పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : సింధుపతి విప్ర సంవాదంబు

  •  
  •  
  •  

5.1-171-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు నొక్కచోట నులూక ఝిల్లీ స్వనంబులతోడ సమానంబు లయిన శత్రురాజి తిరస్కారంబులకు దుఃఖపడుచు, నొక్కచోట క్షుధార్దితుండై యపుణ్య ఫలవృక్షంబుల నాశించు మాడ్కిఁ బాపకర్ములు ద్రవ్యహీనులు నగు వారి నాశ్రయించుచు, నొక్క యెడం బిపాసాతురుండై జలహీనం బయిన నదికిఁ జనిన రీతి నిహపరదూరు లైన పాషండుల సేవించుచు, మఱియు నొక్క ప్రదేశంబునం దగ్నిచేతం దప్తుడయిన వాఁడు దావాగ్నిం జేరి వ్యధ నొందురీతి, నన్నార్థి యగుచు దాయాదులం జేరి దుఃఖించుచు, మఱియు నొక్కచోటఁ బరబాధం జేసి మున్ను గానక రాజ్యాభిలాషం బ్రాణసఖులైన పితృపుత్రభ్రాతృ జ్యేష్ఠుల నైనను వధియించుచు, మఱియు శూరులచేతం గొట్టుబడి సర్వధనంబును బోనాడి చింతాపరవశుండై దుఃఖించుచు నున్నంత గంధర్వనగరప్రాయంబైన సంసార సుఖంబు ననుభవించి మోదించుచు, మఱియు నగారోహణంబు చేయు నరుండు గంటక పాషాణాదులవలనం బాదపీడితుం డగుచు దుఃఖించు చందంబున గృహాశ్రమోచిత మహానుష్ఠానంబునకు నుపక్రమించి వ్యసన కంటక శర్కరాపీడితుండై దుఃఖించుచు, నొక్కచోటన్ జఠరాగ్నిపీడితుండై కుటుంబంబు మీఁద నాగ్రహించుచు, వనంబున నజగరగళితుండై జీర్ణితుండైన చందంబున రాత్రి గృహాటవి యందు నిద్రాపరవశుండై యెఱుంగక వర్తించుచు, మఱియును వనంబునఁ దృణచ్ఛన్న కూపపతితుం డగుచు సర్పదష్టుండైన తెఱంగున సంసారి యై దుర్జనులచేత వ్యధితహృదయుం డగుచు నంధుండై యజ్ఞానాంధ కూపంబునం బడుచు, నొక్క యెడ జుంటితేనియకునై మక్షికాబాధ నత్యంతదుఃఖితుం డయిన మాడ్కిని సంసారకాముండై పరదార ద్రవ్యా భిలాషి యగుచు భూపాలకులచేతనైనను గృహపతిచేతనైనను దాడితుండై నరకంబునం బడుచు యౌవనంబున సంపాదించిన ద్రవ్యంబులు పరులచేతం బోనాడిన విధంబున శీతవాతాద్యనేక ప్రయాస లబ్ధంబైన ధనంబు వోనాడి సంసారి యతిచింతాక్రాంతుం డై యుండు; మఱియును వనంబున లుబ్ధకులు సంసృష్టంబయిన యల్పామిషంబునకు నన్యోన్య వైషమ్యంబునం గలహించిన విధంబున సంసృష్ట వ్యవహారియై యల్పద్రవ్యంబులకుం బోరాడుచుండు" నని భూపాలు నకు విప్రుండు సంసారాటవి తెఱం గెఱింగించి వెండియు నిట్లనియె.

టీకా:

మఱియున్ = ఇంకా; ఒక్క = ఒక; చోటన్ = చోట; ఉలూక = గుడ్లగూబలు; ఝిల్లీ = ఈలపురుగుల; స్వనంబుల్ = అరుపుల; తోడన్ = తో; సమానంబులు = సమానము; అయిన = అయినట్టి; శత్రు = శత్రువులైన; రాజి = రాజుల యొక్క; తిరస్కారంబులు = అవమానముల; కున్ = కు; దుఃఖ = దుఃఖము; పడుచున్ = పడుతూ; ఒక్క = ఒక; చోటన్ = చోట; క్షుధ = ఆకలితో; అర్థితుండు = కోరువాడు; ఐ = అయ్యి; అపుణ్య = పాప; ఫల = ఫలముల; వృక్షంబున్ = చెట్లను; ఆశించు = అపేక్షించు; మాడ్కిన్ = వలె; పాప = పాపపు; కర్ములనున్ = కర్మలు చేయు వారిని; ద్రవ్య = సంపదలు; హీనులున్ = లేనివారు; అగు = అయినట్టి; వారినిన్ = వారిని; ఆశ్రయించుచున్ = ఆశ్రయించుతూ; ఒక్క = ఒక; ఎడన్ = సమయములో; పిపాసా = దాహముచే; ఆతురుండు = తొందరపడువాడు; ఐ = అయ్యి; జల = నీరు; హీనంబున్ = లేనట్టిది; అయిన = ఐన; నది = నది; కిన్ = కి; చనిన = వెళ్శిన; రీతిన్ = విధముగ; ఇహ = ఈలోకమునకు; పర = పరలోకమునకు; దూరులు = చెడిపోయినవారు; ఐన = అయినట్టి; పాషండులన్ = పాషండులను; సేవించుచున్ = సేవించుతూ; మఱియున్ = ఇంకను; ఒక్క = ఒక; ప్రదేశంబునన్ = చోట; అగ్నిన్ = నిప్పు; చేతన్ = చేత; తప్తుండు = కాలినవాడు; అయిన = అయిన; వాడు = వాడు; దావాగ్నిన్ = కారుచిచ్చును; చేరి = చేరి; వ్యధన్ = బాధను; ఒందు = పొందెడి; రీతిన్ = విధముగా; అన్నార్థి = ఆన్నమును కోరువాడు; అగుచున్ = అగచు; దాయాదులన్ = దాయాదుల {దాయాదులు - పిత్రార్జితమును పంచుకొనెడివారు}; చేరి = దగ్గరకు చేరి; దుఃఖించుచు = దుఃఖించుచు; మఱియున్ = ఇంకను; ఒక్క = ఒక; చోటన్ = చోట; పర = శత్రువుల యొక్క; బాధన్ = బాధ; చేసి = వలన; మున్నున్ = భవిష్యత్తు; కానక = చూడలేక; రాజ్య = రాజ్యముపైని; అభిలాషన్ = కోరికవలన; ప్రాణసఖులు = ప్రాణస్నేహితులు; ఐనన్ = అయినను; పితృ = తండ్రి; పుత్ర = కొడుకు; భ్రాతృ = సోదరులు; జ్యేష్ఠులన్ = పెద్దవారిని; ఐననున్ = అయినను; వధియించుచున్ = సంహరించుతూ; మఱియున్ = ఇంకను; శూరుల = వీరుల; చేతన్ = చేత; కొట్టుబడి = కొట్టబడి; సర్వ = సమస్తమైన; ధనంబును = ధనమును; పోనాడి = పోగొట్టుకొని; చింతా = వ్యధలకు; పరవశుండు = లొంగిపోయినవాడు; ఐ = అయ్యి; దుఃఖించుచున్ = దుఃఖించుచు; ఉన్నంతన్ = ఉండగా; గంధర్వనగర = మేఘాలలో గాలిమేడలకు; ప్రాయంబున్ = సమానమైనవి; ఐన = అయిన; సంసార = సంసారము నందలి; సుఖంబున్ = సుఖములను; అనుభవించి = అనుభవించి; మోదించుచు = సంతోషించుతూ; మఱియునున్ = ఇంకను; నగన్ = కొండను; ఆరోహణంబున్ = ఎక్కుట; చేయు = చేసెడి; నరుండు = మానవుడు; కంటక = ముళ్ళు; పాషాణ = రాళ్ళు; ఆదుల = మొదలగువాని; వలన = వలన; పాద = పాదము లందు; పీడితుండు = పీడింపబడువాడు; అగుచున్ = అగుచు; దుఃఖించు = దుఃఖించెడి; చందంబునన్ = విధముగ; గృహాశ్రమ = గృహస్తాశ్రమమునకు; ఉచిత = తగిన; మహా = గొప్పగొప్ప; అనుష్టానంబున్ = ఆచారములకు; ఉపక్రమించి = పూనుకొని; వ్యసన = బాధలు అనెడి; కంటక = ముళ్ళు; శర్కరా = గులకరాళ్లుచేత; పీడితుండు = బాధింపబడినవాడు; ఐ = అయ్యి; దుఃఖించుచున్ = దుఃఖించుచు; ఒక్క = ఒక; చోటన్ = చోట; జఠరాగ్ని = ఆకలిచే; పీడితుండు = బాధింపబడువాడు; ఐ = అయ్యి; కుటుంబంబున్ = కుటుంబసభ్యుల; మీదన్ = పైన; ఆగ్రహించుచు = కోపించుతూ; వనంబునన్ = అడవిలో; అజగర = కొండచిలువచే; గళితుండు = మింగబడినవాడు; ఐ = అయ్యి; జీర్ణితుండు = అరిగిపోయినవాడు; ఐన = అయిన; చందంబునన్ = విధముగ; రాత్రిన్ = రాత్రులలో; గృహా = ఇల్లు అనెడి; అటవిన్ = అడవి; అందున్ = లో; నిద్రా = నిద్రకు; పరవశుండు = లొంగినవాడు; ఐ = అయ్యి; ఎఱుంగక = తెలియక; వర్తించుచున్ = తిరుగుతూ; మఱియునున్ = ఇంకను; వనంబునన్ = అడవిలో; తృణత్ = గడ్డిచే; ఛన్న = కప్పబడిన; కూప = గోతిలో; పతితుండు = పడినవాడు; అగుచున్ = అగుచు; సర్ప = పాముచే; దష్టుండున్ = కాటు వేయబడినవాడు; ఐన = అయిన; తెఱంగునన్ = విధమున; సంసారి = సంసారము నడపువాడు; ఐ = అయ్యి; దుర్జనుల్ = చెడ్డవారి; చేతన్ = చేత; వ్యధిత = బాధింపబడిన; హృదయుండు = హృదయము కలవాడు; అగుచున్ = అగుచు; అంధుండు = గుడ్డివాడు; ఐ = అయ్యి; అజ్ఞాన = అజ్ఞానము అనెడి; అంధ = చీకటి; కూపంబునన్ = బావిలో; పడుచున్ = పడుతూ; ఒక్క = ఒక; ఎడన్ = చోట; జుంటితేనియ = పట్టుతేనె; కున్ = కోసము; ఐ = అయ్యి; మక్షికా = తేనెటీగలచే; బాధన్ = బాధతో; అత్యంత = అత్యధికమైన; దుఃఖితుండు = దుఃఖించువాడు; అయిన = అయిన; మాడ్కిని = వలె; సంసార = సంసారము నందు; కాముండు = ఆపేక్ష కలవాడు; ఐ = అయ్యి; పర = ఇతరుల; దార = భార్యను; ద్రవ్య = వస్తువులు ఎడ; అభిలాషి = కోరువాడు; అగుచున్ = అగుచు; భూపాలకుల్ = రాజుల {భూపాలకులు - భూమి (రాష్ట్రము)ని పరిపాలించెడివారు, రాజులు}; చేతన్ = చేత; ఐననున్ = అయినను; గృహపతి = ఇంటి యజమాని; చేతన్ = చేత; ఐననున్ = అయినను; తాడితుండు = కొట్టబడినవాడు; ఐ = అయ్యి; నరకంబునన్ = నరకములో; పడుచున్ = పడుతూ; యౌవనంబునన్ = యువకవయస్సులో; సంపాదించిన = సంపాదించినట్టి; ద్రవ్యంబులు = వస్తువులు; పరుల = ఇతరుల; చేతన్ = చేత; పోనాడిన = పోగొట్టుకొన్న; విధంబునన్ = విధముగ; శీతవాతా = చలిగాలి; ఆది = మొదలగు; అనేక = అనేకమైన; ప్రయాసలన్ = శ్రమలచే; లబ్ధంబున్ = లభించినది; ఐన = అయిన; ధనంబున్ = ధనమును; పోనాడి = పోగొట్టుకొని; సంసారి = సంసారి; అతి = మిక్కిలి; చింతా = ఆవేదనలచే; ఆక్రాంతుండు = ఆక్రమింపబడినవాడు; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; మఱియునున్ = ఇంకను; వనంబునన్ = అడవిలో; లుబ్ధకులు = బోయవాండ్రు; సంసృష్టంబు = చక్కగా చేసినది; అయిన = అయిన; అల్ప = కొద్ది, అల్పప్రాణుల; అమిషంబున్ = మాంసమున; కున్ = కోసము; అన్యోన్య = వారిలోవారే; వైషమ్యంబునన్ = విరోధములతో; కలహించిన = దెబ్బలాడుకొనిన; విధంబునన్ = విధముగనే; సంసృష్ట = కల్పించుకొన్నట్టి; వ్యవహారి = వివాదములు చేయువాడు; ఐ = అయ్యి; అల్ప = కొద్దిపాటి; ద్రవంబుల్ = ధనముల; కున్ = కు; పోరాడుచుండును = తగవులాడుతూండును; అని = అని; భూపాలున్ = రాజున; కున్ = కు; విప్రుండు = బ్రాహ్మణుడు; సంసార = సంసార మనెడి; అటవిన్ = అడవిని; తెఱంగున్ = విధమును; ఎఱింగించి = తెలియజేసి; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇంకా ఒకచోట గుడ్లగూబల కూతలకు, కీచురాళ్ళ రొదలకు సమానమైన విరోధుల తిరస్కారాలకు దుఃఖిస్తూ ఉంటాడు. ఇంకొకచోట ఆకలితో బాధపడుతూ పిచ్చిచెట్ల పళ్ళను తినడానికి సిద్ధపడినట్లు పాపాత్ములైన దరిద్రులను ఆశ్రయిస్తూ ఉంటాడు. మరోచోట దాహంతో బాధపడుతూ వట్టిపోయిన నది దగ్గరికి పోయినట్లు ఇహపరాలకు విముఖులైన పాషండులను సేవిస్తూ ఉంటాడు. వేరొకచోట మంటలు చుట్టుకొన్నవాడు దావాగ్నిలో చిక్కుకొని బాధపడినట్లు దాయాదులను చేరి కష్టాల పాలౌతాడు. ఇంకొకసారి శత్రుబాధల వలన భవిష్యత్తును కోల్పోయి రాజ్యంమీది కోరికతో తండ్రి, కొడుకులు, సోదరులు, పెద్దవారినైనా చంపుతూ చివరకు బలవంతుల చేత దెబ్బతిని సమస్త సంపదలను పోగొట్టుకొని బాధపడతాడు. గాలిమేడలవంటి సంసార సుఖాలను అనుభవిస్తూ సంతోషంగా ఉన్నా ననుకుంటాడు. కొండ లెక్కేవాడు ముళ్ళు, రాళ్ళు గుచ్చుకొని పాదాలు బొబ్బలెక్కి బాధపడుతున్నట్లుగా గృహస్థాశ్రమంలో చేపట్టవలసిన కార్యక్రమాలలో నానావిధాలైన బాధలతో వ్యసనాలతో పీడింపబడతాడు. ఒక్కొక్కసారి ఆకలి మంటలకు తట్టుకోలేక ఇంట్లో అందరిమీద అనవసరంగా విసుగుకొని కసురుకుంటాడు. అడవిలో కొండచిలువ వాతబడి మెలికలు తిరిగి స్పృహ కోల్పోయినట్లుగా ఇల్లనే అడవిలో రాత్రివేళ నిద్రలో మైమరచి పొరలుతూ ఉంటాడు. అడవిలో గడ్డిచేత కప్పబడిన బావిలో పడిపోయి పాముకాటుకు గురి అయినట్లు సంసారంలో దుర్జనులు పెట్టే బాధలకు మనస్సు కల్లోలపడి కనులు గానక అజ్ఞానమనే చీకటిగోతిలో పడతాడు. ఒక్కొక్కసారి తేనెకోసం తేనెతెట్టెను రేపి తేనెటీగల బారిన పడినట్లు సంసార సుఖాన్ని కోరి ఇతరుల భార్యలను, వస్తువులను కోరుకొని ఇంటి యజమానులచేతనో, రాజులచేతనో దెబ్బలు తింటాడు. యౌవనంలో ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తిని ముసలితనంలో పరులపాలు చేసినట్లు సంసారి అయినవాడు చలికీ గాలికీ వానకూ ఓర్చుకొని సంపాదించిన సొమ్మును ఇతరులు హరింపగా దిగులుతో క్రుంగిపోతాడు. అంతే కాకుండా అడవిలో లభించిన అల్పజంతువుల మాంసంకోసం బోయలు కొట్లాడుకున్నట్లు సంసారంలో కుట్రలు కుతంత్రాలు పన్నుతూ కొద్దిపాటి ధనంకోసం తన్నులాడుకొంటారు” అని ఈ విధంగా భరతుడు రాజుకు సంసారం అడవి వంటిదని తెలియజేసి ఇంకా ఇలా అన్నాడు.