పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : సింధుపతి విప్ర సంవాదంబు

  •  
  •  
  •  

5.1-163-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నరేంద్రా! యేను బూర్వంబున భరతుం డను రాజను; సర్వసంగపరిత్యాగంబు చేసి భగవదారాధనంబు చేయుచు మృగంబుతోడి స్నేహంబు కతన మృగంబనై పుట్టియు నందును హరిభక్తి దప్పకుండిన కతంబున నిప్పుడు మనుష్యుండనై మనుష్య సంసర్గంబును బాసి యేకాకి నై చరియించు చున్నవాఁడ; నరుండు వృద్ధసంసేవం జేసి సంసార మోహంబును బాసి హరిధ్యానకథలచే లబ్ధజ్ఞానుండై పుండరీకాక్షునిం బూజించుచుం బరలోకంబునుం బొందు" నని పలికి విప్రుండు మఱియు నిట్లనియె

టీకా:

నరేంద్రా = రాజా; ఏను = నేను; పూర్వంబునన్ = పూర్వపు జన్మలో; భరతుండు = భరతుడు; అను = అనెడి; రాజను = రాజును; సర్వసంగపరిత్యాగంబున్ = సర్వసంగపరిత్యాగంబు {సర్వసంగపరిత్యాగంబు - సర్వ (సమస్తమైన) సంగ (తగులములను) పరిత్యాగము (పూర్తిగా విడిచివేయుట)}; చేసి = చేసి; భగవత్ = భగవంతుని; ఆరాధనంబు = పూజించుట; చేయుచున్ = చేయుచూ; మృగంబున్ = లేడి; తోడి = తోటి; స్నేహంబు = ప్రీతి; కతనన్ = వలన; మృగంబ = లేడిని; ఐ = అయ్యి; పుట్టియున్ = జన్మించియును; అందునున్ = దానిలో కూడ; హరి = నారాయణుని; భక్తిన్ = భక్తని; తప్పక = విడువక; ఉండిన = ఉండినట్టి; కతంబునన్ = కారణముచే; ఇప్పుడు = ఇప్పుడు; మనుష్యుండను = మానవుడను; ఐ = అయ్యి; మనుష్య = మానవులను; సంసర్గంబును = చేరుటలు; పాసి = విడిచిపెట్టి; ఏకాకిని = ఒంటరిని; ఐ = అయ్యి; చరియించుచున్ = తిరుగుతూ; ఉన్నవాడన్ = ఉన్నాను; నరుండు = మనిషి; వృద్ధ = పెద్దల; సేవన్ = సేవించుట; చేసి = వలన; సంసార = సంసార మందలి; మోహంబునున్ = తగులమును; పాసి = విడిచిపెట్టి; హరి = నారాయణుని; ధ్యాన = ధ్యానించెడి; కథల్ = కథలు; చేన్ = చేత; లబ్ధ = లభించిన; జ్ఞానుండు = జ్ఞానము కలవాడు; ఐ = అయ్యి; పుండరీకాక్షునిన్ = నారాయణుని; పూజించుచున్ = సేవించుతూ; పరలోకంబునున్ = పరలోకమును; పొందును = పొందును; అని = అని; పలికి = పలికి; విప్రుండు = బ్రాహ్మణుడు; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

“రాజా! నేను పూర్వజన్మలో భరతుడనే రాజును. సర్వసంగ పరిత్యాగం చేసి భగవంతుని ఆరాధిస్తూ ఒక జింకతో స్నేహం కారణంగా జింకనై పుట్టాను. ఆ జన్మలోను విష్ణుభక్తిని తప్పకుండా ఉన్నందున ఇప్పుడు మానవుడిగా జన్మించి జన సంపర్కాన్ని వదలి హరిని ధ్యానించడం, అతని కథలను వినడం ద్వారా లభించిన జ్ఞానంతో విష్ణువును పూజిస్తూ పరమపదాన్ని పొందుతాను” అని చెప్పి ఆ బ్రాహ్మణుడైన భరతుడు ఇంకా ఇలా అన్నాడు.