పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : విప్రసుతుండై జన్మించుట

  •  
  •  
  •  

5.1-122-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు బ్రాహ్మణకుమారుండు గర్మంబుల యందు నిచ్చలేక యుండియును బితృనియోగ నిర్బంధంబునం బితృసన్నిధి యందు యసమీచీనంబుగా వ్యాహృతిప్రణవ శిరస్సహితం బగునట్లు గాయత్రీమంత్రంబు జపియించుచుఁ జైత్రాది చతుర్మాసంబుల సమవేతంబుగ వేదంబుల నధ్యయనంబు చేయుచుండె; జనకుం డాత్మజుని శిష్టాచారంబుచే శిక్షింపవలయునను లోకాచారంబు ననువర్తించి యాత్మభూతుండగు నాత్మజునందు నభినివేశిత చిత్తుండగుచు శౌచాచమనాధ్యయన వ్రత నియమగుర్వనల శుశ్రూషణాదికంబు లనభియుక్తంబు లయినం బుత్రునిచే నొనరింపించుచు నప్రాప్తమనోరథుం డయ్యె; నంత.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; బ్రాహ్మణ = బ్రాహ్మణుని; కుమారుండు = పుత్రుడు; కర్మముల్ = కర్మల; అందున్ = లో; ఇచ్చ = ఇష్టము; లేక = లేకుండా; ఉండియున్ = ఉన్నప్పటికిని; పితృ = తండ్రిచేత; నియోగ = నియమించుటవలని; నిర్బంధంబునన్ = తప్పనిసరిగా; పితృ = తండ్రి; సన్నధి = సమీపము; అందె = అందునే; అసమీచీనంబుగా = అసత్యముగా; వ్యాహృతి = వ్యాహృతులు {వ్యాహృతులు - 1భూః 2భువః 3సువః అనెడి మంత్రములు}; ప్రణవ = ఓంకారము యనెడి; శిరః = శిరస్సుగా; సహితంబున్ = కలిగి ఉండునవి; అగునట్లు = అగు విధముగా; గాయత్రీమంత్రంబున్ = గాయత్రీమంత్రమును; జపియించుచున్ = జపించుతూ; చైత్ర = చైత్రమాసము; ఆది = మొదలగు; చాతుర్మాసంబులన్ = నాలుగు నెలలను; సమవేతంబుగా = ఇతరులతో కూడి; వేదంబులన్ = వేదములను; అధ్యయనంబున్ = అధ్యయనము; చేయుచుండెన్ = చేస్తుండెను; జనకుండు = తండ్రి; ఆత్మజునిన్ = పుత్రుని; శిష్ట = మంచివారి యొక్క; ఆచారంబున్ = పద్ధతుల; చేన్ = చేత; శిక్షింపవలయును = నేర్పవలెను; అను = అనెడి; లోకాచారంబున్ = సామాన్య ధర్మమును; అనుసరించి = ప్రకారము; ఆత్మభూతుండు = తానే ఐనవాడు; అగు = అయిన; ఆత్మజున్ = పుత్రుని; అందున్ = ఎడల; అభినివేశిత = పట్టుదల కలగిన; చిత్తుండు = మనసు గలవాడు; అగుచున్ = అగుచూ; శౌచ = శుచికైనస్నానము; ఆచమన = ఆచమనము; అధ్యయన = వేదాధ్యయనము; వ్రత = దీక్షలు పట్టుట; నియమ = నియమములు పాటించుట; గురు = గురువులను; అనల = అగ్నిహోత్రము; శుశ్రూషణ = సేవించుట; ఆదికంబులు = మొదలగువానిని; అనభియుక్తంబులు = వాదింపబడనివి; అయినన్ = అయినప్పటికిని; పుత్రుని = కుమారుని; చేన్ = చేత; ఒనరింపించుచున్ = ఆచరింప జేయుచు; అప్రాప్త = ఫలించని; మనోరథుండు = ప్రయత్నము గలవాడు; అయ్యెన్ = అయ్యెను; అంత = అంతట;

భావము:

ఈ విధంగా బ్రాహ్మణ కుమారుడైన భరతునికి కర్మలంటే ఆసక్తి లేకపోయినా, బోధించేవాడు తండ్రి కనుక వాటిని పాటించడం తప్పనిసరి అయింది. తండ్రి దగ్గర ప్రణవం, వ్యాహృతులతో కూడిన గాయత్రి మంత్రోపదేశం పొందాడు. ప్రతి సంవత్సరం తప్పకుండా చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాలలో ఇతరులతో కలిసి వేదాధ్యయనం చేసాడు. తండ్రి కుమారునకు శిష్టాచారం నేర్పాలనే లోకాచారం మేరకు తన కుమారుడైన భరతునికి అతని తండ్రి శౌచవిధి, ఆచమనవిధి, అధ్యయనవిధి, వ్రతవిధి మొదలైన నియమాలను, అగ్ని ఆరాధనం, గురు శుశ్రూష వంటి సత్కార్యాలను నేర్పాడు. అయినా కుమారునికి వాటిపట్ల అభినివేశం లేకుండటం గుర్తించి తన ప్రయత్నం యావత్తూ వ్యర్థమయిందని, తన కోరిక నెరవేరలేదని నిరాశ పడ్డాడు. అప్పుడు…