పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : వర్షాధిపతుల జన్మంబు

  •  
  •  
  •  

5.1-26-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లగ్నీధ్రుండు రాజ్యంబు చేయుచు నొక్కనాఁడు పుత్రకాముండై మందరాద్రి సమీపంబున నఖిలోపచారంబుల నేకాగ్రచిత్తుండై యర్చించినం గమలసంభవుండు సంతసిల్లి తన సమ్ముఖంబున సంగీతంబు చేయు పూర్వచిత్తి యను నప్సరోంగనం బంపుటయు నా యప్సరాంగన చనుదెంచి రమణీయ వివిధ నిబిడ విటపి విటప సమాశ్లిష్ట సమీప సువర్ణ లతికారూఢస్థల విహంగమ మిథునోచ్ఛార్యమాణ షడ్జాది స్వరంబులచే బోధ్యమాన సలిలకుక్కుట కారండవ బక కలహంసాది విచిత్ర కూజిత సంకులంబు లయిన నిర్మలోదక కమలాకరంబులు గల తదాశ్రమోపవనంబు నందు విహరించుచు విలాస విభ్రమ గతివిశేషంబులం జలనంబు నొందు స్వర్ణ చరణాభరణస్వనం బన్నరదేవకుమారుం డాలించి యోగసమాధిం జేసి ముకుళితనేత్రుండై యుండి యల్లన కనువిచ్చి చూచి తన సమీపంబున మధుకరాంగనయుంబోలెఁ బుష్పాఘ్రాణంబు చేయుచు దేవమానవుల మనోనయనంబుల కాహ్లాదంబు బుట్టించుచున్నగతి విహార వినయావలోకన సుస్వరావయవంబుల మన్మథ శరపరంపరంల నొందించుచు ముఖకమల విగళితామృత సమానహాసభాషణామోదమదాంధంబు లయిన మధుకర మిథునంబుల వంచించి, శీఘ్ర గమనంబునం జలించు కుచ కచమేఖలలు గల దేవిం గనుంగొని చిత్తచలనంబు నొంది మన్మథపరవశుండై జడుని చందంబున నిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; అగ్నీధ్రుండు = అగ్నీధ్రుడు; రాజ్యంబున్ = రాజ్యమును; చేయుచున్ = చేయుచూ; ఒక్కనాడు = ఒక దినమున; పుత్ర = పుత్ర సంతానమును; కాముండు = కోరెడివాడు; ఐ = అయ్యి; మందర = మందర యనెడి; అద్రి = పర్వతము; సమీపంబునన్ = దగ్గర; అఖిల = సమస్తమైన; ఉపచారంబులన్ = ఉపచారములను; ఏకాగ్ర = ఏకాగ్రత గల; చిత్తుండు = మనసు గలవాడు; ఐ = అయ్యి; అర్చించినన్ = సేవించగా; కమలసంభవుండు = బ్రహ్మదేవుడు {కమల సంభవుడు - కమలమున సంభవుడు (జన్మించినవాడు), బ్రహ్మదేవుడు}; సంతసిల్లి = సంతోషించి; తన = తన యొక్క; సమ్ముఖంబునన్ = ఎదుట; సంగీతంబు = సంగీతమును; చేయు = పాడెడి; పూర్వచిత్తి = పూర్వచిత్తి {పూర్వచిత్తి - ముందు జాగ్రత్త}; అను = అనెడి; అప్సర = అప్సరసయైన; అంగనన్ = స్త్రీని; పంపుటయున్ = పంపగా; ఆ = ఆ; అప్సరః = అప్సరసయైన; అంగన = స్త్రీ; చనుదెంచి = వచ్చి; రమణీయ = మనోహరమైన; వివిధ = రకరకముల; నిబిడ = నిండి యున్న; విటపి =వృక్షములు {విటపి – విటపములు (కొమ్మలు) గలది, చెట్టు}; విటప = చిగురించిన కొమ్మలు తోను; సమాక్లిష్ట = అల్లుకుపోయిన; సమీప = దగ్గరలోనున్న; సు = మంచి; వర్ణ = రంగులు గల; లతికా = తీగలతోను; ఆరూఢ = అల్లుకుపోయిన; స్థల = ప్రదేశమున; విహంగమ = పక్షుల యొక్క; మిథున = జంటల; ఉచ్ఛార్యమాణ = పలుకబడుతున్న; షడ్జాది = షడ్జమము మొదలగు సప్త స్వరములవలెనున్న; స్వరంబుల్ = స్వరములు; చేన్ = వలన; బోధ్యమాన = తెలియబడుతున్న; సలిలకుక్కుట = నీటికోళ్ళు; కారండవ = పొట్టిబాతులు; బక = కొంగలు; కలహంస = కలహంసలు; ఆది = మొదలగు; విచిత్ర = చిత్రమైన; కూజిత = కూతలతో; సంకులంబు = సందడిగా ఉన్నది; అయిన = అయినట్టి; నిర్మల = స్వచ్ఛమైన; ఉదక = నీరు గల; కమలాకరంబులు = సరస్సులు; కల = కలిగిన; తత్ = ఆ; ఆశ్రమ = ఆశ్రమముయొక్త; ఉపవనంబున్ = పెరటితోట; అందున్ = లో; విహరించుచున్ = విహరిస్తూ; విలాస = విలాసవంతమైన; విభ్రమ = సంభ్రమము గల; గతి = నడకల; విశేషంబులన్ = విశేషములతో; చలనంబున్ = కదులుతున్న; ఒందు = పొందెడి; స్వర్ణ = బంగారు; చరణా = పాదముల; ఆభరణ = ఆభరణముల; స్వనంబున్ = శబ్దమును; నరదేవ = రాజు యొక్క {నరదేవుడు - నరులకు దేవుడు, రాజు}; కుమారుండు = పుత్రుడు; ఆలించి = విని; యోగసమాధిన్ = యోగసమాధిలో ఉండుట; చేసి = వలన; ముకుళిత = ముకుళించిన; నేత్రుండు = కన్నులు గలవాడు; ఐ = అయ్యి; ఉండి = కలిగి; అల్లన = మెల్లగా; కను = కనులను; విచ్చి = విప్పుకొని; చూచి = చూసి; తన = తనకు; సమీపంబునన్ = దగ్గరలోనున్న; మధుకర = తుమ్మెదలలో; అంగనయున్ = స్త్రీ; పోలెన్ = వలె; పుష్పా = పూలను; ఆఘ్రాణంబు = వాసనచూచుట; చేయుచున్ = చేయుచూ; దేవ = దేవతల; మానవుల = మానవుల యొక్క; మనః = మనసు అనెడి; నయనంబులు = కన్నులకు; ఆహ్లాదంబున్ = సంతోషమును; పుట్టించుచున్న = కలిగిస్తున్న; గతిన్ = నడకలు; విహార = విహరించుటలు; వినయ = వినయముగా; అవలోకన = చూచుట; సు = మంచి; స్వర = స్వరము; అవయవంబులన్ = అవయవములను; మన్మథ = మన్మథుని; శరః = బాణముల; పరంపరలన్ = వరుసలను; ఒందించుచున్ = తగిలించుతూ; ముఖ = మోము యనెడి; కమల = పద్మమునుండి; విగళిత = జాలువారుతున్న; అమృత = అమృతముతో; సమాన = సమానమైన; హాస = నవ్వుల; భాషణ = మాటలు; ఆమోద = స్వీకరించుట వలన; మద = మదించుటచే; అంధంబులు = కన్నుగాననివి; అయిన = అయినట్టి; = మధుకర = తుమ్మెద; మిథునంబులన్ = జంటలను; వంచించి = మించిపోయి; శ్రీఘ్ర = వేగవంతమైన; గమనంబున్ = కదలికతో; చలించు = చలించెడి; కుచ = స్తనముల; కచ = శిరోజములు; మేఖలలున్ = మొలనూలులు; కల = కలిగిన; దేవిన్ = స్త్రీని; కనుంగొని = చూసి; చిత్త = మనసు; చలనంబున్ = చలించుటను; ఒంది = పొంది; మన్మథ = మన్మథ ప్రభావమునకు; పరవశుండు = లొంగిపోయినవాడు; ఐ = అయ్యి; జడుని = తెలివిహీనుని; చందంబునన్ = వలె; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఈ విధంగా ఆగ్నీధ్రుడు రాజ్యం చేస్తూ ఒకనాడు పుత్రసంతానం కోసం మందర పర్వత సమీపానికి వెళ్ళి అక్కడ అఖిలోపచారాలతో అచంచలమైన మనస్సుతో బ్రహ్మదేవుణ్ణి ఆరాధించాడు. బ్రహ్మదేవుడు సంతోషించి సత్యలోకంలో తన సమక్షంలో సంగీతం ఆలపించే పూర్వచిత్తి అనే అప్సరసను ఆగ్నీధ్రుని దగ్గరకు పంపాడు. ఆమె ఆగ్నీధ్రుడు ఉన్న ఆశ్రమ వాటికకు వచ్చింది. అక్కడ మనోహరంగా రకరకాలుగా నిండి ఉన్న చిగురు కొమ్మలు గల వృక్షాలను రంగురంగుల తీగలు అల్లుకున్నాయి. అటువంటి ప్రదేశంలో పక్షుల జంటలు షడ్జమం మొదలైన స్వరాలతో సందడి చేస్తున్నాయి. ఆ స్వరాలతో మేలుకొన్న నీటికోళ్ళు, బాతులు, కొంగలు, కలహంసలు మొదలైనవి తమ కూతలతో చిత్రమైన ధ్వనులు చేస్తున్నాయి. అటువంటి పక్షులతోను నిర్మలమైన నీటితోను నిండిన సరస్సులు కనువిందు చేస్తున్నాయి. అటువంటి ఆశ్రమ ఉపవనంలో ఆ అప్సరస విహరించడం మొదలుపెట్టింది. వంపుసొంపులతో ఒయ్యారంగా నడిచే ఆ అప్సరస నడకలకు తగినట్టుగా కదులుతున్న ఆమె బంగారు అందియల శబ్దాన్ని ఆగ్నీధ్రుడు విన్నాడు. యోగసమాధిలో కన్నులు మోడ్చి ఉన్న అతడు మెల్లగా కన్నులు విప్పి ఆడుతుమ్మెద వలె పూల సౌరభాన్ని ఆస్వాదిస్తున్న ఆ పూర్వచిత్తిని చూశాడు. ఆమె అందచందాలు దేవతలకు, మానవులకు కనులవిందులై మనస్సులను పరవశింప చేస్తున్నాయి. ఆమె ఒయ్యారపు నడకలు, విభ్రమ విహారాలు, వాలుచూపులు, కంఠ మాధుర్యం, అంగసౌష్ఠవం మన్మథుని శరపరంపరలను కురిపిస్తున్నాయి. ఆమె ముఖపద్మం నుండి మకరందం వంటి మందహాసం చిందుతున్నది. ఆమె పలుకుకు పరిమళాలను విరజిమ్ముతున్నాయి. ఆ సుగంధాలకు ముసురుకొని మై మరచిన తుమ్మెద జంటలను తప్పించికొని ఆ అప్సరస నడుస్తుంటే ఆ గమన వేగానికి ఆమె చనుగవ, జుట్టుముడి, మొలనూలు చలిస్తున్నాయి. అటువంటి పూర్వచిత్తిని చూచి ఆగ్నీధ్రుడు కామ పరవశుడై చలించిన చిత్తంతో మూర్ఖునిలాగా ఆమెతో ఇలా అన్నాడు.