పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : దక్షాదుల శ్రీహరి స్తవంబు

  •  
  •  
  •  

4-215-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అధర్మ శాఖలు

మఱియు నధర్మునకు ‘మృష’ యను భార్య యందు ‘దంభుండు’ను, ‘మాయ’ యను నంగనయుం బుట్టిరి; అధర్మ సంతానం బగుట వారిరువురును మిథునం బైరి; వారిని సంతాన హీనుండగు నిరృతి గైకొనియె; వారలకు ‘లోభుండును’ ‘నికృతి’ యను సతియునుం గలిగి మిథునం బైరి; ఆ మిథునంబునకుఁ ’గ్రోధుండు’ ‘హింస’ యను నంగనయుం బుట్టి మిథునం బైరి; ఆ మిథునంబునకుఁ ’గలి’యు ‘దురుక్తి’ యను నతివయుం జన్మించి దాంపత్యంబు గయికొనిరి; ఆ దంపతులకు ‘భయ’ ‘మృత్యువు’ లను మిథునంబు గలిగె; దాని వలన ‘యాతన’యు ‘నిరయంబు’ను బుట్టిరి; వీరలు సంసార హేతువగు నధర్మ తరుశాఖ లయి నెగడిరి; వీని శ్రేయస్కాముండగు జనుం డీషణ్మాత్రంబు ననువర్తింపం జన; దివ్విధంబునంబ్రతిసర్గంబును సంగ్రహంబున వినిపించితి; నిప్పుణ్యకథ నెవ్వండేని ముమ్మాఱు వినిన నతండు ముమ్మాటికి నిష్పాపుం డగును;"నని చెప్పి; మఱియు నిట్లనియె.

టీకా:

మఱియును = ఇంకను; అధర్మున్ = అధర్ముని; కున్ = కి; మృష = మృష {మృష - అసత్యము}; అను = అనెడి; భార్య = భార్య; అందున్ = అందు; దంభుండును = దంభుడు {దంభుడు - దబాయింపు}; మాయ = మాయ; అను = అనెడి; అంగనయున్ = స్త్రీ; పుట్టిరి = జనించిరి; అధర్మ = అధర్మ; సంతానంబు = సంతానము; అగుటన్ = అగుటచేత; వారు = వారు; ఇరువురును = ఇద్దరును; మిధునంబున్ = భార్యాభర్తలు; ఐరి = అయిరి; వారిని = వారిని; సంతాన = సంతానము; హీనుండు = లేనివాడు; అగు = అయిన; నిరృతి = నిరృతి {నిరృతి - అభాగ్యము, ఋతము (సత్యమైనది) లేనివాడు}; కైకొనియెన్ = తీసుకొనెను; వారలకు = వారికి; లోభుండును = లోభుడు {లోభుడు - పిసినారి}; నికృతి = నికృతి {నికృతి - వంచన, తిరస్కారము}; అను = అనెడి; సతియునున్ = స్త్రీ; కలిగి = జనించి; మిథునంబున్ = భార్యాభర్తలు; ఐరి = అయిరి; ఆ = ఆ; మిథునంబున్ = భార్యాభర్తలు; కున్ = కి; క్రోధుండు = క్రోధుడు {క్రోధుడు - కోపము}; హింస = హింస {హింస - బాధించుట}; అను = అనెడి; అంగనయున్ = స్త్రీ; పుట్టి = జనించి; మిథునంబున్ = భార్యాభర్తలు; ఐరి = అయిరి; ఆ = ఆ; మిథునంబున్ = భార్యాభర్తలు; కున్ = కు; కలియు = కలి {కలి - జగడము}; దురుక్తి = దురుక్తి {దురుక్తి - నింద}; అను = అనెడి; యువతియున్ = స్త్రీ; జన్మించి = పుట్టి; దాంపత్యంబున్ = దాంపత్యమును; కైకొనిరి = చేపట్టిరి; ఆ = ఆ; దంపతుల్ = దంపతుల; కున్ = కి; భయ = భయము {భయము - జరగబోవుదాని గురించి ఆందోళన}; మృత్యువులు = మృత్యువులు {మృత్యువు - మరణము}; అను = అనెడి; మిథునంబున్ = భార్యాభర్తలు; కలిగెన్ = అయిరి; దాని = ఆ మిథునము; వలన = వలన; యాతనయు = యాతన {యాతన - తీవ్రవేదన}; నిరయంబును = నిరయంబు {నిరయంబు - నరకము}; పుట్టిరి = పుట్టిరి; వీరలు = వీరు; సంసార = సంసారమునకు; హేతువు = కారణము; అగు = అయిన; అధర్మ = అధర్మమము అనెడి; తరు = వృక్షమునకు; శాఖలు = కొమ్మలు; అయి = అయ్యి; నెగడిరి = వర్థిల్లిరి; వీనిన్ = వీటిని; శ్రేయస్ = శుభములను; కాముండు = కోరువాడు; అగు = అయిన; జనుండు = వాడు; ఈషణ్మాత్రంబునను = కొంచముకూడ; అనువర్తింపను = అనుసరించి నడచుట; చనదు = తగినదికాదు; ఈ = ఈ; విధంబునన్ = విధముగ; ప్రతిసర్గంబును = మన్వాదిసృష్టి; సంగ్రహంబున = సంగ్రహముగ; వినిపించితి = చెప్పితిని; ఈ = ఈ; పుణ్య = పుణ్య; కథను = కథను; ఎవ్వండేని = ఎవడైనను; ముమ్మాఱు = మూడు (3) మారులు; వినిన్ = వినినచో; అతండు = అతడు; ముమ్మాటికి = తప్పకుండగ; నిష్పాపుండు = పాపము లేనివాడు; అని = అని; చెప్పి = చెప్పి; మఱియును = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

ఇంకా అధర్మునకు మృష అనే భార్యయందు దంభుడు అనే కుమారుడు, మాయ అనే కుమార్తె జన్మించారు. అధర్మ సంతానం కనుక వారిద్దరూ దంపతులయ్యారు. వారిద్దరినీ సంతానం లేని నిరృతి దత్తు చేసుకున్నాడు. ఆ దంపతులకు లోభుడు అనే కుమారుడు, నికృతి అనే కుమార్తె కలిగి వాళ్ళు దంపతులయ్యారు. వారికి క్రోధుడు అనే కొడుకు, హింస అనే కూతురు పుట్టి భార్యాభర్తలయ్యారు. ఆ జంటకు కలి అనే కుమారుడు, దురుక్తి అనే కుమార్తె జన్మించి దంపతులయ్యారు. ఆ దంపతులకు భయం అనే పురుషుడు, మృత్యువు అనే స్త్రీ జన్మించి దంపతులయ్యారు. వారికి యాతన, నిరయం అనే జంట జన్మించి దంపతులయ్యారు. వీరు సంసార హేతువైన అధర్మం అనే వృక్షానికి కొమ్మలై వ్యాపించారు. తన మేలు కోరే మానవు డెవ్వడూ ఏమాత్రం వారిని అనుసరించకూడదు. ఈ విధంగా ప్రతిసర్గాన్ని నీకు సంగ్రహంగా వినిపించాను. ఈ పుణ్యకథను మూడుసార్లు చదివినవాడు పుణ్యాత్ముడౌతాడు” అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు.