పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : భరతుండు వనంబుఁ జనుట

  •  
  •  
  •  

5.1-97-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు నా భరతుండు శ్రీవత్స కౌస్తుభ వనమాలాలంకృతుండును, సుదర్శనాద్యాయుధోపలక్షితుండును, నిజభక్తజనహృదయారవింద నివాసుండును, బరమపురుషుండును నైన వాసుదేవుని యందు నధికభక్తి ననుదినంబును జేయుచుఁ నేఁబదిలక్షలవేలేండ్లు రాజ్యంబు చేసి పితృ పితామహాద్యాయాతంబగు నా ధనంబును యథార్హంబుగఁ బుత్రులకుఁ బంచియిచ్చి బహువిధ సంపదలుగల గృహంబును బాసి పులహాశ్రమంబున కరిగె; నంత.

టీకా:

మఱియున్ = ఇంకను; ఆ = ఆ; భరతుండు = భరతుడు; శ్రీవత్స = శ్రీవత్స మనెడు పుట్టుమచ్చ; కౌస్తుభ = కౌస్తుభమణి; వనమాల = వనమాలలచే; అలంకృతుండును = అలంకరింపబడినవాడు; సుదర్శన = సుదర్శన చక్రము; ఆది = మొదలగు; ఆయుధ = ఆయుధములతో; ఉపలక్షితుండును = దర్శింపబడువాడు; నిజ = తన; భక్త = భక్తులైన; జన = వారి; హృదయ = హృదయము లనెడి; అరవింద = పద్మములందు; నివాసుండును = నివసించెడివాడు; పరమపురుషుడు = పరమపురుషుడు; ఐన = అయినట్టి; వాసుదేవుని = నారాయణుని {వాసుదేవుడు - వసించెడి (స్థితికి) దేవుడు, విష్ణువు}; అందున్ = ఎడల; అధిక = అధికమైన; భక్తిన్ = సేవించుటను; అనుదినంబున్ = ప్రతిదినమును; చేయుచున్ = ఆచరించుతూ; ఏబదిలక్షల = ఏభైలక్షల (50, 00, 000); వేలేండ్లు = దివ్యసంవత్సరములు; రాజ్యంబున్ = రాజ్యమును; చేసి = పాలించి; పితృపితామహాది = వంశపారంపర్యముగా {పితృపితామహాది - తండ్రి తాత మొదలగు వారినుండి వచ్చెడివి, వంశపారంపర్యము}; ఆయతంబున్ = వచ్చినది; అగున్ = అయిన; ఆ = ఆ; ధనంబునున్ = సంపదలను; యథా = తగిన; అర్హంబుగన్ = అర్హతల ప్రకారముగ; పుత్రుల్ = కుమారుల; కున్ = కి; పంచియిచ్చి = పంచేసి; బహు = అనేక; విధ = విధములైన; సంపదలు = సంపదలు; కల = ఉన్నట్టి; గృహంబునున్ = ఇంటిని; పాసి = విడిచి; పులహ = పులహుని; ఆశ్రమంబున్ = ఆశ్రమమున; కున్ = కు; అరిగెన్ = వెళ్లెను; అంత = అప్పుడు.

భావము:

ఇంకా శ్రీవత్సం, కౌస్తుభం, వనమాలల చేత అలంకరింపబడిన వాడు; సుదర్శనం మొదలైన ఆయుధాలను ధరించేవాడు, తన భక్తుల హృదయ పద్మాలలో నివసించేవాడు, పరమ పురుషుడు అయిన వాసుదేవుని పట్ల ఆ భరతుడు ఎల్లప్పుడు భక్తి ప్రపత్తులు కలిగి యాభై లక్షల వేల సంవత్సరాలు రాజ్యపరిపాలన సాగించాడు. తాత తండ్రుల కాలంనుండి తరతరాలుగా సంక్రమించిన ధనరాశిని తగినట్లు తన కుమారులకు పంచి ఇచ్చి అపార సంపదలు గల రాజసౌధాన్ని వదలిపెట్టి పులహాశ్రమానికి వెళ్ళిపోయాడు. అప్పుడు…