పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : ఆగ్నీధ్రాదుల జన్మంబు

  •  
  •  
  •  

5.1-16-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు ప్రియవ్రతుండు రాజ్యంబు చేయుచు విశ్వకర్మ ప్రజాపతి పుత్రిక యగు బర్హిష్మతి యనుదానిం బత్నిగాఁ బడసి, యా సతివలన శీల వృత్త గుణ రూప వీర్యౌదార్యంబులం దనకు సమానులైన యాగ్నీధ్రే ధ్మజిహ్వ, యజ్ఞబాహు, మహావీర, హిరణ్యరేతో, ఘృతపృష్ట, సవన, మేధాతిథి, వీతిహోత్ర, కవు లను నామంబులు గల పుత్రదశకంబును; నూర్జస్వతి యను నొక్క కన్యకను గాంచె; నందుఁ గవి మహావీర సవనులు బాలకులయ్యు నూర్ధ్వరేతస్కులై బ్రహ్మవిద్యానిష్ణాతులై యుపశమనశీలు రగుచుం బారమహంస్యయోగం బాశ్రయించి, సర్వజీవనికాయావాసుండును, భవభీతజనశరణ్యుండును, సర్వాంతర్యామియు, భగవంతుండు నగు వాసుదేవుని చరణారవిందావిరత స్మరణానుగత పరమ భక్తియోగానుభావంబున విశోధితాంతఃకరణు లగుచు నీశ్వరుతాదాత్మ్యంబుఁ బొంది; రంత.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; ప్రియవ్రతుండు = ప్రియవ్రతుడు; రాజ్యంబున్ = రాజ్యమును; చేయుచున్ = చేయుచూ; విశ్వకర్మ = విశ్వకర్మ అనెడి; ప్రజాపతి = ప్రజాపతి యొక్క; పుత్రిక = కుమార్తె; అగు = అయిన; బరిష్మతి = బరిష్మతి; అను = అనెడి; దానిన్ = ఆమెను; పత్ని = భార్య; కాన్ = అగునట్లు; పడసి = పొంది; ఆ = ఆ; సతి = భార్య; వలనన్ = అందు; శీల = శీలము నందు; వృత్త = వర్తనము నందు; గుణ = సుగుణము లందు; రూప = అందము నందు; వీర్య = శౌర్యము నందు; ఔదార్యంబులన్ = ఔదార్యమలు; అందున్ = అందును; తన = తన; కున్ = కు; సమానులు = సరి అగువారు; ఐన = అయిన; ఆగ్నీధ్ర = ఆగ్నీధ్రుడు; ఇధ్మజిహ్వ = ఇధ్మజిహ్వుడు; యజ్ఞబాహు = యజ్ఞబాహువు; మహావీర = మహావీరుడు; హిరణ్యరేతః = హిరణ్యరేతసుడు; ఘృతపృష్ట = ఘృతపృష్టుడు; సవన = సవనుడు; మేధాతిథి = మేధాతిథి; వీతిహోత్ర = వీతిహోత్రుడు; కవి = కవి; ఆను = అనెడి; నామంబులున్ = పేర్లు; కల = కలిగిన; పుత్ర = కుమారుల; దశకంబును = పదిమందిని; ఊర్జస్వతి = ఊర్జస్వతి; అను = అనెడి; ఒక్క = ఒక; కన్యకన్ = పుత్రికను; కాంచెన్ = కనెను; అందున్ = వారిలో; కవి = కవి; మహావీర = మహావీరుడు; సవనులున్ = సవనుడును; బాలకులు = పిల్లవాండ్రు; అయ్యున్ = అయినప్పటికిని; ఊర్ధ్వరేతస్కులు = బ్రహ్మచారులు {ఊర్ధ్వరేతస్కులు - ఊర్ధ్వ (పైకి ప్రసరించెడి) రేతస్కులు (రేతస్సు గలవారు), బ్రహ్మచారులు}; ఐ = అయ్యి; బ్రహ్మవిద్యా = బ్రహ్మవిద్య యందు; నిష్ణాతులు = మిక్కిలి నేర్పరులు; ఐ = అయ్యి; ఉపశమన = శాంతించిన; శీలురు = స్వభావములు గలవారు; అగుచున్ = అగుచూ; పారమహంస్య = పరమహంసలకు చెందిన; యోగంబున్ = యోగమును; ఆశ్రయించి = ప్రాపును పొంది; సర్వ = అఖిలమైన; జీవ = ప్రాణుల; నికాయ = సమూహమున; వాసుండునున్ = నివసించెడివాడు; భవ = సంసారము ఎడ; భీత = భయము చెందిన; జన = వారికి; శరణ్యుండునున్ = శరణము ఇచ్చువాడు; సర్వ = అఖిలమైన జీవుల; అంతర్యామియున్ = లోపలను ఉండెడివారు; భగవంతుడును = మహాత్మ్యము గలవాడును; అగు = అయిన; వాసుదేవునిన్ = విష్ణుమూర్తి యొక్క; చరణ = పాదములు యనెడి; అరవిందా = పద్మములను; ఆవిరత = విరామములేని; స్మరణ = ధ్యానము నందు; అనుగత = అనుసరించెడి; పరమ = అత్యధికమైన; భక్తియోగ = భక్తియోగము నందు; అనుభావంబునన్ = అనుభవపూర్వకముగా; విశోధిత = పరిశుద్ధిచేయబడిన; అంతఃకరణులు = మనసులు గలవాడు; అగుచున్ = అగుచు; ఈశ్వరున్ = భగవంతుని ఎడల; తాదాత్మ్యంబున్ = అది తానే అగుటను; పొందిరి = పొందిరి; అంతన్ = అంతట.

భావము:

ఈ విధంగా ప్రియవ్రతుడు రాజ్యం చేస్తూ విశ్వకర్మ ప్రజాపతి కుమార్తె అయిన బర్హిష్మతి అనే యువతిని పెళ్ళాడి ఆమెవల్ల శీలంలోను, ప్రవర్తనలోను, గుణంలోను, రూపంలోను, పరాక్రమంలోను, ఔదార్యంలోను తనతో సమానులైన ఆగ్నీధ్రుడు, ఇధ్మజిహ్వుడు, యజ్ఞబాహువు, మహావీరుడు, హిరణ్యరేతసుడు, ఘృతపృష్ఠుడు, సవనుడు, మేధాతిథి, వీతిహోత్రుడు, కవి అనే పదిమంది కొడుకులను, ఊర్జస్వతి అనే కుమార్తెను కన్నాడు. వారిలో కవి, మహావీరుడు, సవనుడు అనేవారు చిన్నవారైనా బ్రహ్మచర్యం అవలంబించి బ్రహ్మవిద్యా నిష్ణాతులై శాంతమే స్వభావంగా గలవారై పరమహంస యోగాన్ని పొందినారు. సమస్త జీవులకు ఆవాసమైనవాడు, సంసార భయ భ్రాంతులకు శరణ్యమైనవాడు, సర్వాంతర్యామి, భగవంతుడు అయిన వాసుదేవుని పాదపద్మాలను సర్వదా స్మరించడం వల్ల లభించిన భక్తియోగం ప్రభావంతో మనస్సు మరింత పరిశుద్ధం కాగా ఈశ్వర తాదాత్మ్యం పొందారు.