పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : భరతుని పట్టాభిషేకంబు

  •  
  •  
  •  

5.1-89-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత విముక్త లింగుండు భగవంతుండునగు ఋషభుండు మనంబున దేహాభిమానంబు విసర్జించి కులాల చక్రంబు కులాలుని చేత భ్రమియింపంబడి విసృష్టంబయ్యు భ్రమించు గతిం బ్రాచీన సంస్కార విశేషం బగు నభిమానాభాసంబున దేహచలనాదికంబుల నొప్పి యుండియు యోగమాయా వాసనచే యుక్తుండయ్యె; మఱియు నా ఋషభుం డొక్క దినంబునం గోంకణ వంక పట కుటకంబులను దక్షిణ కర్ణాట దేశంబులకు యదృచ్ఛంజని కుటకాచ లోపవనంబున నిజాస్యకృత శిలాకబళుం డగుచు నున్మత్తుని చందంబున వికీర్ణ కేశుండు, దిగంబరుండునై సంచంరింప వాయువేగ విధూత వేణుసంఘర్షణ సంజాతం బగు నుగ్రదావానలంబు తద్వనంబు దహింప నందు దగ్ధుండయ్యె; నంత నతని కృత్యంబులు తద్దేశవాసులగు జనంబులు చెప్ప నర్హన్నామకుండగు దద్రాష్ట్రాధిపతి విని, నిజధర్మంబులం బరిత్యజించి స్వదేశస్థుల తోడంగూడి, దానా యాచారంబుల నంగీకరించి యధర్మబహుళం బగు కలియుగంబున భవితవ్యతచే విమోహితుండై మనుజుల నసమంజసం బగు పాషండ మతాభినివేశులం జేసె; మఱియును గలియుగంబు నందు మనుజాధములు దేవమాయా మోహితులై శాస్త్రోక్త శౌచాచారంబులు విడిచి నిజేచ్ఛం జేసి దేవతాహేళనంబులు చేయుచు నస్నానానాచమనాశౌచ కేశోల్లుంఛనాది కాపవిత్ర వ్రతంబులం జేయుచు నధర్మ బహుళం బగు కలియుగంబునం జెఱుపంబడ్డ బుద్ధి ధర్మంబులం గలిగి వేద బ్రాహ్మణ యజ్ఞపురుషుల దూషించుచు లోకంబులం దమతమ మతంబులకుం దామే సంతసిల్లుచు నవేదమూలం బగు స్వేచ్ఛం జేసి ప్రవర్తించి యంధపరంపరచే విశ్వాసంబు చేసి తమంతన యంధతమసంబునం బడుచు నుండుదు; రీ ఋషభుని యవతారంబు రజోవ్యాప్తులగు పురుషులకు మోక్షమార్గంబు నుపదేశించుటకు నయ్యె; నదియునుంగాక సప్త సముద్ర పరివృతంబు లగు నీ భూద్వీప వర్షంబులందలి జనంబులు దివ్యావతార ప్రతిపాదకంబు లతిశుద్ధంబులునగు నెవ్వని కృత్యంబులు గీర్తింతురు, మఱియు నెవ్వని యశంబున నతికీర్తిమంతుండగు ప్రియవ్రతుండు గలిగె, నెందు జగదాద్యుండగు పురాణపురుషుం డవతారంబు నొంది కర్మహేతుకంబులు గాని మోక్ష ధర్మంబులం దెలిపె, వెండియు నెవ్వండు యోగమాయా సిద్ధుల నసద్భూతంబు లగుటంజేసి నిరసించె నట్టి ఋషభునితోడఁ దత్సిద్ధికృత ప్రయత్నులగు నితరయోగీశ్వరులు మనోరథంబుననైన నెట్లు సరి యగుదు? రిట్లు సకలవేదలోక దేవ బ్రాహ్మణులకు గోవులకుం బరమగురుండు భగవంతుండు నగు ఋషభుని చరిత్రంబు వినినవారలకు దుశ్చరితంబులు దొలంగు మంగళంబులు సిద్ధించు మిక్కిలి శ్రద్ధతోడ నెవ్వండు విను వినిపించు వానికి హరిభక్తి దృఢంబగు, నట్టి హరి భక్తితాత్పర్యంబునం బెద్దలు భాగవతులగుటంజేసి సంప్రాప్త సర్వపురుషార్థులగుచు వివిధ వృజిన హేతుకంబగు సంసారతాపంబును బాసి యవిరతంబుఁ దద్భక్తియోగామృతస్నానంబు చేసి పరమపురుషార్థం బయిన మోక్షంబును జెందుదు; రని సప్తద్వీపవాసులవారు నేఁడునుం గొనియాడుచుండుదురు.

టీకా:

అంతన్ = అంతట; విముక్తలింగుడు = పరమహంస {విముక్త లింగుడు - లింగదేహము (తనను గుర్తించెడి చిహ్నమలు) నుండి విడువబడినవాడు, పరమహంస}; భగవంతుండు = భగవంతుడు; అగు = అయిన; ఋషభుండు = ఋషభుడు; మనంబునన్ = మనసులో; దేహ = శరీరముపైన; అభిమానంబున్ = ఆసక్తిని; విసర్జించి = విడిచిపెట్టి; కులాల = కుమ్మరి; చక్రంబున్ = చక్రము; కులాలుని = కుమ్మరివాని; చేతన్ = చేత; భ్రమియింపంబడి = తిప్పబడి; విసృష్టంబున్ = విడువబడినది; ఆయ్యున్ = అయనప్పటికిని; భ్రమించు = తిరిగెడు; గతిన్ = విధముగా; ప్రాచీన = పూర్వకర్మము యొక్క; సంస్కార = సంస్కారములు; విశేషంబున్ = విశేషమైనవి; అగు = అయిన; అభిమాన = అభిమానము యొక్క; అభాసంబునన్ = లేకపోవుటచే; దేహ = దేహము; చలన = కదులుట; ఆదికంబులన్ = మొదలగువానితో; ఒప్పి = చక్కగా; ఉండియున్ = ఉండినప్పటికిని; యోగమాయా = యోగమాయ; వాసన = అగరుల; చేన్ = తోటి; యుక్తుండు = కూడి ఉన్నవాడు; అయ్యెన్ = అయ్యెను; మఱియున్ = ఇంకను; ఆ = ఆ; ఋషభుండు = ఋషభుడు; ఒక్క = ఒక; దినంబునన్ = దినమున; కోంకణ = కొంకణి; వంక = వంగ; పట = పటము; కుటకంబులు = కుటకములు; అను = యనెడి; దక్షిణ = దక్షిణ; కర్ణాట = కర్నాటకము; దేశంబుల్ = దేశముల; కున్ = కి; అదృచ్చన్ = ప్రచ్ఛన్నముగా; చని = వెళ్ళి; కుటక = కుటకముయనెడి; అచల = పర్వతముయొక్క; ఉపవనంబునన్ = ఉపవనము నందు; నిజ = తన; అస్య = నోటితో; కృత = చేసిన; శిలా = రాళ్ళ; కబళుండు = భుజించువాడు; అగుచున్ = అగుచూ; ఉన్మత్తుని = పిచ్చివాని; చందంబునన్ = వలె; వికీర్ణ = చెదరిన; కేశుండు = వెంట్రుకలు గలవాడు; దిగంబరుండున్ = నగ్నముగా ఉన్నవాడు; ఐ = అయ్యి; సంచరింపన్ = తిరుగుతుండగ; వాయు = వాయువుల; వేగ = వేగమువలన; విధూత = ఊపబడిన; వేణు = వెదురుకఱ్ఱల; సంఘర్షణ = రాపిడి వలన; సంజాతంబు = పుట్టినది; అగు = అయిన; ఉగ్ర = భయంకరమైన; దావానలంబున్ = కారుచిచ్చు; తత్ = ఆ; వనంబున్ = అడవిని; దహింపన్ = కాల్చివేయగా; అందున్ = దానిలో; దగ్ధుండున్ = కాలిపోయినవాడు; అయ్యెన్ = అయ్యెను; అంతన్ = అంతట; అతని = అతని; కృత్యంబులున్ = పనులు; తత్ = ఐ; దేశ = దేశ మందు; వాసులు = నివాసము ఉండెడివారు; అగు = అయిన; జనంబులున్ = జనులు; చెప్పన్ = చెప్పగా; అర్హన్ = అర్హనుడు యనెడి; నామకుండు = పేరు గలవాడు; అగు = అయిన; తత్ = ఆ; రాష్ట్రా = దేశమునకు; అధిపతి = రాజు; విని = విని; నిజ = తన; ధర్మంబులన్ = మతములను; పరిత్యజించి = విడిచి; స్వ = స్వంత; దేశస్థులన్ = దేశవాసుల; తోడన్ = తోటి; కూడి = కలిసి; తాన్ = అతను; ఆ = ఆ; ఆచారంబులన్ = ఆచారములను; అంగీకరించి = స్వీకరించి; అధర్మ = అధర్మము; బహుళంబున్ = పెచ్చుపెరిగినది; అగు = అయిన; కలియుగంబునన్ = కలియుగములో; భవితవ్యత = జరుగవలసినదాని; చేన్ = గురించి; విమోహితుండు = మిక్కిలి మోహమున పడినవాడు; ఐ = అయ్యి; మనుజులన్ = మానవులలో; అసమంజసంబున్ = అవలంభింప తగనిది; అగు = అయిన; పాషండ = పాషండ, వేదమార్గవ్యతికర; మతా = మతములందు; అభినివేశులన్ = శ్రద్ధ గలవారిగా; చేసెన్ = చేసెను; మఱియున్ = ఇంకను; కలియుగంబున్ = కలియుగము; అందున్ = లో; మనుజ = మానవులైన; అధములు = నీచులు; దేవ = దేవుని యొక్క; మాయా = మాయచే; మోహితులు = మోహమున పడినవారు; ఐ = అయ్యి; శాస్త్ర = వేదశాస్త్రములలో; ఉక్త = చెప్పబడిన; శౌచ = శుచియైన; ఆచారంబులన్ = ఆచారములను; విడిచి = విడిచిపెట్టి; నిజ = తమ; ఇచ్చంజేసి = ఇష్టానుసారము; దేవతా = దేవతలను; హేళనంబున్ = అపహాస్యము; చేయుచున్ = చేయుచూ; అస్నాన = స్నానము చేయకపోవుట; అనాచమన = అచమనము చేయకపోవుట; అశౌచ = శుద్ది చేసుకొనని; కేశ = శిరోజములను; ఉల్లుంఛన = కత్తిరించుట, క్షౌరము; ఆదిక = మొదలగు; అపవిత్ర = పవిత్రముకాని; వ్రతంబులన్ = పనులను; చేయుచున్ = చేయుచూ; అధర్మ = అధర్మముల; బహుళంబున్ = అధికము; అగు = అయిన; కలియుగంబునన్ = కలియుగములో; చెఱుపంబడ్డ = పోగొట్టబడిన; బుద్ధిన్ = బుద్ధి; ధర్మంబులన్ = ధర్మములును; కలిగి = కలిగి; వేద = వేదములను; బ్రాహ్మణ = బ్రాహ్మణులను; యజ్ఞపురుషులన్ = యజ్ఞపురుషులను; దూషించుచున్ = దూషించుతూ; లోకంబుల్ = లోకముల; అంద = లో; తమతమ = వారివారి; మతంబుల్ = మతముల; కున్ = కు; తామే = వారే; సంతసిల్లుచున్ = సంతృప్తిపడిపోతూ; అవేద = వేదములుకాని; మూలంబు = ప్రమాణములు గలవి; అగు = అయిన; స్వేచ్ఛంజేసి = ఇష్టానుసారము; ప్రవర్తించి = తిరుగుతూ; అంధ = గుడ్డి; పరంపర = ఆచారపు సమూహముల; చేన్ = అందు; విశ్వాసంబున్ = నమ్ముట; చేసి = చేసిన; తమంతన = వారంతట వారే; అంధతమసంబునన్ = గుడ్డిచీకటిలో; పడుచునుండుదురు = పడుతుందురు; ఈ = ఈ; ఋషభుని = ఋషభుని; అవతారంబున్ = అవతారము; రజః = రజోగుణములు; వ్యాప్తులు = అతిశయించినవారు; అగు = అయిన; పురుషుల్ = వ్యక్తుల; కున్ = కు; మోక్ష = ముక్తికి; మార్గంబున్ = దారిని; ఉపదేశించుట = తెలియజెప్పుట; కున్ = కు; అయ్యెన్ = అయినది; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; సప్తసముద్ర = సప్తసముద్రములచే; పరివృతంబులు = చుట్టబడినవి; అగు = అయిన; ఈ = ఈ; భూ = భూమండలపు; ద్వీప = ద్వీపములు; వర్షంబులున్ = వర్షములు; అందలి = వానిలోని; జనంబులున్ = జనులు; దివ్య = దేవుని యొక్క; అవతార = అవతారములను; ప్రతిపాదికంబులున్ = స్థాపించునవి; అతి = మిక్కిలి; శుద్దంబులున్ = పరిశుద్దమైనవి; అగు = అయిన; ఎవ్వని = ఎవని; కృత్యంబులున్ = పనులను; కీర్తింతురు = స్తుతింతురో; మఱియున్ = ఇంకను; ఎవ్వని = ఎవని యొక్క; అంశంబునన్ = అంశతోటి; అతి = మిక్కిలి; కీర్తిమంతుడు = కీర్తి గలవాడు; అగు = అయిన; ప్రియవ్రతుండు = ప్రియవ్రతుడు; కలిగెన్ = జన్మించెనో; ఎందున్ = ఎక్కడైతే; జగత్ = విశ్వమునకు;ఆద్యుండు = కారణభూతుడు; అగు = అయిన; పురాణపురుషుండు = విష్ణువు; అవతారంబున్ = అవతారమును; ఒంది = పొంది; కర్మ = కర్మములకు; హేతుకంబులు = కారణములు; కాని = కాని; మోక్ష = ముక్తి యొక్క; ధర్మంబులన్ = లక్షణములను; తెలిపెను = తెలిపెను; వెండియున్ = మరల; ఎవ్వండు = ఎవరైతే; యోగమాయాసిద్ధులను = ఐశ్వర్యములను; అసద్భూతంబులు = సత్యదూర మైనట్టివి; అగుటన్ = అగుట; చేసి = వలన; నిరసించెన్ = తిరస్కరించెను; అట్టి = అటువంటి; ఋషభుని = ఋషభుని; తోడన్ = తోటి; తత్ = ఆ యొక్క; సిద్ధిన్ = సిద్ధులకై; కృత = చేసిన; ప్రయత్నులు = ప్రయత్నములు గలవారు; అగు = అయిన; యోగి = యోగులలో; ఈశ్వరులు = శ్రేష్ఠులు; మనోరథంబునన్ = కోరికలలోన; ఐనన్ = అయినప్పటికి; ఎట్లు = ఏ విధముగ; సరి = సాటి; అగుదురు = అయ్యెదరు; ఇట్లు = ఈ విధముగ; సకల = అఖిల; వేద = వేదములకు; లోక = లోకములకు; దేవ = దేవతలకు; బ్రాహ్మణ = బ్రాహ్మణుల; కున్ = కు; గోవుల్ = ఆవుల; కున్ = కు; పరమ = అత్యున్నతమైన; గురుండు = గురువు; భగవంతుండున్ = భగవంతుడు; అగు = అయిన; ఋషభుని = ఋషభుని; చరిత్రంబున్ = చరిత్ర; వినిన = విన్న; వారల్ = వారి; కున్ = కి; దుశ్చరితంబులు = పాపపు వర్తనములు; తొలంగు = తొలగిపోవును; మంగళంబులున్ = శుభకరములు; సిద్ధించున్ = కలుగును; మిక్కిలి = అధికమైన; శ్రద్ధ = శ్రద్ధ; తోడన్ = తోటి; ఎవ్వండున్ = ఎవరైతే; వినున్ = వినునో; వినిపించున్ = వినిపించునో; వాడు = వాడు; కిన్ = కి; హరి = విష్ణువు పైన; భక్తి = భక్తి; దృఢంబున్ = గట్టిపడుట; అగున్ = జరుగును; అట్టి = అటివంటి; హరి = విష్ణువు పైన; భక్తి = భక్తి యందు; తాత్పర్యంబునన్ = నిష్ఠ వలన; పెద్దలు = గొప్పవారు; భాగవతులు = భాగవతానుయాయులు; అగుటన్ = అగుట; చేసి = వలన; సంప్రాప్త = లభించిన; సర్వ = సమస్తమైన; పురుషార్థులు = పురుషార్థములు గలవారు {పురుషార్థంబులు - ధర్మార్థకామమోక్షములు, పురుషులు అర్థించదగినవి (కోరదగినవి)}; అగుచున్ = అగుచూ; వివిధ = అనేకమైన; వృజిన = పాపములకు; హేతుకంబు = కారణభూతములు; అగు = అయిన; సంసార = సాంసారిక; తాపంబులన్ = బాధలనుండి; పాసి = విడువడి; అవితరంబున్ = ఎడతెగని; తత్ = అతని యొక్క; భక్తియోగ = భక్తియోగము యనెడి; అమృత = అమృతము నందు; స్నానంబున్ = స్నానములు; చేసి = చేసిన; పరమ = అత్యున్నతమైన; పురుషార్థంబున్ = పురుషార్థము; అయిన = ఐనట్టి; మోక్షంబునున్ = మోక్షమును; చెందుదురు = చెందుదురు; అని = అని; సప్తద్వీప = సప్తద్వీపములందు {సప్తద్వీపములు - 1జంబూ(జంబూద్వీపము) 2ప్లక్ష(ప్లక్షద్వీపము) 3శాల్మలిద్వీప(శాల్మలీద్వీపము) 4కుశ(కుశద్వీపము) 5క్రౌంచ(క్రౌంచద్వీపము) 6శాక(శాకద్వీపము) 7పుష్కరములు(పుష్కరద్వీపములు)}; వాసులవారు = నివసించువారు; నేడునున్ = ఈనాటికిని; కొనియాడుచుందురు = కీర్తించుతుందురు.

భావము:

ఆ తరువాత పరమహంస, భగవంతుడు అయిన ఋషభుడు మనసులో దేహాభిమానాన్ని వదలుకొని, కుమ్మరిసారె కుమ్మరివానిచే త్రిప్పబడి విడువబడ్డ తర్వాత కూడా అది కొంతసేపు తిరుగుతున్నట్లే పూర్వ సంస్కార విశేషం వల్ల ఆయన దేహ సంచలనం పూర్తిగా ఆగిపోదు. ఋషభుడు లింగ శరీరాన్ని వదలిపెట్టినా యోగమాయా వాసనల కారణంగా లౌకికంగా దేహధారిగా చరించాడు. అతడు ఒకరోజు కోంకణ, వంగ, పట, కుటకాలు అనే దక్షిణ కర్ణాట దేశానికి ప్రచ్ఛన్నముగా వెళ్ళి, కుటక పర్వత సమీపంలోని ఉపవనం చేరుకున్నాడు. అక్కడ శిలాఖండాలను నోటిలో పెట్టుకొంటూ పిచ్చివానిలాగా చెదరిన జుట్టుతో దిగంబరుడై సంచరించాడు. అప్పుడు వీచిన సుడిగాలి విసురుకు వెదురుకఱ్ఱలు రాపిడి చెంది భయంకరమైన కార్చిచ్చు రేగింది. ఆ మంటలలో ఋషభుడు కాలిపోయాడు. ఋషభుని చేతలను ఆ ప్రాంతంవారు చెప్పుకోగా అర్హనుడు అనే పేరుగల ఆ రాష్ట్రాధికారి విని, స్వధర్మం వదలిపెట్టి స్వదేశస్థులతో ఆ ఆచారానికి ఆమోదం తెలిపాడు. అధర్మ బహుళమైన కలియుగంలో భవిష్యత్తుకు లోబడిపోయి తన రాష్ట్రంలోని మానవులను అయోగ్యమైన వేద బాహ్యమతం పట్ల మొగ్గేటట్లు చేసాడు. కలియుగంలో అధములైన మానవులు దేవమాయవల్ల మోహితులై శాస్త్రాలలో చెప్పబడ్డ శౌచాలను, ఆచారాలను వదలిపెట్టి తమకు ఇష్టం వచ్చినట్లు దేవతలను పరిహసిస్తారు. స్నానం, ఆచమనం చేయకపోవడం, జుట్టు కొరిగించుకొంటారు. అపవిత్ర వ్రతాలను చేస్తారు. అధర్మాలు పెచ్చు పెరిగిన కలియుగంలో బుద్ధి, ధర్మం చెడిపోగా వేదాలను, బ్రహ్మణులను, యజ్ఞపురుషులను నిందిస్తూ, తమతమ మతాలకు తామే సంతోషిస్తూ, వేదవిరుద్ధంగా ఇష్టానుసారం ప్రవర్తిస్తూ, అంద విశ్వాసాలకు లొంగి తమంత తామే గుడ్డి చీకటిలో పడుతూ ఉంటారు. రజోగుణంతో నిండిన మానవులకు మోక్షమార్గాన్ని ఉపదేశించడం కోసమే ఋషభుని అవతారం. సప్త సముద్రాలచేత చుట్టుముట్టబడిన ద్వీపాలలోని, వర్షాలలోని జనులు ఎవని దివ్యమైన అవతార లీలలను కీర్తిస్తారో, ఎవడు ఎంతో కీర్తి గడించిన ప్రియవ్ఱ్ఱతుని వంశంలో జన్మించాడో, ఎవడు లోకాలకు ఆది అయిన పురాణపురుషుడో అటువంటి ఋషభ దేవుడు భూలోకంలో అవతరించి కర్మ సంబంధం లేని మోక్ష ధర్మాన్ని ప్రబోధించాడు. యోగమాయవల్ల తమకు తామై లభించిన అసత్యాలైన సిద్ధులను తిరస్కరించాడు. అటువంటి ఋషభునికి సిద్ధులకోసం ప్రయత్నించే యోగీశ్వరులు ఏ విధంగా సాటి అవుతారు? అన్ని వేదాలకు, అన్ని లోకాలకు, సమస్త దేవతలకు, బ్రాహ్మణులకు, గోవులకు పరమ గురువు, భగవంతుడు అయినవాడు ఋషభుడు. ఆయన చరిత్రం వింటే దుశ్చరిత్రుల పాపం తొలగిపోతుంది. శుభాలు చేకూరుతాయి. ఎవరయితే ఋషభుని చరిత్రను మిక్కిలి శ్రద్ధతో వింటారో, ఎవరు ఇతరులకు వినిపిస్తారో వారికి సుదృఢమైన భక్తి లభిస్తుంది. అటువంటి హరిభక్తి పట్ల తత్పరత కలిగిన పెద్దలైన భాగవతులు హరి కృపవల్ల ధర్మార్థకామమోక్షాలనే పురుషార్థాలను సాధించుకుంటారు. నానావిధ పాపకారణమైన సంసార తాపాన్ని పోగొట్టుకుంటారు. హరిభక్తి యోగమనే అమృతస్నానం చేసి పునీతులౌతారు. పరమ పురుషార్థమైన మోక్షాన్ని సిద్ధింపజేసుకుంటారు. ఈ విధంగా సప్తద్వీపాలలోని జనులు నేడుకూడా ఋషభుని మహిమను పొగడుతుంటారు.