పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : సింధుపతి విప్ర సంవాదంబు

  •  
  •  
  •  

5.1-146-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నరేంద్రా! నీవు చెప్పునది సత్యంబు; భారం బీ శరీరంబునకే కాని నాకుం గలుగనేర; దైనను స్థౌల్యకార్శ్యంబులు వ్యాధులు నాధులు క్షుత్తృష్ణలు నిచ్ఛావిరోధభయంబులు జరామరణంబులు రోషనిద్రాజాగరణంబులు నహంకార మమకార మదశోషణాదులు దేహంబుతోడన జనియించుం గాని నాకుం గలుగనేరవు; జీవన్మృతుండ నేన కాదాద్యంతంబులు గలుగుటం జేసి యందఱి యందును గలిగి యుండు; స్వామిభృత్య సంబంధంబులు విధికృతంబు లగుచు వ్యవహారంబులం జేసి శరీరంబులకుం గలుగుంగాని జీవునికి లేక యుండు; నదియునుంగాక రాజాభిమానంబున నీవు నన్నాజ్ఞాపించెదవేనిం బ్రమత్తుండవైన నీకుం బూర్వస్వభావం బెట్లుండె; నట్లుగాక యేనేమి చేయుదు? నెఱింగింపు; మున్మత్త మూకాంధ జడులు బోలె సహజస్వభావంబునుం బొందిన నాయందు నీ శిక్ష యేమి లాభంబుఁ బొందింప నేర్చు. నదియునుం గాక స్తబ్దుండు మత్తుండు నైన నాకు నీ శిక్ష వ్యర్థంబగు"నని పలికి యుపశమశీలుండైన మునివరుండు పూర్వకర్మశేషంబున గల్గు భారవాహకత్వంబుం దలంగం ద్రోయుటకు భారంబు వహించి శిబిక మోచుచుం జనునెడ నా రాజవల్లభుండు దత్త్వజ్ఞానాపేక్షితుండై చనియెడి వాఁడగుటం దన హృదయ గ్రంథి విమోచకంబులును బహు యోగగ్రంథ సమ్మతంబులును నగు బ్రాహ్మణవాక్యంబులు విని యా శిబిక దిగ్గన డిగ్గనుఱికి యావిప్రునికి సాష్టాంగదండప్రణామంబు లాచరించి సర్వ గర్వవర్జితుండై ముకుళిత హస్తుం డగుచు ని ట్లనియె.

టీకా:

నరేంద్రా = రాజా; నీవున్ = నీవు; చెప్పునది = చెప్పెడిది; సత్యంబున్ = నిజమే; భారంబు = బరువు; ఈ = ఈ; శరీరంబునకే = దేహమునకు మాత్రమే; కాని = కాని; నా = నా; కున్ = కు; కలుగన్ = కలుగుటకు; నేరదు = సాధ్యము కాదు; = ఐననున్ = అయినప్పటికిని; స్థౌల్య = బలముగా ఉండుట; కార్శ్యంబులు = కృశించి ఉండుట; వ్యాధులున్ = జబ్బులు; ఆధులు = మానసిక బాధలు; క్షుత్ = ఆకలి; తృష్ణలున్ = దప్పులు, దాహములు; ఇచ్ఛా = ఇష్టములు; విరోధ = అయిష్టములు; భయంబులున్ = భయములు; జరా = ముసలితనము; మరణంబులు = చావులు; రోష = పౌరుషము; నిద్ర = నిద్రించుట; జాగరణంబులున్ = మెలకువగా ఉండుటలు; అహంకార = నే ననెడి భావము; మమకార = నా దనెడి భావము; మద = మదము; శోషణ = క్షీణించుట; ఆదులు = మొదలగునవి; దేహంబు = శరీరము; తోడన = తోటే; జనియించున్ = పుట్టును; కాని = కాని; నా = నా; కున్ = కు; కలుగన్ = కలుగుటకు; నేరవు = సమర్థములు గావు; జీవన్మృతుండను = జీవచ్ఛవమును; నేన = నేనే; కాదు = కాదు; ఆది = పుట్టుట; అంతంబులు = గిట్టుటలు; కలుగుటన్ = కలుగుట; చేసి = వలన; అందఱ = అందరి; అందునున్ = ఎడలను; కలిగి = కలిగే; ఉండున్ = ఉండును; స్వామి = యజమాని; భృత్య = సేవక; సంబంధంబులు = సంబంధములు; విధి = కర్మలవలన; కృతంబులు = జరుగునవి; అగుచున్ = అగుచు; వ్యవహారంబులన్ = లౌకికవ్యవహారములు; చేసి = వలన; శరీరంబులకున్ = దేహముల; కున్ = కు; కలుగున్ = కలుగును; కాని = కాని; జీవున్ = జీవుని; కిన్ = కి; లేక = లేకుండగా; ఉండును = ఉండును; అదియునున్ = అంతే; కాక = కాకుండగా; రాజ = రాజుననే; అభిమానంబునన్ = అహంకారముచేత; నీవున్ = నీవు; నన్ = నన్ను; ఆజ్ఞాపించెదవు = శిక్షించెదవు; ఏనిన్ = అయినచో; ప్రమత్తుండవు = మిక్కిలి మద మెక్కిన వాడవు; ఐన = అయిన; నీకున్ = నీకు; పూర్వ = తొలి; స్వభావంబు = స్వభావము; ఎట్లు = ఏ విధముగా; ఉండెన్ = ఉందో; అట్లు = ఆ విధముగా; కాక = కాకుండగా; ఏను = నేను; ఏమి = ఏమి; చేయుదున్ = చేయగలను; ఎఱింగింపుము = తెలుపుము; ఉన్మత్త = పిచ్చివారు; మూక = మూగవారు; అంధ = గుడ్డివారు; జడులు = తెలివిలేనివారు; సహజ = సహజమైన; స్వభావంబునున్ = స్వాభావమును; పొందినన్ = పొందినట్టి; నా = నా; అందున్ = అందు; నీ = నీ; శిక్ష = శిక్ష; ఏమి = ఏమి; లాభంబున్ = ప్రయోజనమును; పొందింపన్ = కలిగించ; నేర్చును = కలుగును; అదియునున్ = అంతే; కాక = కాకుండగా; స్తబ్దుండు = స్పందనలు లేనివాడు; మత్తుండు = దేహముపైన నిర్లక్ష్యము గలవాడు; ఐన = అయిన; నా = నా; కున్ = కు; నీ = నీ యొక్క; శిక్ష = శిక్ష; వ్యర్థంబు = ప్రయోజనము లేనిది; అగున్ = అగును; అని = అని; పలికి = పలికి; ఉపశమ = శాంతించిన; శీలుండు = స్వభావము గలవాడు; ఐన = అయిన; ముని = మునులలో; వరుండున్ = శ్రేష్ఠుడు; పూర్వ = పూర్వకాలపు; కర్మ = కర్మల యొక్క; శేషంబునన్ = మిగిలినవానివలన; కల్గు = కలిగిన; భార = బరువును; వాహకత్వంబున్ = మోయవలసిన స్థితిని; తలగంద్రోయుటకున్ = తొలగించుకొనుటకు; భారంబున్ = బరువుగా; వహించి = స్వీకరించి; శిబికన్ = పల్లకిని; మోచుచున్ = మోయుచూ; చను = వెళ్ళెడి; ఎడన్ = సమయములో; ఆ = ఆ; రాజ = రాజులలో; వల్లభుండు = శ్రేష్ఠుడు; తత్త్వజ్ఞాన = తత్త్వజ్ఞానమును; ఆపేక్షితుండు = కోరెడివాడి; ఐ = అయ్యి; చనియెడి = వెళ్ళెడి; వాడు = వాడు; అగుటన్ = అగుటవలన; తన = తన యొక్క; హృదయ = హృదయము యనెడి; గ్రంథి = ముడినుండి; విమోచకంబులును = విడిపించునవి; బహు = అనేక; యోగ = యోగశాస్త్రముల; గ్రంథ = గ్రంథము లందలి విషయములకు; సమ్మతంబులున్ = అంగీకార యోగ్యములు; అగు = అయిన; బ్రాహ్మణ = విప్రుని; వాక్యంబులు = మాటలు; విని = విని; ఆ = ఆ; శిబికన్ = పల్లకిని; దిగ్గన = తటాలున; డిగ్గన్ = దిగుటకు; ఉఱికి = దుమికి; ఆ = ఆ; విప్రున్ = బ్రాహ్మణుని; కిన్ = కి; సాష్టాంగదండప్రణామంబులు = సాష్టాంగదండప్రణామములు {సాష్టాంగ దండప్రణామము - స (కూడిన) అష్ట (ఎనిమిది (శిరస్సు కన్నులు చెవులు ముక్కు గడ్డము వక్షము చేతులు కాళ్ళు)) అంగ (అవయవము)లతో దండ (కఱ్ఱవలె పడుకొని చేసెడి) ప్రణామములు (నమస్కారములు)}; ఆచరించి = చేసి; సర్వ = పూర్తిగా; గర్వ = గర్వములను; వర్జితుండు = విడిచినవాడు; ఐ = అయ్యి; ముకుళిత = ముకుళించిన; హస్తుండు = చేతులు గలవాడు; అగుచున్ = అగుచు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

“రాజా! నీవు చెప్పింది నిజం. బరువు శరీరానికే కాని నాకు కాదు. మానవుడు బలిసి పోవడం, చిక్కిపోవడం, శరీరానికి మనస్సుకు సంబంధించిన జబ్బులు, ఆకలి దప్పులు, ఇష్టపడడం, ద్వేషించడం, భయపడడం, వార్ధక్యం, మరణం, రోషం, నిద్ర, మెలకువ, అహంకార మమకారాలు, మదమాత్సర్యాలు దేహంతో పుడతాయి. కాని నాకు అవి లేవు. నేనే కాదు జనన మరణాలు కలిగి ఉన్న వారందరూ జీవన్మృతులే. యజమాని, సేవకుడు అనే సంబంధం కర్మ వల్ల కలుగుతుంది. కనుక అది శరీరానికే కాని జీవునకు సంబంధించింది కాదు. రాజు ననే అభిమానంతో నీవు నన్ను ఆజ్ఞాపించావు. అంటే నీవు మదోన్మత్తుడవై ఉన్నావన్న మాట! అది నీ వెనుకటి స్వభావం కాని మరేమీ కాదు. అందుకు నేనేం చేయగలను? చెప్పు. పిచ్చివాడు, మూగవాడు, గ్రుడ్డివాడు, తెలివి లేనివాడు ఎంతో నేనుకూడా అంతే. అందుచేత నన్ను శిక్షించడంలో నీకు కలిగే లాభం లేదు. అంతే కాకుండా జడుడను, మత్తుడను అయిన నాకు శిక్ష విధిస్తే నీ శ్రమ వ్యర్థం” అని పలికి శాంత స్వభావుడైన ఆ భరతుడు పూర్వ కర్మఫలాన్ని అనుభవించక తప్పదనే భావంతో దండె వదలిపెట్టకుండా ఎప్పటిలాగే పల్లికిని మోయసాగాడు. శాస్త్ర సమ్మతాలైన బ్రాహ్మణుని మాటలను రాజు విన్నాడు. ఆ మాటలు తత్త్వజ్ఞానాపేక్షతో పోతున్న ఆ రాజు హృదయానికి సూటిగా తగిలాయి. అతనిలోని అహంకారం తొలగింధి. ఆ రాజు వెంటనే పల్లకి దిగాడు. బ్రాహ్మణునికి సాష్టాంగ దండ ప్రణామం చేసాడు. వినయ వినమ్రుడై చేతులు జోడించి ఇలా అన్నాడు.