పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : భరతుని పట్టాభిషేకంబు

  •  
  •  
  •  

5.1-78-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు సదాచారు లగు కుమారులకు లోకానుశాసనార్థం బాచారంబు లుపదేశించి మహాత్ముండును బరమసుహృత్తును నగు భగవంతుండు ఋషభాపదేశంబునం గర్మత్యాగంబు చేసి యుపశమశీలురగు మునులకు భక్తిజ్ఞాన వైరాగ్య లక్షణంబులు గల పారమహంస్య ధర్మం బుపదేశింపఁ గలవా డగుచుఁ బుత్రశతంబునం దగ్రజుండును బరమభాగవతుండును భగవజ్జన పరాయణుండును నగు భరతుని ధరణీపాలనంబునకుఁ బట్టంబు గట్టి తాను గృహమందె దేహమాత్రావలనంబు చేసి దిగంబరుండై యున్మత్తాకారుం డగుచు బ్రకీర్ణ కేశుండై యగ్నుల నాత్మారోపణంబు చేసి బ్రహ్మావర్తదేశంబును బాసి జడాంధ బధిర మూక పిశాచోన్మాదులుం బోలె నవధూత వేషంబునొంది జనులకు మాఱు పలుకక మౌన వ్రతంబునం బుర గ్రామాకర జనప దారామ శిబిర వ్రజ ఘోష సార్థ గిరి వనాశ్రమాదుల యందు వెంటఁ జనుదెంచు దుర్జన తర్జన తాడనావమాన మేహన నిష్ఠీవన పాషాణ శకృద్రజః ప్రక్షేపణపూతి వాత దురుక్తులం బరిభూతుం డయ్యును గణనం బెట్టక వన మదేభంబు మక్షికాదికృతోపద్రవంబునుంబోలెఁ గైకొనక దేహాభిమానంబునం జిత్తచలనంబు నొందక యేకాకియై చరియించు చుండ నతి సుకుమారంబులగు కరచరణోరస్థ్సలంబులు విపులంబులగు బాహ్వంస కంఠ వదనాద్యవయవ విన్యాసంబులుం గలిగి ప్రకృతి సుందరం బగుచు స్వతస్సిద్ధదరహాసరుచిర ముఖారవిందంబై నవ నళిన దళంబులం బోలి శిశిర కనీనికలం జెలువొంది, యరుణాయతంబు లగు నయనంబులచే నొప్పి యన్యూనాధికంబులగు కపోల కర్ణ కంఠ నాసాదండంబులచేఁ దేజరిల్లుచు నిగూఢస్మితవదన విభ్రమంబులం బ్రకాశించు తన దివ్యమంగళ విగ్రహంబుచేఁ బురసుందరుల మనంబుల కత్యంత మోహంబు గలుగఁ జేయుచు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; సత్ = మంచి; ఆచారులు = ఆచరణలుగలవారు; అగు = అయిన; కుమారుల్ = పుత్రుల; కున్ = కు; లోక = లోకులను; అనుశాసన = పరిపాలించెడి; అర్థంబున్ = కోసమైన; ఆచారంబున్ = విధానములను; ఉపదేశించి = తెలియజెప్పి; మహాత్ముండునున్ = గొప్పవాడు; పరమ = అత్యుత్తమ; సుహృత్తు = స్నేహితుడు; అగు = అయిన; భగవంతుండు = భగవంతుడు; ఋషభ = ఋషభుని; అపదేశంబు = నెపమున; కర్మత్యాగంబున్ = కర్మములను విడిచుట; చేసి = వలన; ఉపశమశీలురు = శాంతించిన స్వభావము గలవారు; అగు = అయిన; మునుల్ = మునుల; కున్ = కు; భక్తి = భక్తి; జ్ఞాన = జ్ఞానము; వైరాగ్య = వైరాగ్యము; లక్షణంబులు = లక్షణములుగా; కల = కలిగిన; పారమహంస్య = పరమహంసలకు చెందిన; ధర్మంబున్ = ధర్మములను; ఉపదేశింపన్ = ఉపదేశించుటకు; కలవాడు = సమర్థుండు; అగుచున్ = అగుచున్న; పుత్ర = కుమారులు; శతంబున్ = నూరుగురి; అందున్ = లోను; అగ్రజుండునున్ = పెద్దవాడును; పరమ = అత్యధికమైన; భాగవంతుండును = భాగవతజనుడును; భగవజ్జన = భాగవతజనుల యెడ; పరాయణుండును = ఆసక్తి గలవాడు; అగు = అయిన; భరతునిన్ = భరతుడిని; ధరణీ = భూమిని; పాలనంబున్ = పరిపాలనమున; కున్ = కు; పట్టంబుగట్టి = పట్టాభిషేకము చేసి; తాను = తాను; గృహము = ఇంటి; అందె = అందే; దేహ = శరీరపోషణకు; మాత్ర = మాత్రమే; అవలనంబు = నిలుపుకొనుటను; చేసి = చేసి; దిగంబరుండు = నగ్నముగ ఉండువాడు {దిగంబరుడు - దిక్కులే అంబరము (బట్టగా) కలవాడు, నగ్నుడు}; ఐ = అయ్యి; ఉన్మత్త = పిచ్చివాని; ఆకారుండు = ఆకారము గలవాడు; అగుచున్ = అగుచూ; ప్రకీర్ణ = చెదరిన; కేశుండు = శిరోజములు గలవాడు; ఐ = అయ్యి; అగ్నులన్ = యోగాగ్నులను; ఆత్మన్ = తన యందు; ఆరోపణంబున్ = ఆరోపించుకొనుట; చేసి = చేసికొని; బ్రహ్మావర్త = బ్రహ్మావర్తము యనెడి; దేశంబునున్ = దేశమును; పాసి = విడిచిపెట్టి; జడ = తెలివిహీనుని; అంధ = గుడ్డివాని; బధిర = చెవిటివాని; మూక = మూగవాని; పిశాచ = పిశాచమును; ఉన్మాదులున్ = పిచ్చివాని; పోలెన్ = వలె; అవధూత = అవధూత {అవధూత - దిగంబర సన్యాసి, భగవంతుని తన అవధానమున నిలుపుకొన్నవాడు, విడువబడిన ఇహలోకార్థములు గలవాడు}; వేషంబున్ = వేషమును; ఒంది = పొంది; జనుల్ = లోకుల; కున్ = కు; మాఱుపలుకక = మారు మాట్లాడకుండగ; మౌన = మౌనమునందు; వ్రతంబునన్ = వ్రతదీక్ష చేపట్టి; పుర = పట్టణములు; గ్రామ = పల్లెలు; ఆకర = ఇండ్లు; జనపద = జానపదములు; ఆరామ = విశ్రాంతి గృహములు; శిబిర = శిబిరములు; వ్రజ = గొల్లపల్లెలు; ఘోష = గొడ్లపాకలు; సార్థ = ప్రయాణీకులు విడది గృహములు; గిరి = కొండలు; వన = అడవులు, తోటలు; ఆశ్రమ = ఆశ్రమములు; ఆదులు = మొదలగువాని; అందు = అందు; వెంటన్ = వెనుక; చనుదెంచు = వచ్చెడి; దుర్జన = చెడ్డవారి; తర్జన = అదలింపులు; తాడన = కొట్టుటలు; అవమాన = అవమానము చేయుటలు; మేహన = మూత్రము పోయుటలు; నిష్ఠీవన = ఉమ్మి వేయుటలు; పాషాణ = రాళ్ళు; శకృత్ = మలములు; రజః = దుమ్ము; ప్రక్షేపణ = విసరుట; పూతివాత = కుళ్లినవానిని విసరుట; దురుక్తులన్ = తిట్లతోటి; పరిభూతుండున్ = అవమానింపబడినవాడు; అయ్యున్ = అయినప్పటికిని; గణనంబెట్టక = లెక్కపెట్టకుండ; వన = అడవి; మధేభంబున్ = ఏనుగు; మక్షిక = ఈగలు; ఆది = మొదలైనవానిచే; కృత = చేయబడిన; ఉపద్రవంబునున్ = కీడులను; పోలెన్ = వలె; కైకొనక = లెక్కపెట్టకుండ; దేహా = శరీరము నందు; అభిమానంబునన్ = అభిమానము వలన; చిత్త = మానసిక; చలనంబున్ = చలించుట; ఒందక = పొందకుండ; ఏకాకి = ఒంటరి; ఐ = అయ్యి; చరియించుచుండన్ = వర్తించుచుండగా; అతి = మిక్కిలి; సుకుమారంబులు = సుకుమారమైనవి; అగు = అయిన; కర = చేతులు; చరణ = కాళ్ళు; ఉరస్థలంబులు = వక్షస్థలములు; విపులంబులు = విస్తారమైనవి; అగు = అయిన; బాహు = భుజములు; అంస = గూడలు; కంఠ = మెడ; వదన = మోము; ఆది = మొదలగు; అవయవ = అవయవముల; విన్యాసంబులున్ = రచనలు; కలిగి = ఉన్నట్టి; ప్రకృతి = వైయక్తిక; సుందరంబున్ = అందము; అగుచున్ = కలిగి; స్వతస్సిద్ద = సహజసిద్ధమగు; దరహాస = చిరునవ్వుతో; రుచిర = వెలుగుతున్న; ముఖ = మోము యనెడి; అరవిందంబు = పద్మము; ఐ = కలిగి; నవ = నవనవలాడెడి; నళిన = పద్మము యొక్క; దళంబులన్ = రేఖలను; పోలి = పోలెడి; శిశిర = చల్లని; కనీనికలన్ = కనుపాపలతో; చెలువొంది = చక్కనైన; అరుణ = ఎఱ్ఱని; ఆయతంబులు = విశాలమైనవి; అగు = అయిన; నయనంబుల్ = కన్నుల; చేన్ = తోటి; ఒప్పి = ఒప్పి ఉండి; అన్యునాధికంబులు = తక్కువ ఎక్కువలు లేనివి; అగు = అయిన; కపోల = ముంగురులు; కర్ణ = చెవులు; కంఠ = మెడ; నాసాదండము = ముక్కుదూలముల; చేన్ = తోటి; తేజరిల్లుచున్ = ప్రకాశించుతూ; నిగూఢ = దాగిన; స్మిత = చిరునవ్వులు కలిగిన; వదన = ముఖము యొక్క; విభ్రమంబులన్ = శోభలతో; ప్రకాశించు = ప్రకాశించెడి; తన = తన యొక్క; దివ్య = దివ్యమైన; మంగళ = శుభకరమైన; విగ్రహంబున్ = రూపము; చేన్ = వలన; పుర = పురము నందలి; సుందరుల = సుందరీజనముల; మనంబుల్ = మనసుల; కున్ = కు; అత్యంత = అత్యధికమైన; మోహంబున్ = మోహమును; కలుగ = కలుగునట్లు; చేయుచున్ = చేయుచూ.

భావము:

ఈ విధంగా సదాచార సంపన్నులైన కుమారులకు లోకాన్ని పాలించడానికి అవసరమైన ఆచారాలను ఋషభుడు ఉపదేశించాడు. మహానుభావుడు, లోకబాంధవుడు అయిన భగవంతుడు ఋషభుని రూపంలో కర్మపరిత్యాగం చేసి శాంత స్వభావులైన మునులకు భక్తి జ్ఞాన వైరాగ్య లక్షణాలతో పరమహంస ధర్మాలను ఉపదేశించాలని ఉద్దేశించాడు. ఆయన తన నూరుమంది కొడుకులలో పెద్దవాడు, పరమ భాగవతుడు, భాగవతుల పట్ల ఆసక్తి కలవాడు అయిన భరతునికి పట్టంగట్టి రాజ్యభారాన్ని అప్పగించాడు. అనంతరం శరీరమాత్ర సహాయుడై, దిగంబరుడై, చింపిరి జుట్టుతో పిచ్చివానిలాగా ప్రవర్తిస్తూ అగ్నుల్ని తనలో ఆరోపించుకొని బ్రహ్మావర్త దేశాన్ని వదలిపెట్టి వెళ్ళిపోయాడు. జడునిలాగా, చెవిటివానిలాగా, మూగవానిలాగా, పిశాచం ఆవహించిన పిచ్చివానిలాగా అవధూత వేషం ధరించాడు. ఎవరైనా పలకరించినా బదులు చెప్పకుండా మౌనవ్రతం చేపట్టాడు. నగరాలు, గ్రామాలు, పల్లెలు, తోటలు, శిబిరాలు, బిడారాలు, గొల్లపల్లెలు, గొడ్లపాకలు, కొండలు, తపోవనాలు, ఋష్యాశ్రమాలు దాటి పోసాగాడు. వెంటపడే దుండగులు కొడుతున్నా, తిడుతున్నా, రాళ్ళు విసురుతున్నా, దుమ్ము చల్లుతున్నా, తనపై మూత్ర విసర్జన చేసినా, ఉమ్మి వేసినా, కుళ్ళిన వస్తువులను తనపైకి విసరి వేసినా, బూతు కూతలు కూస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా జోరీగలను లెక్కపెట్టని ఏనుగులాగా ముందుకు నడచిపోతున్నాడు. ఏమాత్రం దేహాభిమానం లేకుండా నిశ్చలమైన చిత్తంతో ఏకాకిగా సంచరిస్తున్నాడు. అతని చేతులు, కాళ్ళు, ఉరోభాగం చాలా సుకుమారంగా ఉన్నాయి. భుజాలు, కంఠసీమ, ముఖం మొదలైన అవయవాలు విశాలంగా తీర్చినట్లున్నాయి. అతని రూపం సహజ సుందరంగా ఉంది. పద్మంవంటి ముఖంలో స్వతస్సిద్ధమైన చిరునవ్వులు చిందుతున్నాయి. కొంగ్రొత్త తామ రేకులలాగా చల్లని కనుపాపలు కనిపిస్తున్నాయి. విప్పారిన కళ్ళల్లో ఎఱ్ఱదనం ప్రకాశిస్తున్నది. చెక్కిళ్ళు గాని, చెవులు గాని, మెడభాగం కాని, ముకుపుటాలు గాని ఏమాత్రం లోపం లేకుండా దిద్ది తీర్చినట్లున్నాయి. అతని పెదవుల లోపలి చిరునవ్వు ఇతరులను భ్రమింపజేసేట్లు ఉంది. అటువంటి అతని దివ్య మంగళ విగ్రహం ముద్దుగుమ్మలను మోహంలో ముంచెత్తుతున్నది.