పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : సింధుపతి విప్ర సంవాదంబు

  •  
  •  
  •  

5.1-180-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నరేంద్రా! భరతుండు సుతదారరాజ్యాదులను బూర్వకాలంబునంద విడిచి భగవత్పరుం డగుచు యజ్ఞరూపంబును ధర్మస్వరూపంబును సాంఖ్యయోగంబును బ్రకృతిపురుష స్వరూపంబును నైన నారాయణునకు నమస్కారం బనుచు మృగరూపంబును బాసె; నట్టి భరతుని చరిత్రం బెవ్వరు చెప్పిన నెవ్వరు వినిన నట్టివారలఁ బుండరీకాక్షుండు రక్షించు; నాయు రభివృద్ధి యగు; ధనధాన్య సమృద్ధియు నగుచుండ స్వర్గోపభోగంబులం బొందుదు; రని.

టీకా:

నరేంద్రా = రాజా; భరతుండు = భరతుడు; సుత = బిడ్డలు; దార = భార్య; రాజ్య = రాజ్యము; ఆదులనున్ = మొదలగునవానిని; పూర్వ = ఇంతకుముంద; కాలంబునన్ = కాలములోనే; విడిచి = వదలివేసి; భగవత్ = భగవంతుని ఎడ; పరుండు = లగ్నమైనవాడు; అగుచున్ = అగుచు; యజ్ఞ = యజ్ఞము యొక్క; రూపంబును = రూపమును; ధర్మ = ధర్మము యొక్క; రూపంబునున్ = రూపమును; సాంఖ్యయోగంబును = సాంఖ్యయోగమును; ప్రకృతి = ప్రకృతి; పురుష = పురుషుడు; స్వ = తన యొక్క; రూపంబున్ = రూపమే; ఐన = అయినట్టి; నారాయణున్ = నారాయణుని; కున్ = కి; నమస్కారంబున్ = నమస్కారములు; అనుచున్ = అనుచూ; మృగ = లేడి; రూపంబున్ = రూపమును; పాసెన్ = విడిచిపెట్టెను; అట్టి = అటువంటి; భరతుని = భరతుని యొక్క; చరిత్రంబు = చరిత్రను; ఎవ్వరు = ఎవరు; చెప్పినన్ = చెప్పితే; ఎవ్వరు = ఎవరు; వినినన్ = వినినను; వారలన్ = వారిని; పుండరీకాక్షుండు = విష్ణుమూర్తి {పుండరీకాక్షుండు - పుండరీకములు (పద్మములు) వంటి అక్షుండు (కన్నులు కలవాడు), విష్ణువు}; రక్షించున్ = రక్షించును; ఆయుర్ = ఆయుర్దాయము; అభివృద్ధి = పెరిగినది; అగున్ = అగును; ధన = ధనము; ధాన్య = సంపదలు; సమృద్దియున్ = మిక్కిలి వృద్ధిపొందినవి; అగుచుండన్ = అగుతుడగా; స్వర్గ = స్వర్గమునకు; ఉప = పోల్చదగిన; భోగంబులన్ = భోగములను; పొందుదురు = పొందెదరు; అని = అని.

భావము:

“రాజా! భరతుడు భార్య, కుమారులు, రాజ్యం మొదలైనవి ముందే విడిచి, భగవంతుని పట్ల నిష్ఠ పెంచుకొని యజ్ఞమయుడు, ధర్మస్వరూపుడు, ప్రకృతి పురుషాత్మకుడు అయిన నారాయణునికి నమస్కార మంటూ హరిణరూపాన్ని విడిచాడు. అటువంటి భరతుని చరిత్రను ఎవరు చెప్పినా, ఎవరు విన్నా వారిని విష్ణువు రక్షిస్తాడు. వారికి ఆయురభివృద్ధి, ధనధాన్య సమృద్ధి సిద్ధిస్తుంది. స్వర్గ సుఖాలను అనుభవిస్తారు”.