పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : హరిణీగర్భంబున జనించుట

  •  
  •  
  •  

5.1-118-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు శ్రీహరి శ్రవణ మనన సంకీర్తనారాధనానుసరణాభియోగంబులం జేసి యశూన్య సకలయామంబగు కాలంబు గల నాకు హరిణపోతస్మరణంబు కతంబున యోగవిఘ్నంబు ప్రాప్తంబయ్యె; మోక్షదూరుండ నైతి" నని నిగూఢ నిర్వేదుం డగుచుఁ దల్లిం బాసి క్రమ్మఱ నుపశమశీల మునిగణ సేవితంబయి భగవత్క్షేత్రంబైన సాలతరునిబిడతమ గ్రామ సమీప పులస్త్య పులహాశ్రమంబులకుం గాలాంజన పర్వతంబు వలనఁ జనుదెంచి యందు మృగ దేహత్యాగావసానంబు గోరుచు సంగంబు విడిచి యేకాకి యగుచు శుష్క పర్ణ తృణవీరు దాహారుఁడై మృగత్వ నిమిత్తం బగు నా నదీతీర్థంబునందు నవసానంబు గోరుచుఁ దత్తీర్థోదకక్లిన్నం బగుచు నుండు శరీరంబు విడిచె" నని శుకయోగీంద్రుండు పరీక్షిన్నరేంద్రునకు వినిపించి మఱియు నిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; శ్రీహరి = నారాయణుని; శ్రవణ = కథలు వినుట; మనన = నామ జపము చేయుట; సంకీర్తన = సామూహికముగ స్తోత్రములు చదువుట; ఆరాధన = పూజించుట; అనుసరణ = అనుసరించుట; అభియోగ = మిక్కిలి యోగాభ్యాసము చేయుట; చేసి = వలన; అశూన్య = వ్యర్థము కాని; సకల = సమస్త; యామంబు = పొద్దులు గలది; అగు = అయిన; కాలంబు = కాలము; కల = కలిగిన; నాకు = నాకు; హరిణ = లేడి; పోత = పిల్లని; స్మరణంబు = స్మరించుట యనెడి; కతంబునన్ = కారణమువలన; యోగ = యోగసాధనకు; విఘ్నంబు = అంతరాయము; ప్రాప్తంబు = కలిగినది; అయ్యెన్ = అయ్యెను; మోక్ష = మోక్షమునకు; దూరుండను = దూరమైనవాడను; ఐతిన్ = అయిపోయాను; అని = అని; నిగూఢ = లోలోపల; నిర్వేదుండు = నిస్పృహ చెందినవాడు; అగుచున్ = అగుచూ; తల్లిన్ = తల్లిని; పాసి = విడిచిపెట్టి; క్రమ్మఱన్ = మరల; ఉపశమ = శాంత; శీల = స్వభావము కలిగిన; ముని = మునుల యొక్క; గణ = సమూహములచే; సేవితంబున్ = సేవింపబడునది; అయి = అయ్యి; భగవత్ = భగవంతుని యొక్క; క్షేత్రము = ప్రదేశము; ఐన = అయినట్టి; సాల = మద్ది; తరు = చెట్లతో; నిబిడతమ = మిక్కిలి దట్టమైన {నిబిడము - నిబిడతరము - నిబిడతమము}; గ్రామ = ఊరుకి, సమూహమునకు; సమీప = దగ్గరగా ఉన్న; పులస్త్య = పులస్త్యుని; పులహ = పులహుని; ఆశ్రమంబుల్ = ఆశ్రమముల; కున్ = కు; కాలాంజన = కాలాంజనము యనెడి {కాలాంజనము - కాలము అనెడి అంజనము (చక్కటి దృష్టికి తోడ్పడునది)}; పర్వతంబు = పర్వతము; వలన = తిరిగి; చనుదెంచి = వచ్చి; అందున్ = వానిలో; మృగ = లేడి యొక్క; దేహ = శరీరమును; త్యాగ = విడుచుటకు; అవసానంబున్ = మరణకాలము; కోరుచు = కోరుకొనుచు; సంగంబున్ = సాంగత్యములను; విడిచి = విడిచిపెట్టి; ఏకాకి = ఒంటరి; అగుచున్ = అగుచూ; శుష్కపర్ణ = ఎండుటాకులు; తృణ = గడ్డిపరకలు; విరుత్ = లతల పొదలు; ఆహారుండు = ఆహారముగా గలవాడు; ఐ = అయ్యి; మృగత్వ = లేడిగా ఉన్న; నిమిత్తంబున్ = కొరకైనది; అగు = అయిన; ఆ = ఆ; నదీ = నది యొక్క; తీరంబున్ = ఒడ్డు; అందున్ = అందు; అవసానంబున్ = చివరి దినములు గడపుటను; కోరుచు = కోరుకొనుచు; తత్ = ఆ; తీర్థ = తీర్థము నందలి; ఉదక = నీటితో; క్లిన్నంబు = తడసినది; అగుచునుండు = అగుచూ ఉండెడి; శరీరంబున్ = దేహమును; విడిచెన్ = విడిచిపెట్టెను; అని = అని; శుక = శుకుడు అనెడు; యోగి = యోగులలో; ఇంద్రుడు = ఇంద్రునివంటివాడు; పరీక్షిత్ = పరీక్షిత్తు యనెడి; నరేంద్రున్ = రాజున; కున్ = కు; వినిపించి = చెప్పి; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

ఈ విధంగా హరికథలను వినడం, హరిని తలచుకొనడం, హరిని కీర్తించడం, హరి పూజ చేయడం, హరి భక్తులను అనుసరించడం మొదలైన సత్కర్మలలో క్షణం తీరిక లేని నాకు జింకపిల్ల వల్ల విఘ్నం కలిగింది. మోక్షానికి దూరమయ్యాను” అని లోలోన బాధపడి, తల్లియైన జింకను వదలి, కాలాంజన పర్వతాన్ని విడిచి దట్టమైన సాల వృక్షాలచేత నిండిన సాలగ్రామ సమీపంలో ఉన్న పులస్త్య పులహాశ్రమాలకి చేరుకున్నాడు. ఆ ఆశ్రమాలలో శాంత స్వభావులైన మునులున్నారు. అది ఒక భగవత్ క్షేత్రం. అక్కడికి వచ్చి తన హరిణ దేహాన్ని వదలిపెట్టడానికి తగిన సమయం కోసం ఎదురు చూడసాగాడు. ఎవరితోను సంబంధం లేకుండా ఒంటరిగా ఉంటూ ఎండిన ఆకులు, గడ్డిపరకలు, తీగదుబ్బులు తింటూ తన జింక జన్మకు కారణమైన ఆ నదీ తీర్థంలోనే బ్రతుకు ముగించాలని కోరుతూ గడిపి చివరకు శరీరాన్ని విడిచాడు” అని శుకమహర్షి పరీక్షిత్తుకు చెప్పి ఇంకా ఇలా అన్నాడు.