పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : ఆగ్నీధ్రాదుల జన్మంబు

  •  
  •  
  •  

5.1-18-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు ప్రియవ్రతుం డేకాదశార్బుద పరివత్సరంబులు రాజ్యంబు చేసి యొక్కనాడు మేరునగ ప్రదక్షిణంబు చేయు సూర్యునకు నపరభాగంబునం బ్రవర్తించు నంధకారంబు నివర్తింపంబూని భగవదుపాసనా జనితాతిపురుష ప్రభావుండై సవితృ రథసదృక్ష వేగంబు గలిగి తేజోమయం బైన రథంబు నారోహణంబు చేసి రాత్రుల నెల్ల దినంబు లొనర్తు నని సప్తరాత్రంబులు ద్వితీయ తపనుండునుం బోలె నరదంబు పఱపుటయు నా రథనేమి మార్గంబులు సప్తసముద్రంబులును, నా మధ్య భూసంధులు సప్తద్వీపంబులు నయ్యె; నందు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; ప్రియవ్రతుండు = ప్రియవ్రతుడు; ఏకాదశ = పదకొండు (11); అర్బుద = అర్బుదముల {అర్బుదము -వెయ్యి కోట్లు, 1 తరువాత 10 సున్నాలు}; పరివత్సరంబులు = సంవత్సరములు; రాజ్యంబున్ = రాజ్యము; చేసి = చేసి; ఒక్క = ఒక; నాడు = దినమున; మేరు = మేరువు అనెడి; నగ = పర్వతమును; ప్రదక్షిణంబున్ = చుట్టు తిరుగుట; చేయు = చేసెడి; సూర్యున్ = సూర్యుని; కున్ = కి; అపరభాగంబునన్ = వెనుక భాగము, రాత్రులందు; ప్రవర్తించు = కలిగెడి; అంధకారంబున్ = చీకట్లను; నివర్తింపన్ = పోగొట్టుటను; పూని = స్వీకరించి; భగవత్ = భగవంతుని; ఉపాసనా = సేవించుటచే; జనిత = పుట్టిన; అతిపురుష = మానవాతీతమైన; ప్రభావుండున్ = ప్రభావము గలవాడు; ఐ = అయ్యి; సవితృ = సూర్యుని; రథ = రథమునకు; సదృక్ష = సమానమైన; వేగంబున్ = వేగము; కలిగి = కలిగి; తేజస్ = తేజస్సుతో; మయంబున్ = నిండినది; ఐన = అయిన; రథంబున్ = రథమును; ఆరోహణంబు = ఎక్కుట; చేసి = చేసి; రాత్రులన్ = రాత్రులను; ఎల్లన్ = అన్నిటిని; దినంబులున్ = పగళ్ళు వలె; ఒనర్తును = చేసెదను; అని = అని; సప్త = ఏడు (7); రాత్రంబులున్ = రాత్రుళ్ళు; ద్వితీయ = రెండవ; తపనుండునున్ = సూర్యుని {తపనుండు – తపింప జేయువాడు, సూర్యుడు}; పోలెన్ = వలె; అరదంబున్ = రథమును; పఱపుటయున్ = పరుగెత్తించుటయు; ఆ = ఆ; రథ = రథచక్రముల; నేమి = చాళ్ళ యొక్క; మార్గంబులున్ = దారులలో; సప్త = ఏడు (7); సముద్రంబులునున్ = సముద్రములును {సప్తసముద్రములు - 1క్షార(కారపు సముద్రము) 2ఇక్షురస(చెరకురసముసముద్రము) 3సుర(సురాసముద్రము) 4ఆజ్య(నెయ్యిసముద్రము) 5క్షీర(పాలసముద్రము) 6దధి(పెరుగుసముద్రము) 7ఉదకంబులు(నీటిసముద్రము)}; ఆ = వాని; మధ్య = మధ్యభాగ మందలి; భూసంధులు = భూభాగములు; సప్త = ఏడు (7); ద్వీపంబులున్ = ద్వీపములును {సప్తద్వీపములు - 1జంబూ(జంబూద్వీపము) 2ప్లక్ష(ప్లక్షద్వీపము) 3శాల్మలిద్వీప(శాల్మలీద్వీపము) 4కుశ(కుశద్వీపము) 5క్రౌంచ(క్రౌంచద్వీపము) 6శాక(శాకద్వీపము) 7పుష్కరములు(పుష్కరద్వీపములు)}; అయ్యెన్ = అయినవి; అందున్ = వానిలో.

భావము:

ఈ విధంగా ప్రియవ్రతుడు పదకొండు అర్బుద సంవత్సరాలు రాజ్యం చేసాడు. ఒకనాడు మేరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తున్న సూర్యునికి ఆవలి భాగంలో కనిపించే చీకటిని రూపుమాపాలని అనుకున్నాడు. భగవంతుణ్ణి నిరంతరం ధ్యానించడం వల్ల కలిగిన శక్తితో సూర్యుని రథంతో సమానమై తేజోమయమైన రథం ఎక్కి రాత్రులను పగళ్ళుగా మారుస్తానంటూ రెండవ సూర్యునిలాగా వెలిగిపోతూ ఏడుమార్లు ప్రదక్షిణం చేసాడు. అప్పుడు ప్రియవ్రతుని రథచక్రాలు గాళ్ళ వలన పడిన దారులు సప్త సముద్రా లయ్యాయి. ఆ గాళ్ళకు నడుమ ఉన్న భూమిపై సప్తద్వీపాలు ఏర్పడ్డాయి.