పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : సింధుపతి విప్ర సంవాదంబు

  •  
  •  
  •  

5.1-175-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"మఱియుం గాలచక్రనియంత్రితుండై చక్రాయుధునిం గొల్వక కాక గృధ్ర బకసమానులైన పాషాండులతోడి సఖ్యంబునం జేసి వారలచేత వంచితుండై బ్రాహ్మణకులంబునంజేసి శ్రౌత స్మార్తకర్మానుష్ఠానపరుం డై విషయసుఖంబు లందుఁ దగులుబడి కాలంబు తుద నెఱుంగక వృక్షంబులుం బోలె నైహికార్థంబులయందుఁ దృష్ణ గలిగి మైథున నిమిత్తంబు సుతదారాదులయందు స్నేహంబు చేయుచుఁ బథికుండు మాతంగంబుల యందు భయంబున దీర్ఘనిమ్నకూపంబునం బడిన తెఱంగున సంసారమృత్యు గజ భయంబున గిరికంధరప్రాయం బయిన యజ్ఞాన తమంబునం బడుం గావున మాయచేత సంసారమార్గం బైన రాజ భావంబు విడిచి సర్వభూతమైత్రి గలిగి జితేంద్రియుండవై జ్ఞానాసిచే మార్గంబు కడపల గను" మని పలికిన భూపాలుం డిట్లనియె.

టీకా:

మఱియున్ = ఇంకను; కాల = కాల మనెడి; చక్ర = వలయమున; నియంత్రితుండు = నియమింపబడెడివాడు; ఐ = అయ్యి; చక్రాయుధునిన్ = విష్ణుని {చక్రాయుధుడు - చక్రము ఆయుధముగా కలవాడు, విష్ణువు}; కొల్వక = సేవించకుండగ; కాక = కాకులు; గృధ్ర = గద్దలు; బక = కొంగలకు; సమానులు = సమానమైనవారు; ఐన = అయినట్టి; పాషాండులు = పాషాండులు {పాషాండులు - వేదోక్త ధర్మములకు దూరమైనవారు}; తోడి = తోటి; సఖ్యంబునన్ = స్నేహములు; చేసి = వలన; వారల = వారి; చేతన్ = చేత; వంచితుండు = మోసగింపబడినవాడు; ఐ = అయ్యి; బ్రాహ్మణ = విప్ర; కులంబునన్ = కులము; చేసి = వలన; శ్రౌత = వేదము లందు విధింపబడినట్టి; స్మార్త = స్మృతు లందు విధింపబడినట్టి; కర్మ = కర్మములను; అనుష్ఠాన = ఆచరించుట యందు; పరుండు = లగ్నమైనవాడు; ఐ = అయ్యి; విషయ = ఇంద్రియార్థ; సుఖంబుల్ = సుఖముల; అందున్ = లో; తగులుబడి = తగుల్కొని; కాలంబున్ = కాలము యొక్క; తుదన్ = ప్రభావమును; ఎఱుంగక = తెలియలేక; వృక్షంబులున్ = చెట్ల; పోలెన్ = వలె; ఐహిక = భౌతిక; అర్థంబులు = ప్రయోజనముల; అందున్ = లో; తృష్ణ = మిక్కిలి లాలస; కలిగి = కలిగి; మైథున = ఇంద్రిసుఖముల; నిమిత్తంబున్ = కోసము; సుత = బిడ్డలు; దార = భార్య; ఆదుల = మొదలగువారి; అందున్ = ఎడల; స్నేహంబున్ = ప్రీతి; చేయుచున్ = చేయుచూ; పథికుండు = బాటసారి; మాతంగంబుల = మదపుటేనుగుల; అందున్ = ఎడలి; భయంబునన్ = భయముచేత; దీర్ఘ = పెద్దదైన; నిమ్న = లోతైన; కూపంబునన్ = బావిలో; పడిన = పడిపోయిన; తెఱంగునన్ = విధముగ; సంసార = సంసారపు; మృత్యు = మరణము యనెడి; గజ = ఏనుగు వలని; భయంబునన్ = భయముచేత; గిరి = కొండ; కంధర = గుహకు; ప్రాయంబున్ = సమానమైనది; అయిన = అయినట్టి; అజ్ఞానతమంబునన్ = అజ్ఞానము అనెడి చీకటిలో; పడున్ = పడిపోవును; కావునన్ = కనుక; మాయ = మాయ; చేతన్ = చేత; సంసార = సాంసారికపు; మార్గంబున్ = పద్దతిలోనిది; ఐన = అగు; రాజ = రాజు యనెడి; భావంబున్ = భావమును; విడిచి = వదలివేసి; సర్వ = నిఖిలమైన; భూత = ప్రాణుల ఎడ; మైత్రి = స్నేహము; కలిగి = కలిగి; జిత = జయించిన; ఇంద్రియుండవు = ఇంద్రియములు కలవాడు; ఐ = అయ్యి; జ్ఞాన = జ్ఞానము యనెడి; అసి = కత్తి; చేన్ = చేత; మార్గంబున్ = జీవితమార్గమును; కడపలన్ = దాటుటను; కనుము = చూడుము; అని = అని; పలికినన్ = పలుకగా; భూపాలుండు = రాజు {భూపాలుడు - భూమిని పాలించెడివాడు, రాజు}; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇంకా కాలచక్రాన్నే నియమించిన ఆ విష్ణువును కొలువక కాకులు, గ్రద్దలు, కొంగల వంటి వారైన పాషండులతో స్నేహం పెంచుకొని వారిచేత మోసగింపబడతారు. కొందరు బ్రాహ్మణకులంలో పుట్టి శ్రౌతం, స్మార్తం మొదలైన వైదిక కర్మలను నియమ నిష్ఠలతో చేస్తున్నా విషయసుఖాలకు లోబడి కాలప్రభావాన్ని తెలుసుకొనక ఉంటారు. చెట్టులాగా ఐహిక ప్రయోజనాలపై ఆసక్తి కలిగి, ఇంద్రియ సుఖాలకోసం భార్యాపుత్రులు మొదలైన వారియందు ఇష్టాన్ని పెంచుకొంటారు. మదపు టేనుగులకు భయపడిన బాటసారి లోతైన బావిలో పడిపోయిన విధంగా సంసారి మృత్యువనే ఏనుగు భయంతో కొండగుహ వంటి అజ్ఞానమనే చీకటిలో పడతాడు. అందుచేత మాయను తొలగించుకొని, సంసార కారణమయిన నీ రాజభావాన్ని విడిచిపెట్టు. అన్ని ప్రాణుల పట్ల మైత్రి పెంచుకొని ఇంద్రియాలను జయించు. జ్ఞానమనే కత్తి చేపట్టి మార్గం చేసుకొని భయంకరమైన ఆ అడవినుండి బయటపడు” అని భరతుడు చెప్పగా రాజు ఇలా అన్నాడు.