పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : భరతుండు వనంబుఁ జనుట

  •  
  •  
  •  

5.1-101-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత నా భరతుం డొక్కనాఁ డా మహానదిం గృతాభిషేకుండయి ముహూర్తత్రయం బంతర్జలంబులందుఁ బ్రణవోచ్ఛారణంబు చేయుచుండు సమయంబున, నిర్భరగర్భిణియగు నొక్క హరిణి జలార్థినియై యొంటి జలాశయ సమీపంబునకు వచ్చి, జలపానంబు చేయు నెడ నా సమీపంబున మృగపతి గర్జించి లోకభయంకరంబుగ నాదంబు సేయ నా హరిణి స్వభావంబున భీత యగుటం జేసి బెగ్గడిలి హరి విలోకనవ్యాకుల చిత్తయై దిగ్గన నదిరి గగనంబునకు నెగిరి; యపగత తృష యగుచు నది నుల్లంఘించు నెడ నధిక భయంబునం జేసి యా గర్భంబు యోని ద్వారంబున గళితంబై జలంబులం బడియె; నా హరిణి యుల్లంఘనాది భయంబునం జేసి తత్తీరీరంబున నుండు గిరిదరిం బడి శరీరంబుఁ బాసె; నంత నా హరిణపోతంబు జలంబులం దేలుచున్న భరతుండు గను విచ్చి చూచి కరుణార్ద్ర చిత్తుండై మృతజనని యగు నా హరిణపోతంబును దన యాశ్రమంబునకుం గొంపోయి మిక్కిలి ప్రీతిం జేసి యుపలాలనంబు చేయుచుండఁ బోషణ పాలన ప్రీణన లాలనాను ధ్యానంబుల భరతునకు నాత్మనియమంబు లైన యష్టాంగయోగంబులును బరమపురుష పూజా పరిచర్యాదులు నొక్కొక్కటిగఁ గ్రమక్రమంబునం గొన్ని దినంబులకు సమస్తంబును నుత్సన్నం బయ్యె; నంత.

టీకా:

అంతన్ = అంతట; ఆ = ఆ; భరతుండు = భరతుడు; ఒక్క = ఒక; నాడు = దినమున; ఆ = ఆ; మహా = గొప్ప; నదిన్ = నదిలో; కృత = చేసిన; అభిషేకుండు = స్నానము చేసినవాడు; అయి = అయ్యి; ముహూర్త = ముహూర్తములు {ముహూర్తము - అల్పకాలము, అరగంట}; త్రయంబున్ = మూటి సమయము; అంతర్ = లోపలి, లోతున్న; జలంబులన్ = నీటి; అందున్ = అందు; ప్రణవ = ఓంకారము; ఉచ్ఛారణంబున్ = ఉచ్చరించుట; చేయుచున్ = చేయుచూ; ఉండు = ఉండెడి; సమయంబునన్ = సమయము నందు; నిర్భర = నిండు; గర్భిణి = గర్భిణి; అగు = అయినట్టి; ఒక్క = ఒక; హరిణి = ఆడులేడి; జల = నీటిని; అర్థిని = కోరునది; ఐ = అయ్యి; ఒంటిన్ = ఒంటరిగా; జలాశయ = నీటికొలను; సమీపంబున్ = దగ్గర; కున్ = కు; వచ్చి = వచ్చి; జల = నీటిని; పానంబుచేయు = తాగెడి; ఎడన్ = సమయములో; ఆ = ఆ; సమీపంబునన్ = దగ్గరలోని; మృగపతి = సింహము; గర్జించి = గర్జించి; లోక = మిక్కిలి; భయంకరంబుగన్ = భయంకరముగ; నాదంబున్ = శబ్దము; చేయన్ = చేయగా; ఆ = ఆ; హరిణి = లేడి; స్వభావంబునన్ = స్వభావము రీత్యా; భీత = భయపడునది; అగుటన్ = అగుట; చేసి = వలన; బెగ్గడిల్లి = భయపడి; హరి = సింహమును; విలోకన = చూసిన; వ్యాకుల్ = వికలమైన, చీకాకు చెందిన; చిత్త = మనసు గలది; ఐ = అయ్యి; దిగ్గన = తటాలున; అదిరి = ఉలికిపడి; గగనంబున్ = ఆకాశమున; కున్ = కు; ఎగిరి = గెంతి; అపగత = తీరని; తృష = దాహము గలది; అగుచున్ = అగుచు; నదిన్ = నదిని; ఉల్లంఘించు = దాటెడి; ఎడన్ = సమయములో; అధిక = అధికమైన; భయంబునన్ = భయము; చేసి = వలన; ఆ = ఆ; గర్భంబున్ = గర్భము; యోని = యోని; ద్వారంబునన్ = ద్వారా; గళితంబు = జారినది; ఐ = అయ్యి; జలంబులన్ = నీటిలో; పడియెన్ = పడిపోయెను; ఆ = ఆ; హరిణి = లేడి; ఉల్లంఘన = దాటుట; ఆది = మొదలైన; భయంబునన్ = భయముల; చేసి = వలన; తత్ = ఆ; తీరంబునన్ = ఒడ్డున; ఉండు = ఉండెడి; గిరి = కొండ; దరిన్ = పక్కన; పడి = పడిపోయి; శరీరంబున్ = దేహమును; పాసెన్ = విడిచెను; అంతన్ = అంతట; ఆ = ఆ; హరిణ = లేడి; పోతంబున్ = పిల్ల; జలంబులన్ = నీటిలో; తేలుచున్న = తేలుతుండగా; భరతుండు = భరతుడు; కనువిచ్చి = కళ్ళువిప్పి; చూచి = చూసి; కరుణా = దయతో; అర్ద్ర = ఆర్ద్రమైన; చిత్తుండు = మనసు గలవాడు; ఐ = అయ్యి; మృత = మరణించిన; జనని = తల్లిగలది; అగు = అయినట్టి; ఆ = ఆ; హరిణ = లేడి; పోతంబున్ = పిల్లని; తన = తన యొక్క; ఆశ్రమంబున్ = ఆశ్రమమున; కున్ = కు; కొంపోయి = తీసుకువెళ్లి; మిక్కిలి = అధికమైన; ప్రీతిన్ = ప్రేమ; చేసి = కలిగి; ఉపలాలనంబు = బుజ్జగింపు; చేయుచుండన్ = చేయుచుండగా; పోషణ = పోషించుట; పాలన = రక్షించుట; ప్రీణన = తృప్తిపరచుట; లాలన = లాలించుట; అనుధ్యానంబులన్ = దానినే స్మరించుటలవలన; భరతున్ = భరతుని; కున్ = కి; ఆత్మ = స్వంతముగా ఏర్పరచుకొన్న; నియమంబులు = నియమములు; ఐన = అయినట్టి; అష్టాంగయోగంబులునున్ = అష్టాంగయోగములు {అష్టాంగ యోగములు - యోగమునకైన ఎనిమిది విధములు, 1యమము 2నియమము 3ఆసనము 4ప్రాణాయామము 5ప్రత్యాహారము 6ధారణ 7ధ్యానము 8సమాధి}; పరమపురుష = భగవంతుని; పూజ = పూజించుట; పరిచర్య = సేవించుట; ఆదులు = మొదలైనవి; ఒక్కొక్కటిన్ = ఒకటొకటే; క్రమక్రమంబునన్ = వరుసగా; కొన్ని = కొన్ని; = దినంబుల్ = దినముల; కున్ = కు; సమస్తంబునున్ = అన్నియును; ఉత్సన్నంబు = మిక్కిలి తగ్గిపోయినవి; అయ్యెన్ = అయినవి; అంతన్ = అంతట.

భావము:

అంత ఒకనాడు భరతుడు గండకీనదిలో స్నానంచేసి మూడు ముహూర్తాల కాలం నీటిలో నిలబడి ప్రణవం జపిస్తున్నాడు. అప్పుడు నిండు చూలాలైన లేడి ఒకటి నీరు త్రాగాలని ఒంటరిగా నదీ తీరానికి వచ్చింది. అది నీరు త్రాగుతుండగా ఆ నదీ సమీపంలో ఒక సింహం దిక్కులు పిక్కటిల్లే విధంగా భయంకరంగా గర్జించింది. పుట్టుకతోనే భయ స్వభావం గలిగిన లేడి ఆ ధ్వనిని విని అదిరిపడింది. ఆ ఆడజింక తత్తరపాటుతో దప్పిక తీర్చుకోకుండానే అమాంతం పైపైకిఎగిరి ఆవల గట్టుకు ఒక్క దూకు దూకింది. అలా అకస్మాత్తుగా కలిగిన భయంతో లంఘించడంలో దాని గర్భంలోని పిల్ల జారి నదీ జలాలలో పడింది. ఆందోళనగా ఒక్కసారిగా దూకటంలో తల్లి జింక ఆ నదీ తీరంలోని కొండరాతి మీద పడి ప్రాణాలు విడిచింది. అపుడు నదీ జలాలలో విలవిలలాడుతూ మునిగి తేలుతున్న లేడిపిల్లను చూచిన భరతుని హృదయం తల్లడిల్లింది. దయార్ద్రచిత్తుడై అతడా లేడిపిల్లను తన ఆశ్రమంలోనికి తీసికొని వచ్చాడు. ఆ బాలకురంగాన్ని ఎంతో గారాబంగా సాకడం మొదలు పెట్టాడు. దానిని లాలించడం పాలించడంలో, దానిని ముద్దుగా పెంచి పెద్ద చేయడంలో ఆసక్తుడై క్రమంగా భరతుడు తన నిత్యకృత్యాలైన అష్టాంగ యోగాలను, భగవంతుని పూజాకైంకర్యాలను మరిచిపోయాడు. క్రమక్రమంగా అతని నిత్యనైమిత్తిక క్రియాకలాపాలు ఒక్కటొక్కటే మూలబడ్డాయి.