పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : వర్షాధిపతుల జన్మంబు

  •  
  •  
  •  

5.1-40-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు నిట్లనుఁ "దపోధనులగు వారల తపంబులను నీ రూపంబున నపహ్నవించిన దాన; వీ చక్కదనం బేమి తపంబున సంపాదించితివి? నా తోడంగూడి తపంబు చేయుము; సంసారంబు వృద్ధిఁ బొందం జేయుము; పద్మాసనుండు నాకుం బ్రత్యక్షంబై నిన్ను నిచ్చినవాఁడుఁ; గావున నిన్ను విడువంజాలను; నీ సఖీజనంబులు నా వాక్యంబులకు ననుకూలింతురుగాక; నీవు చనుచోటికి నన్నుం దోడ్కొని చను"మని స్త్రీలకు ననుకూలంబుగాఁ బలుకనేర్చిన యాగ్నీధ్రుండు పెక్కుభంగులం బలికిన నా పూర్వచిత్తియు నతని యనునయ వాక్యంబులకు సమ్మతించి వీరశ్రేష్ఠుండగు నా రాజవర్యుని బుద్ధి రూప శీలౌదార్య విద్యా వయశ్శ్రీలచేఁ బరాధీనచిత్త యగుచు జంబూద్వీపాధిపతి యగు నా రాజశ్రేష్ఠుని తోడంగూడి శతసహస్ర సంవత్సరంబులు భూస్వర్గ భోగంబు లనుభవించె; నంత నాగ్నీధ్రుం డా పూర్వచిత్తివలన నాభి కింపురుష హరివర్షేలావృత రమ్యక హిరణ్మయ కురు భద్రాశ్వ కేతుమాల సంజ్ఞలు గల కుమారులఁ బ్రతిసంవత్సరంబు నొక్కొక్కనిఁగఁ దొమ్మండ్రం గాంచె; నంత నా పూర్వచిత్తి యా యర్భకుల గృహంబున విడిచి యాగ్నీధ్రుం బాసి బ్రహ్మలోకంబునకుం జనిన నా యాగ్నీధ్ర పుత్రులు మాతృసామర్థ్యంబునం జేసి స్వభావంబునన శరీరబలయుక్తు లగుచుఁ దండ్రిచేత ననుజ్ఞాతులై తమ నామంబులఁ బ్రసిద్ధంబు లయిన జంబూద్వీప వర్షంబులం బాలించుచుండి; రంత నాగ్నీధ్రుండు నా పూర్వచిత్తి వలనం గామోపభోగంబులం దృప్తిం బొందక పూర్వచిత్తిం దలంచుచు వేదోక్తంబులగు కర్మంబులంజేసి తత్సలోకంబగు బ్రహ్మ లోకంబునకుం జనియె; నిట్లు దండ్రి పరలోకంబునకుం జనిన నాభి ప్రముఖులగు నాగ్నీధ్రకుమారులు దొమ్మండ్రును మేరుదేవియుఁ, బ్రతిరూపయు, నుగ్రదంష్ట్రయు, లతయు, రమ్యయు, శ్యామయు, నారియు, భద్రయు, దేవవతియు నను నామంబులు గల మేరు పుత్రికలగు తొమ్మండ్రు కన్యకలను వివాహం బై; రంత.

టీకా:

మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అను = అనెను; తపః = తపస్సు అనెడి; ధనులు = సంపద గలవారు; వారల = వారి యొక్క; తపంబులన్ = తపస్సులను; ఈ = ఈ; రూపంబునన్ = రూపముతో; అపహ్నవించినదానవు = కప్పిపుచ్చెడిదానవు; ఈ = ఈ; చక్కదనంబున్ = అందమును; ఏమి = ఏ విధమైన; తపంబునన్ = తపస్సువలన; సంపాదించితివి = పొందితివి; నా = నా; తోడన్ = తోటి; కూడి = కలిసి; తపంబున్ = తపస్సును; చేయుము = చేయుము; సంసారంబున్ = సంసారమును; వృద్ధిన్ = పెంపు; పొందన్ = పొందునట్లు; చేయుము = చేయుము; పద్మాసనుండు = బ్రహ్మదేవుడు {పద్మాసనుడు - పద్మము ఆసనముగా గలవాడు, బ్రహ్మదేవుడు}; నాకున్ = నాకు; ప్రత్యక్షంబున్ = ప్రత్యక్షము; ఐ = అయ్యి; నిన్నున్ = నిన్ను; ఇచ్చినవాడు = ఇచ్చినాడు; కావునన్ = అందుచేత; నిన్నున్ = నిన్ను; విడువంజాలను = విడువలేను; నీ = నీ యొక్క; సఖీ = సఖులైన; జనంబులు = వారు; నా = నా యొక్క; వాక్యంబుల్ = మాటల; కున్ = కు; అనుకూలింతురుగాక = అనుకూలముగా ఉండమను; నీవున్ = నీవు; చను = వెళ్ళు; చోటు = ప్రదేశముల; కిన్ = కి; నన్నున్ = నన్ను; తోడ్కొని = తీసుకొని; చనుము = వెళ్ళండి; అని = అని; స్త్రీల్ = స్త్రీలు; కున్ = కు; అనుకూలంబుగాన్ = అనుకూల మగునట్లు; పలుకన్ = మాట్లాడ; నేర్చినన్ = నేర్చుకొనగా; ఆగ్నీధ్రుండు = ఆగ్నీధ్రుడు; పెక్కు = అనేకమైన; భంగులన్ = విధములుగా; పలికినన్ = పలుకగా; ఆ = ఆ; పూర్వచిత్తియున్ = పూర్వచిత్తి; అతని = అతని; అనునయ = బుజ్జగింపు; వాక్యంబుల్ = మాటల; కున్ = కు; సమ్మతించి = అంగీకరించి; వీర = వీరులలో; శ్రేష్ఠుండు = గొప్పవాడు; అగు = అయిన; ఆ = ఆ; రాజ = రాజులలో; వర్యుని = ఉత్తముని; బుద్ధి = మంచి బుద్ధులు; రూప = చక్కదనములు; శీల = వర్తనలు; ఔదార్య = ఔదార్యములు; విద్యా = విద్య; వయస్ = యౌవనము; శ్రీలు = సంపదలు; చేన్ = వలన; పరాధీన = లొంగిపోయిన; చిత్త = మనసు కలామె; అగుచున్ = అగుచూ; జంబూద్వీప = జంబూద్వీపమునకు; అధిపతి = ప్రభువు; అగు = అయిన; ఆ = ఆ; రాజ = రాజులలో; శ్రేష్ఠునిన్ = గొప్పవాని; తోడన్ = తోటి; కూడి = కలిసి; శతసహస్ర = నూరువేల; సంవత్సరంబులున్ = సంవత్సరములు; భూ = భూలోకపు; స్వర్గ = స్వర్గ; భోగంబుల్ = సుఖములు; అనుభవించెన్ = అనుభవించెను; అంతన్ = అంతట; ఆగ్నీధ్రుండు = ఆగ్నీధ్రుడు; ఆ = ఆ; పూర్వచిత్తి = పూర్వచిత్తి; వలనన్ = వలన; నాభి = నాభి; కింపురుష = కిపురుషుడు; హరివర్ష = హరివర్షుడు; ఇలావృత = ఇలావృతుడు; రమ్యక = రమ్యకుడు; హిరణ్మయ = హిరణ్మయుడు; కురు = కురువు; భధ్రాశ్వ = భధ్రాశ్వుడు; కేతుమాల = కేతుమాలుడు; సంజ్ఞలు = పేర్లు; కల = కలిగిన; కుమారులన్ = పుత్రులను; ప్రతి = ప్రతి; సంవత్సరంబున్ = సంవత్సరమును; ఒక్కొక్కని = ఒకరుచొప్పున; తొమ్మండ్రన్ = తొమ్మిదిమందిని; కాంచె = పొందెను; అంతన్ = అంతట; ఆ = ఆ; పూర్వచిత్తి = పూర్వచిత్తి; ఆ = ఆ; అర్భకులన్ = పిల్లలను; గృహంబునన్ = ఇంటిలో; విడిచి = వదలివేసి; ఆగ్నీధ్రున్ = ఆగ్నీధ్రుని; పాసి = విడిచిపెట్టి; బ్రహ్మలోకంబున్ = బ్రహ్మలోకము; కున్ = కు; చనిన = వెళ్ళిన; ఆ = ఆ; ఆగ్నీధ్ర = ఆగ్నీధ్రుని; పుత్రులు = కుమారులు; మాతృ = తల్లి యొక్క; సామర్థ్యంబునన్ = సమర్థత; చేసి = వలన; స్వభావంబునన్ = స్వభావములోను; శరీర = శారీరక; బల = బలము; యుక్తులు = కలవారు; అగుచున్ = అగుచూ; తండ్రి = తండ్రి; చేతన్ = వలన; అనుజ్ఞాతులు = అనుమతిపొందినవారు; ఐ = అయ్యి; తమ = తమ యొక్క; నామంబులన్ = పేర్లతో; ప్రసిద్ధంబులు = పేరుపొందినవి; అయిన = అయినట్టి; జంబూద్వీప = జంబూద్వీపము నందలి; వర్షంబులన్ = వర్షములను, భూఖండములను; పాలించుచుండిరి = పరిపాలించుచు ఉండెడివారు; అంతన్ = అంతట; ఆగ్నీధ్రుండున్ = ఆగ్నీధ్రుడు; ఆ = ఆ; పూర్వచిత్తి = పూర్వచిత్తి; వలనన్ = వలన; కామ = సంసారిక; ఉప = సంబంధించిన; భోగంబులన్ = సుఖము లందు; తృప్తిన్ = తృప్తిని; పొందక = తీరక; పూర్వచిత్తిన్ = పూర్వచిత్తిని; తలంచుచున్ = తలచుకొనుచు; వేద = వేదము లందు; ఉక్తంబులు = ఉదహరింపబడిన; అగు = అయిన; కర్మలన్ = కర్మలను; చేసి = ఆచరించి; తత్ = వానికి సమానమైన; లోకంబున్ = లోకము; అగు = అయిన; బ్రహ్మలోకంబున్ = బ్రహ్మలోకమున; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; ఇట్లు = ఈ విధముగ; తండ్రి = నాన్న; పరలోకంబున్ = పైలోకమున; కున్ = కు; చనిన = వెళ్ళగా; నాభి = నాభి; ప్రముఖులు = మొదలగు; ఆగ్నీధ్ర = ఆగ్నీధ్రుని; కుమారులు = పుత్రులు; తొమ్మండ్రును = తొమ్మిదిమంది; మేరుదేవి = మేరుదేవి; ప్రతిరూపయును = ప్రతిరూప; ఉగ్రదంష్ట్రయున్ = ఉగ్రదంష్ట్ర; లతయున్ = లత; రమ్యయున్ = రమ్య; శ్యామయున్ = శ్యామ; నారియున్ = నారి; భద్రయున్ = భద్ర; దేవవతియున్ = దేవవతి; అను = అనెడి; నామంబులున్ = పేర్లు; కల = కలిగిన; మేరు = మేరువు యొక్క; పుత్రికలు = కుమార్తెలు; అగు = అయిన; తొమ్మండ్రున్ = తొమ్మిదిమంది; కన్యకలను = స్త్రీలను; వివాహంబున్ = వివాహము; ఐరి = చేసుకొనిరి; అంతన్ = అంతట.

భావము:

ఇంకా ఇలా అన్నాడు “తపస్సు చేస్తున్న తపోధనుల తపస్సునంతా నీ అందచందాలతో కప్పిపుచ్చేస్తున్నావు. ఈ చక్కదనమంతా ఏ తపస్సు వల్ల దక్కించుకున్నావు? నాతోపాటు నీవుకూడా తపస్సు సాగించు. నా సంసారాన్ని పెంచు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నిన్ను నాకు ప్రసాదించాడు. అందుచేత నిన్ను వదలిపెట్టను. నీ చెలికత్తెలు నేను చెప్పే మాటలకు తప్పక అంగీకరిస్తారు. నీవు వెళ్ళే చోటికి నన్ను కూడా తీసికొని పో” అంటూ స్త్రీల మనస్తత్త్వానికి అనుగుణంగా పలుకనేర్చిన ఆగ్నీధ్రుడు పరిపరివిధాల తన భావాన్ని ప్రకటించాడు. పూర్వచిత్తి కూడా అతని అనునయ వాక్యాలకు సమ్మతించింది. వీరశ్రేష్ఠుడైన ఆ రాజేంద్రుని బుద్ధికి, రూపానికి, శీలానికి, ఔదార్యానికి, విద్యకు, వయస్సుకు, సంపదకు లొంగిపోయింది. జంబూద్వీపాధిపతి అయిన ఆ ఆగ్నీధ్రునితో కూడి నూరువేల సంవత్సరాలు భూలోకంలో స్వర్గసౌఖ్యాలను అనుభవించింది. ఆగ్నీధ్రుడు పూర్వచిత్తి వలన వరుసగా నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావృతుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాశ్వుడు, కేతుమాలుడు అనే పేర్లు గల తొమ్మిది మంది కొడుకులను కన్నాడు. ఆ తరువాత పూర్వచిత్తి పిల్లలను ఇంటిలోనే వదిలిపెట్టి ఆగ్నీధ్రుని విడిచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. ఆగ్నీధ్రుని కుమారులు తల్లి సామర్థ్యం వల్ల స్వభావసిద్ధంగానే గొప్ప బలిష్ఠులయ్యారు. తండ్రి అనుమతితో జంబూద్వీపాన్ని వర్షాలుగా విభజించుకొని పరిపాలించారు. వారు పరిపాలించిన ప్రదేశాలు వారి వారి పేర్లతో ప్రసిద్ధ మయ్యాయి. పూర్వచిత్తితో ఆగ్నీధ్రుడు ఎంతోకాలం కామ సుఖాలను అనుభవించినా అతనికి తృప్తి కలుగలేదు. ఆ తరువాత అతడు భార్యను తలచుకొంటూ వేదోక్తకర్మలను ఆచరిస్తూ చివరకు భార్య ఉన్న లోకానికి చేరుకున్నాడు. ఈ విధంగా తండ్రి పరలోక గతుడు కాగా నాభి మొదలైన ఆగ్నీధ్రుని కుమారులు మేరు కుమార్తెలైన మేరుదేవి, ప్రతిరూప, ఉగ్రదంష్ట్ర, లత, రమ్య, శ్యామ, నారి, భద్ర, దేవి అనేవాళ్ళను వరుసగా వివాహమాడారు.