయుటకు; శక్యంబున్ = సాధ్యము; కాదు = కాదు; నీ = నీ యొక్క; భక్తులు = భక్తులు; మిక్కిలి = అధికమైన; భక్తిన్ = భక్తి; చేసి = వలన; సంస్తుతించు = స్తుతించెడి; గద్గద = బొంగురుపోతున్న గొంతుతో పలికెడి; అక్షరంబులను = పలుకులను; సలిల = నీరు; శుద్ధ = స్వచ్ఛమైన; పల్లవ = చిగుర్లు; తులసీదళ = తులసీ దళములు; దూర్వాంకురంబులును = గరిక మొలకలు; సంపాదించిన = సమీకరించికొని చెసిన; పూజనున్ = పూజలతో; సంతసిల్లెడి = సంతోషించెడి; నీకున్ = నీకు; బహు = అనేక; విధ = రకముల; ద్రవ్య = పదార్థములను; సంపాదనంబున్ = సమీకరించుకొనుట; కలిగి = కలిగి; విభవ = వైభవముతో; యుక్తంబులు = కూడుకొన్నవి; అయిన = అయినట్టి; అశ్వమేధ = అశ్వమేధము; ఆదులన్ = మొదలగువానిచే; తృప్తి = తృప్తిని; కరంబులునున్ = కలిగించునవి; కానేరవు = కాలేవు; స్వభావమునన్ = స్వభావము నందు; సర్వ = సకల; కాలంబుల్ = కాలముల; అందునున్ = లోను; సాక్షాత్కరించి = సాక్షాత్కరించి; అతిశయంబు = అతిశయించినది; ఐ = అయ్యి; వర్తించుచున్ = వర్తించెడి; అశేష = సమస్తమైన; పురుషార్థంబున్ = ధర్మార్థ కామ మోక్ష ప్రయోజనముల; స్వరూపంబున్ = స్వరూపమును; పరమ = అత్యధికమైన; ఆనంద = ఆనందము యొక్క; రూపంబున్ = స్వరూపమును; ఐన = అయినట్టి; వాడవు = వాడవు; అగుటన్ = అగుట; చేసి = వలన; యజ్ఞ = యజ్ఞములు; ఆదులన్ = మొదలగువాని; అందున్ = అందు; నీకున్ = నీకు; తృప్తి = తనివినొందుట; లేక = లేకుండగ; ఉన్నన్ = ఉండికూడ; అస్మదాదులన్ = నాలాంటివారి; కోరికల్ = కోరికల; కున్ = కు; ఉపచరించు = సమ్మతించు, ఉపకరించు; కతంబునన్ = కారణముచేత; యజ్ఞ = యజ్ఞములు; ఆదులన్ = మొదలగువానిని; ఒనరింతుము = ఆచరింతుము; అని = అని; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

ఇంకా సంసారంలో మునిగి తేలే వారికి నీవు పట్టుబడవు. నీవు ఈశ్వరుడవు. ప్రకృతి కంటే జీవుని కంటే భిన్నమయినవాడవు. పరమ పురుషుడవు. మేము పంచభూతాల సృష్టికి లోనైన నామరూపాలను ధరించిన వాళ్ళం. అటువంటి మాకు నీ తత్త్వాన్ని నిరూపించడం సాధ్యం కాదు. సకల జీవరాసుల పాపసమూహాలను తొలగించడం నీ స్వభావం. అటువంటి నీ ఉత్తమ గుణాలలో ఏదో ఒక అంశమే కాని సమస్త గుణాలను నిరూపించడం ఎవరికీ ఏమాత్రం సాధ్యం కాదు. నీ భక్తులు భక్తితో గద్గద స్వరంతో సంస్తుతిస్తూ, నీ కర్పించే నిర్మల జలం, చిగురుటాకులు, తులసీదళాలు, దూర్వాంకురాలు మొదలైన వాటితో నీవు సంతృప్తి పడతావు. అంతేకాని నానావిధ ద్రవ్యాలు సంతరించికొని మహా వైభవంతో చేసే అశ్వమేధాది యాగాలు కూడా నీకు సంతృప్తిని కలిగించవు. స్వాభావికంగానే నీవు సర్వకాలాలలోను సాక్షాత్కరిస్తావు. నీవు సర్వాతిశాయివి. సమస్త పురుషార్థాలు నీవే. పరమానంద స్వరూపుడవైన నీకు యజ్ఞయాగాదుల వల్ల తృప్తి లేకున్నా మా కోరికలను తీర్చుకోవడానికి మేము యజ్ఞాలను చేస్తున్నాము” అని ఇంకా ఇలా అన్నారు.