పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : దక్షాదుల శ్రీహరి స్తవంబు

  •  
  •  
  •  

4-204-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బ్రాహ్మణజనంబు లిట్లనిరి "దేవా! యీ క్రతువును, హవ్యంబును, నగ్నియు, మంత్రంబులును, సమిద్దర్భాపాత్రంబులును, సదస్యులును, ఋత్విక్కులును, దంపతులును, దేవతలును, నగ్నిహోత్రంబులును, స్వధయు, సోమంబును, నాజ్యంబును, బశువును నీవ; నీవు దొల్లి వేదమయ సూకరాకారంబు ధరియించి దంష్ట్రాదండంబున వారణేంద్రంబు నళినంబు ధరియించు చందంబున రసాతలగత యైన భూమి నెత్తితి; వట్టి యోగిజనస్తుత్యుండవును, యజ్ఞక్రతురూపకుండవును నైన నీవు పరిభ్రష్టకర్ములమై యాకాంక్షించు మాకుం బ్రసన్నుండ వగుము; భవదీయ నామకీర్తనంబుల సకల యజ్ఞ విఘ్నంబులు నాశంబునొందు; నట్టి నీకు నమస్కరింతుము."

టీకా:

బ్రాహ్మణ = బ్రాహ్మణులు యైన; జనులు = వారు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి; దేవా = భగవంతుడ; ఈ = ఈ; క్రతువును = యజ్ఞమును; హవ్యంబును = హవ్యము; అగ్నియు = అగ్ని; మంత్రంబులును = మంత్రములు; సమ = చక్కటి; ఇద్ధ = ప్రసిద్దమైన; దర్భా = దర్భలు; పాత్రంబులును = పాత్రలును; సదస్యులును = సదస్యులును; ఋత్విక్కులును = ఋత్విక్కులు; దంపతులును = యజమాన దంపతులు; దేవతలును = దేవతలు; అగ్నిహోత్రంబులును = అగ్నిహోత్రములు; స్వధయు = స్వధ {స్వధ - తనను తాను ధరించి పోషించునది, పితృదేవతల ఆహారము}; సోమంబును = సోమరసము; ఆజ్యంబును = నెయ్యి; పశువును = బలిపశువు; నీవ = నీవే; నీవు = నీవు; తొల్లి = పూర్వము; వేద = వేదముతో; మయ = నిండిన; సూకర = వరాహ; ఆకారంబు = రూపము; ధరియించి = ధరించి; దంష్ట్రా = కోరలు అనెడి; దండంబునన్ = కోలతో; వారణ = ఏనుగులలో; ఇంద్రంబున్ = శ్రేష్ఠమైనది; నళినంబున్ = తామరపూలను; ధరియించు = ధరించు; చందంబునన్ = విధముగ; రసాతల = రసాతలము, పాతాళము నకు; గత = పోయినది; ఐన = అయిన; భూమిని = భూమిని; ఎత్తితివి = ఎత్తావు; అట్టి = అటువంటి; యోగి = యోగులైన; జన = వారిచేత; స్తుత్యుండవును = స్తుతింపబడువాడవు; యజ్ఞ = యజ్ఞము యందలి; క్రతు = కర్మముల; రూపుండవు = రూపము కలవాడవు; ఐన = అయిన; నీవు = నీవు; పరిభ్రష్ట = మిక్కిలి చెడ్డ; కర్ములము = పనులు చేయువారము; ఐ = అయ్యి; ఆకాంక్షించు = కోరుతున్న; మాకున్ = మాకు; ప్రసన్నుండవు = దయ కలవాడవు; అగుము = అగుము; భవదీయ = నీ యొక్క; నామ = నామములను; సంకీర్తనంబులన్ = చక్కగా కీర్తించుటవలన; సకల = సమస్తమైన; యజ్ఞ = యజ్ఞము యొక్క; విఘ్నంబులు = ఆటంకములు; నాశంబున్ = నాశనమును; ఒందున్ = పొందును; అట్టి = అటువంటి; నీకున్ = నీకు; నమస్కరింతుము = నమస్కరించెదము.

భావము:

బ్రాహ్మణులు ఇలా అన్నారు. “దేవా! ఈ యజ్ఞం, ఇందులోని హవ్యం, అగ్ని, మంత్రాలు, సమిధలు, దర్భలు, పాత్రలు, సదస్యులు, ఋత్విక్కులు, దంపతులు, దేవతలు, అగ్నిహోత్రాలు, స్వధ, సోమరసం, నెయ్యి, యజ్ఞపశువు - అన్నీ నీవే. నీవు పూర్వం వేదస్వరూపమైన ఆదివరాహరూపం ధరించి, ఏనుగు తన దంతంతో పద్మాన్ని పైకి ఎత్తినట్లు నీ కోరకొనతో పాతాళంనుండి భూమిని పైకి లేవనెత్తావు. యోగులు నిన్ను స్తుతిస్తారు. నీవు యజ్ఞస్వరూపుడవు. వేదకర్మలు ఆచరింపక భ్రష్టులమైన మాపై దయ చూపు. నీ నామాన్ని సంస్తుతిస్తే యజ్ఞాలలో సంప్రాప్తించే సమస్త విఘ్నాలు సమసిపోతాయి. అటువంటి నీకు నమస్కరిస్తున్నాము.