పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : భరతుని పట్టాభిషేకంబు

  •  
  •  
  •  

5.1-82-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు బీభత్సరూపంబున వసుంధరం బడియుండి యన్నంబు భుజించుచు నీరు ద్రావుచు మూత్రపురీషంబులు విడుచుచు నవి శరీరంబు నంటం బొరలుచుండు; మఱియుఁ దత్పురీష సౌగంధ్య యుక్తంబగు వాయువు దశదిశలన్ దశయోజన పర్యంతంబు పరిమళింపం జేయుచుండ గో మృగ కాక చర్యలం జరించుచు భగవదంశంబైన ఋషభుండు మహానందంబు ననుభవించుచుఁ దనయందు సర్వభూతాంతర్యామి యగు వాసుదేవునిం బ్రత్యక్షంబుగాఁ గనుంగొనుచు సిద్ధిం బొందిన వైహాయస మనోజవ పరకాయప్రవేశాంతర్ధాన దూరగ్రహణ శ్రవణాది యోగసిద్ధులు దమంత వచ్చినం గైకొనక యుండె;" నని పలికిన శుకయోగీంద్రునకుం బరీక్షింన్నరేంద్రు డిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; బీభత్స = అసహ్యకరమైన; రూపంబునన్ = రూపముతో; వసుంధరన్ = భూమిపై; పడియుండి = పడియుండి; అన్నంబున్ = అన్నమును; భుజించుచున్ = తినుచూ; నీరు = నీరు; త్రావుచు = తాగుతూ; మూత్ర = మూత్రము; పురీషంబులున్ = మలములు; విడుచుచున్ = వదలుతూ; అవి = వానిని; శరీరంబునన్ = దేహమున; అంటన్ = అంటుకొనుచుండ; పొరలుచుండు = దొర్లుతుండును; మఱియున్ = ఇంకను; తత్ = ఆ; పురీష = మలము యొక్క; సౌగంధ్య = సుగంధముతో; యుక్తంబు = కూడినది; అగు = అయిన; వాయువు = గాలి; దశ = పది {దశదిశలు - 1తూర్పు 2ఆగ్నేయము 3దక్షిణము 4నైరృతి 5పశ్చిమము 6వాయవ్యము 7ఉత్తరము 8ఈశాన్యము 9 క్రింద 10 పైన}; దిశలన్ = దిక్కులలోను; దశ = పది; యోజన = యోజనముల; పర్యంతంబు = వరకు; పరిమళింపన్ = పరిమళించునట్లు; చేయుచుండన్ = చేయుచుండగా; గో = పశువుల; మృగ = జంతువుల; కాక = కాకుల వంటి; చర్యలన్ = చర్యలను; చరించుచున్ = వర్తించుచు; భగవత్ = భగవంతుని యొక్క; అంశంబు = అంశ; ఐన = అయిన; ఋషభుండు = ఋషభుడు; మహానందంబున్ = మహానందమును; అనుభవించున్ = అనుభవించుతూ; తన = తన; అందున్ = అందు; సర్వ = సకల; భూత = జీవుల; అంతర్యామి = లోన ఉండువాడు; అగు = అయిన; వాసుదేవుని = నారాయణుని; ప్రత్యక్షంబునన్ = ప్రత్యక్షముగా; కనుగొనుచున్ = చూచుచూ; సిద్ధిన్ = సిద్ది; పొందిన = పొందినట్టి; వైహాయస = ఆకాశమున తిరుగుట; మనోజవ = మనసుతో సమానమైన వేగమున తిరుగుట; పరకాయప్రవేశ = ఇతర దేహములలో ప్రవేశించుట; అంతర్ధాన = అదృశ్యమగుట; దూరగ్రహణ = దూరముగా ఉన్నవానిని గ్రహించుట; శ్రవణ = వినుట; ఆది = మొదలగు; యోగసిద్ధులు = ఐశ్వర్యములు; తమంత = తమంత తామె; వచ్చినన్ = వచ్చినప్పటికిని; కైకొనక = చేపట్టక; ఉండెన్ = ఉండెను; అని = అని; పలికిన = పలికినట్టి; శుక = శుకుడు యనెడి; యోగి = యోగులలో; ఇంద్రున్ = ఇంద్రుని వంటివాని; కున్ = కి; పరీక్షిత్ = పరీక్షిత్తు అనెడి; నరేంద్రుడున్ = రాజు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఈ విధంగా జుగుప్స కలిగించే తీరున నేలమీద పడి ఉండి, అన్నం తింటూ, నీళ్ళూ త్రాగుతూ, మల మూత్రాలలో పొరలుతుండేవాడు. అతని మల సుగంధంతో కూడిన వాయువు పది దిక్కులలోను పది ఆమడల దూరం పరిమళిస్తుండేది. భగవదంశ సంభూతుడైన ఋషభుడు వృషభం వలె, మృగం వలె, వాయసం వలె ప్రవర్తిస్తూ మహదానందాన్ని పొందేవాడు. సర్వాంతర్యామి అయిన వాసుదేవుణ్ణి తనలో ప్రత్యక్షంగా దర్శించుకుంటూ యోగసిద్ధుడైనాడు. అపుడు ఆకాశగమనం, మనోవేగం, పరకాయ ప్రవేశం, అంతర్ధానం, దూర దర్శనం, దూర శ్రవణం మొదలైన సిద్ధులు తమంత తాముగా ఋషణుణ్ణి ఆశ్రయించాయి. అయినా ఋషభుడు ఆ సిద్ధులను స్వీకరించలేదు” అని శుకమహర్షి చెప్పగా పరీక్షిత్తు ఇలా అన్నాడు.