పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : భరతుండు వనంబుఁ జనుట

  •  
  •  
  •  

5.1-99-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దానం జేసి విగత విషయాభిలాషుండై శమదమాది గుణంబులు గలిగి యథేచ్ఛంజేసి యెడతెగక పరమపురుషుని పరిచర్యా భక్తిభరంబున శిథిలీకృత హృదయగ్రంథిఁ గలిగి సంతోషాతిశయంబునం బులకితాంగుండు, నానంద బాష్పనిరుద్ధావలోక నయనుండు నగుచు నిజస్వామి యైన హరిచరణారవిందానుధ్యాన పరిచిత భక్తియోగంబునం బరమానంద గంభీర హృదయంబను నమృతహ్రదంబున నిమగ్నుం డగుచుఁ దానపుడు పూజించు పూజ నెఱుంగక యిట్లు భగవద్వ్రతంబు ధరియించి యేణాజిన వాసస్త్రిషవణ స్నానంబుల నార్ద్రకుటిల కపిశ వర్ణ జటాకలాపంబులు గలిగి మార్తాండాంతర్గతుం డయిన పరమేశ్వరుని హిరణ్మయ పురుషునింగాఁ దలంచుచు నిట్లనియె.

టీకా:

దానన్ = దాని; చేసి = వలన; విగత = నశించిన; విషయ = ఇంద్రియార్థము లందు; అభిలాషుండు = ఆసక్తి గలవాడు; ఐ = అయ్యి; శమ = శాంతి {శమము - కామక్రోధాది లేక ఉండుట, శాంతి}; దమ = ఇంద్రియనిగ్రహము, ఓర్పు; ఆది = మొదలగు; గుణంబులున్ = సుగుణములు; కలిగి = కలిగి; యథేచ్చ = ఇష్టానుసారము; చేసి = వలన; ఎడతెగక = వ్యవధానము లేకుండ; పరమపురుషుని = నారాయణుని; పరిచర్యా = సేవించుట; భక్తిన్ = పూజించుటవలని; భరంబునన్ = భారముతో; శిథలీ = విప్పివేయుట; కృత = చేయబడిన; హృదయ = హృదయ మనెడి; గ్రంథి = ముడి; కలిగి = కలిగి; సంతోష = సంతోషము; అతిశయంబునన్ = అధిక మగుటచేత; పులకిత = పులకరించిన; అంగుండున్ = దేహము గలవాడు; ఆనంద = ఆనందము యొక్క; బాష్ప = బాష్పముల వలన; నిరుద్ధ = అడ్డుపడుతున్న; అవలోకన = చూపు గల; నయనుండున్ = కన్నులు గలవాడు; అగుచున్ = అగుచు; నిజ = తన యొక్క; స్వామి = ప్రభువు; ఐన = అయినట్టి; హరి = నారాయణుని; చరణ = పాదములు యనెడి; అరవింద = పద్మములను; అనుధ్యాన = మిక్కిలి ధ్యానించుటచే; పరిచిత = అలవాటైన; భక్తియోగంబునన్ = భక్తియోగమువలన; పరమానంద = పరమానందము కలిగినది; గంభీర = గంభీరమైనది యైన; హృదయంబు = హృదయము; అను = అనెడి; అమృత = అమృతపు; హ్రదంబునన్ = సరస్సులో; నిమగ్నుండు = నిండామునిగినవాడు; అగుచున్ = అగుచూ; తాన్ = తాను; అపుడున్ = అప్పుడు; పూజించు = పూజించెడి; పూజన్ = పూజను; ఎఱుంగక = తెలియక; ఇట్లు = ఈ విధముగ; భగవత్ = భగవంతుని యెడ; వ్రతంబున్ = నిష్ఠను; ధరియించి = పూని; ఏణ = లేడి; అజిన = చర్మపు; వాసత్ = వస్త్రము; త్రిషవణస్నానంబులన్ = త్రిషవణస్నానములతో {త్రిషవణస్నానములు – ముప్పొద్దుల చేయు స్నానములు, మూడు సవనముల ముందు చేయు స్నానములు}; ఆర్ద్ర = తడసి; కుటిల = ఉంగరాలు తిరిగిన; కపిశ = కందు, పసుపు కలసిన యెరుపు; వర్ణ = రంగు గల; జటా = జటల; కలాపంబులున్ = చుట్టలు; కలిగి = కలిగి; మార్తాండ = సూర్యమండలము; అంతర్గతుండు = లోపల ఉన్నవాడు; అయిన = అయిన; పరమేశ్వరుని = భగవంతుని; హిరణ్ = బంగారముతో, కిరణములతో; మయ = నిండిన; పురుషునిన్ = పురుషునిగా; తలంచుచున్ = భావించుతూ; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

అటువంటి హరిసేవ వల్ల అతనికి విషయవాంఛలు నశించాయి. శమ దమాది గుణసంపద అలవడింది. పరమపురుషుణ్ణి భక్తి భావంతో ఎడతెగకుండా భజిస్తుంటే అహంకారమనే ముడి విడిపోయి ఆనందానుభూతి కలిగింది. అతని మేను పులకించింది. కన్నులలో ఆనందాశ్రువులు పొంగిపొరలాయి. ఇష్టదైవమైన శ్రీహరి పాదపద్మాలను ధ్యానించడం వల్ల ప్రాప్తమైన భక్తియోగం కారణంగా అతని హృదయం పరమానందంతో నిండింది. ఆ ఆనందానుభవం అమృత సరోవరంలో అవగాహన చేసినట్లుగా అనిపించింది. ఆ అనుభూతితో భరతునికి తాను చేస్తున్న పూజకూడా తెలియనంత తన్మయత్వం కలిగించింది. ఈ విధంగా భగవంతుని సేవావ్రతంలో మునిగిపోయిన భరతుడు జింక చర్మం ధరించాడు. మంత్ర పూర్వకంగా మూడు వేళలా స్నానం ఆచరించాడు. నిత్యం స్నానం చేయడం వల్ల తల వెంట్రుకలు తడిసి వంపులు తిరిగి జడలు కట్టి రాగి రంగుతో మెరువసాగాయి. సూర్యమండల మధ్యవర్తి అయిన పరమేశ్వరుణ్ణి హిరణ్మయ పురుషునిగా భావిస్తూ భరతుడు ఇలా అన్నాడు.