పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : దక్షాదుల శ్రీహరి స్తవంబు

  •  
  •  
  •  

4-211-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత దాక్షాయణి యయిన సతీదేవి పూర్వకళేబరంబు విడిచి హిమవంతునకు మేనక యందు జనియించి విలయకాలంబునం బ్రసుప్తం బయిన శక్తి సృష్టికాలంబున నీశ్వరునిఁ బొందు చందంబునఁ బూర్వదయితుండగు రుద్రుని వరించె నని దక్షాధ్వర ధ్వంసకుం డగు రుద్రుని చరిత్రంబు బృహస్పతి శిష్యుండైన యుద్ధవునకు నెఱింగించె; నతండు నాకుం జెప్పె; నేను నీకుం జెప్పి;" తని మైత్రేయుండు వెండియు విదురున కిట్లనియె.

టీకా:

అంత = అంతట; దాక్షాయణి = దక్షుని పుత్రిక; అయిన = అయిన; సతీదేవి = సతీదేవి; పూర్వ = పాత; కళేబరంబున్ = శరీరమును; విడిచి = వదలి; హిమవంతునకు = హిమవంతునకు; మేనక = మేనక; అందున్ = అందు; జనియించి = పుట్టి; విలయ = ప్రళయ; కాలంబునన్ = సమయము నందు; ప్రసుప్తంబు = బాగుగ నిద్రించినది; అయిన = అయిన; శక్తి = శక్తి; సృష్టికాలంబునన్ = సృష్టికాలమున; ఈశ్వరుని = శివుని; పొందు = చెందు; చందంబునన్ = విధముగ; పూర్వ = పూర్వపు; దయితుండు = ప్రియుడు; అగు = అయిన; రుద్రుని = శివుని; వరించెన్ = వరించెను; అని = అని; దక్ష = దక్షుని; అధ్వర = యాగమును; ధ్వంసకుడు = ధ్వంసము చేసినవాడు; అగు = అయిన; రుద్రుని = శివుని; చరితంబున్ = వర్తనమును; బృహస్పతి = బృహస్పతి; శిష్యుండు = శిష్యుడు; ఐన = అయిన; ఉద్ధవున్ = ఉద్ధవుని; కున్ = కి; ఎఱింగించె = తెలిపెను; అతండు = అతడు; నాకున్ = నాకు; చెప్పెన్ = చెప్పెను; నేను = నేను; నీకున్ = నీకు; చెప్పితిన్ = చెప్పాను; అని = అని; మైత్రేయుండు = మైత్రేయుడు; వెండియున్ = మరల; విదురున్ = విదురున; కున్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

ఆ తరువాత దక్షుని కూతురైన సతీదేవి పూర్వ శరీరాన్ని విడిచి, హిమవంతునకు, మేనకకు కుమార్తెగా జన్మించి, ప్రళయకాలంలో ప్రస్తుప్తమైన శక్తి సృష్టికాలంలో ఈశ్వరుని పొందిన విధంగా తన పూర్వభర్త అయిన రుద్రుని వరించింది” అని దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసిన రుద్రుని చరిత్రను బృహస్పతి తన శిష్యుడైన ఉద్ధవునకు చెప్పాడు. ఆ ఉద్ధవుడు నాకు చెప్పాడు. నేను నీకు చెప్పాను” అని చెప్పి మైత్రేయుడు విదురునితో ఇంకా ఇలా అన్నాడు.