పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : ఋషభుని జన్మంబు

  •  
  •  
  •  

5.1-42-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియుం బ్రవర్గ్య సంజ్ఞికంబు లగు కర్మంబులు శ్రద్ధా విశుద్ధద్రవ్య దేశ కాల మంత్రర్త్విగ్దక్షిణా విధాన యోగంబులం బరమేశ్వరుని మెప్పించిన నెవ్వరికిం బ్రసన్నుండు గాని పుండరీకాక్షుండు భక్తవత్సలుం డై సురుచిరావయవంబులతో యజనశీలం బయిన యాతని హృదయంబు నందుఁ బాయని రూపంబు గలిగి మనోనయనానందకరావయవంబులు గల తన స్వరూపం బాతనికిఁ జూపం దలంచి.

టీకా:

మఱియున్ = ఇంకను; ప్రవర్గ్య = ప్రవర్గ్యము యనెడి {ప్రవర్గ్యము - యాగవిశేషము, సోమయాగమునకు ముందు చేయబడునొక యజ్ఞ క్రతువు, గానమునకు ముందు గాత సంకల్పమునకు సంకేతము)}; సంజ్ఞకంబులు = పేర్లు గలవి; అగు = అయిన; కర్మంబులున్ = క్రతువులను; శ్రద్ధా = శ్రద్ధతోను; విశుద్ధ = పరిశుద్ధమైన; ద్రవ్య = పదార్థములు; దేశ = ప్రదేశములు; కాల = సమయములు; మంత్ర = మంత్ర; ఋత్విక్ = యజ్ఞములు చేయువారు; దక్షిణా = బ్రాహ్మణాదుల కిచ్చెడి ధనాదులు; విధాన = పద్ధతులు; యోగంబులన్ = యోగములచేత; పరమేశ్వరుని = భగవంతుని; మెప్పించినన్ = అనుగ్రహము వచ్చునట్లు చేసిన; ఎవ్వరికిని = ఎవరికిని; ప్రసన్నుండు = ప్రసన్నము; కాని = కానట్టి; పుండరీకాక్షుండు = విష్ణుమూర్తి {పుండరీకాక్షుడు - పుండరీకములు (పద్మముల) వంటి కన్నులు గలవాడు, విష్ణువు}; భక్త = భక్తుల ఎడ; వత్సలుండు = వాత్సల్యము గలవాడు; ఐ = అయ్యి; సు = చక్కటి; రుచిర = కాంతివంతమైన; అవయవంబుల్ = అవయవముల; తోన్ = తోటి; యజన = యజ్ఞములు చేసెడి; శీలంబున్ = స్వభావములు కలిగినది; అయిన = అయినట్టి; ఆతని = అతని యొక్క; హృదయంబున్ = హదయము; అందున్ = లోని; పాయని = విడువని; రూపంబున్ = స్వరూపము; కలిగి = కలిగిన; మనః = మనసునకు; నయనా = కన్నులకు; ఆనంద = సంతోషమును; కర = కలిగించెడి; అవయవంబుల్ = అవయవముల; కల = కలిగిన; తన = తన యొక్క; స్వరూపంబున్ = స్వరూపమును; ఆతని = అతని; కిన్ = కి; చూపన్ = చూపించవలెనని; తలంచి = భావించి.

భావము:

ఇంకా ప్రవర్గ్యా లనబడే యజ్ఞకార్యాలను శ్రద్ధతో, పరిశుద్ధ ద్రవ్యాలతో, ఉచిత ప్రదేశంలో, కాలానుగుణంగా, విధివిహితంగా మంత్రవేత్తలైన ఋత్విక్కులతో, భూరి దక్షిణలతో ఆచరించి పరమేశ్వరుని మెప్పించాడు. ఎవరికీ సులభంగా ప్రసన్నుడు కాని విష్ణువు భక్తవాత్సల్యంతో, ప్రకాశవంతమైన అవయవ సౌష్ఠవంతో హృదయంలో తాను సదా నెలకొని ఉన్నప్పటికీ ప్రత్యక్ష రూపంలో కనులకు పండువుగా, మనసుకు నిండుగా తన స్వరూపాన్ని అతనికి చూపాలనుకొని…