పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : శివుం డనుగ్రహించుట

  •  
  •  
  •  

4-152-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని చతురాననుండు వినయంబున వేఁడిన నిందుమౌళి స
య్యనఁ బరితుష్టిఁ బొంది దరహాసము మోమునఁ దొంగలింప ని
ట్లను "హరిమాయచేత ననయంబును బామరు లైనవారు చే
సి యపరాధ దోషములు చిత్తములో గణియింప నెన్నఁడున్.

టీకా:

అని = అని; చతురాననుండు = బ్రహ్మదేవుడు {చతురాననుడు - చతుర (నాలుగు, 4) ఆననుడు (ముఖములు కలవాడు), బ్రహ్మదేవుడు}; వినయంబునన్ = వినయముగ; వేడినన్ = వేడికొనగ; ఇందుమౌళి = శివుడు {ఇందు మౌళి - ఇందు (చంద్రుడు)ని మౌళి (సిగ)లో కలవాడు, శివుడు}; సయ్యన = గబుక్కున; పరితుష్టి = సంతుష్టి; పొంది = పొంది; దరహాసము = చిరునవ్వు; మోమున = ముఖమున; తొంగిలింపన్ = తొంగిచూడగ; ఇట్లు = ఈ విధముగ; అను = అనెను; హరి = విష్ణువు యొక్క; మాయ = మాయ; చేతన్ = వలన; అనయంబున్ = అవశ్యము; పామరులు = పామరులు; ఐన = అయిన; వారు = వారు; చేసిన = చేసిన; అపరాధ = తప్పులు; దోషములు = పాపములు; చిత్తము = మనసు; లోన్ = లో; గణియింపన్ = ఎంచను; ఎన్నడును = ఎప్పుడును.

భావము:

అని బ్రహ్మదేవుడు వినయంతో వేడుకొనగా శివుడు వెంటనే తృప్తిపడి చిరునవ్వుతో దయతో ఇలా అన్నాడు. ‘విష్ణుమాయకు వశులై పామరులు చేసిన దోషాలను నేను మనస్సులో ఎప్పుడూ లెక్కచేయను.