పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : ఆగ్నీధ్రాదుల జన్మంబు

  •  
  •  
  •  

5.1-20-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్టి ద్వీపంబుల యందుఁ బరిపాలనంబునకుం బ్రియవ్రతుం డాత్మభవులు నాత్మసమాన శీలురునైన యాగ్నీధ్రేధ్మజిహ్వ యజ్ఞబాహు హిరణ్యరేతో ఘృతపృష్ఠ మేధాతిథి వీతిహోత్రుల నొక్కొక్కని నొక్కొక ద్వీపంబునకుం బట్టంబుగట్టి యూర్జస్వతి యను కన్యకను భార్గవున కిచ్చిన, నా భార్గవునకు నూర్జస్వతి యందు దేవయాని యను కన్యారత్నంబు జనించె; నట్టి బలపరాక్రమవంతుం డైన ప్రియవ్రతుండు విరక్తుండై యొక్కనాఁడు నిజ గురువగు నారదుని చరణానుసేవాను పతిత రాజ్యాది ప్రపంచ సంసర్గంబుఁ దలంచి యిట్లనియె.

టీకా:

అట్టి = అటువంటి; ద్వీపంబులన్ = ద్వీపములు; అందున్ = లోను; పరిపాలనంబున్ = పరిపాలించుట; కున్ = కు; ప్రియవ్రతుండు = ప్రియవ్రతుడు; ఆత్మ = తనకు; భవులున్ = పుట్టినవారిని; ఆత్మ = తనకు; సమాన = సమానమైన; శీలురున్ = ప్రవర్తనలు కలవారును; ఐన = అయిన; ఆగ్నీధ్ర = ఆగ్నీధ్రుడు; ఇధ్మజిహ్వ = ఇధ్మజిహ్వుడు; యజ్ఞబాహు = యజ్ఞబాహుడు; హిరణ్యరేతః = హిరణ్యరేతసుడు; ఘృతపృష్ట = ఘృతపృష్టుడు; మేధాతిథి = మేధాతిథి; వీతిహోత్రులన్ = వీతిహోత్రులను; ఒక్కొక్కని = ఒక్కొక్కని; కిన్ = కి; ఒక్కొక్క = ఒక్కొక్క; ద్వీపంబున్ = ద్వీపమున; కున్ = కు; పట్టంబుగట్టి = పట్టాభిషేకముచేసి; ఊర్జస్వతి = ఊర్జస్వతి; అను = అనెడి; కన్యకనున్ = పుత్రికను; భార్గవున్ = భార్గవుని; కిన్ = కి; ఇచ్చినన్ = ఇవ్వగా; ఆ = ఆ; భార్గవున్ = భార్గవుని; కున్ = కి; ఊర్జస్వతి = ఊర్జస్వతి; అందున్ = అందు; దేవయాని = దేవయాని; అను = అనెడి; కన్యా = ఆడపిల్లలో; రత్నంబున్ = రత్నమువంటి మె; జనించె = పుట్టెను; అట్టి = అటువంటి; బల = బలము; పరాక్రమవంతుండున్ = పరాక్రమములు గలవాడు; ఐన = అయిన; ప్రియవ్రతుండు = ప్రియవ్రతుడు; విరక్తుండు = వైరాగ్యము గలవాడు; ఐ = అయ్యి; ఒక్కనాడు = ఒక దినమున; నిజ = తన; గురువు = గురువు; అగు = అయినట్టి; నారదుని = నారదుని; చరణ = పాదములు; అనుసేవ = సేవించుటచే; అనుపతిత = లభించిన; రాజ్య = రాజ్యము; ఆది = మొదలగు; ప్రపంచ = ప్రపంచ; సంసర్గమునున్ = సృష్టిని; తలంచి = భావించుకొని; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అటువంటి ద్వీపాలలో ప్రియవ్రతుడు తనంతటివారైన ఆగ్నీధ్రుడు, ఇధ్మజిహ్వుడు, యజ్ఞబాహువు, హిరణ్యరేతసుడు, ఘృతపృష్ఠుడు, మేధాతిథి, వీతిహోత్రుడు అనే కుమారులకు పట్టం కట్టించాడు. ఊర్జస్వతి అనే కన్యను భర్గుని కుమారుడైన శుక్రునికి ఇచ్చి పెళ్ళి చేసాడు. ఆ దంపతులకు దేవయాని అనే కన్యారత్నం పుట్టింది. ఆ తరువాత మహా పరాక్రమవంతుడైన ప్రియవ్రతుడు విరక్తుడై ఒకనాడు తన గురువైన నారదుని పాదసేవవల్ల ప్రాప్తించిన రాజ్యసంపదలను, సంసార బంధాలను తలచుకొని ఇలా అనుకున్నాడు.