పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : శివుం డనుగ్రహించుట

  •  
  •  
  •  

4-151-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అది గావున యజ్ఞభాగార్హుండ వయిన నీకు సవనభాగంబు సమర్పింపని కతన నీచేత విధ్వంస్తంబయి పరిసమాప్తి నొందని దక్షాధ్వరంబు మరల నుద్ధరించి దక్షునిఁ బునర్జీవితుం జేయుము; భగుని నేత్రంబులును, భృగుముని శ్మశ్రువులును, బూషుని దంతంబులును, గృపఁజేయుము; భగ్నాంగు లయిన దేవ ఋత్విఙ్నికాయంబులకు నారోగ్యంబు గావింపుము; ఈ మఖావశిష్టంబు యజ్ఞ పరిపూర్తి హేతుభూతం బయిన భవదీయభాగం బగుం గాక."

టీకా:

అదిగావున = ఆకారణముచేత; యజ్ఞ = యజ్ఞములందలి హవ్యములలో; భాగ = భాగమునకు; అర్హుండవు = అర్హత కలవాడవు; అయిన = అయిన; నీకు = నీకు; సవన = యజ్ఞములందలి హవ్యములలో; భాగంబున్ = భాగమును; సమర్పింపని = ఇవ్వని; కతన = కారణమువలన; నీ = నీ; చేతన్ = చేత; విధ్వస్తంబు = విధ్వంసము చేయబడిన; పరిసమాప్తి = పూర్తి; ఒందని = పొందని; దక్ష = దక్షుని; అధ్వరంబున్ = యజ్ఞమును; మరలన్ = మళ్ళీ; ఉద్దరించి = ఉద్ధరించి; దక్షునిన్ = దక్షుని; పునర్జీవుతున్ = మరల జీవించువానిగ; చేయుము = చేయుము; భగుని = భగుని యొక్క; నేత్రంబులును = కన్నులు; భృగుముని = భృగుముని యొక్క; శ్మశ్రువులును = మీసములు; పూషుని = పూషుని; దంతంబులును = పండ్లు; కృపజేయుము = దయచేయుము; భగ్నాంగులు = విరిగిన అవయవములు కలవారు; అయిన = అయిన; దేవ = దేవతలు; ఋత్విక్ = ఋత్విక్కులు; నికాయంబుల = సమూహముల; కున్ = కు; ఆరోగ్యంబున్ = ఆరోగ్యమును; కావింపుము = కలిగించుము; ఈ = ఈ; మఖ = యజ్ఞము యొక్క; అవశిష్టంబు = మిగిలిన భాగము; యజ్ఞ = యజ్ఞము; పరిపూర్తి = సంపూర్తికి; హేతు = కారణ; భూతంబున్ = భూతము; అయిన = అయిన; భవదీయ = నీ యొక్క; భాగంబున్ = భాగము; అగుంగాక = అవుగాక.

భావము:

అందువల్ల యజ్ఞభాగానికి అర్హుడవైన నీకు యజ్ఞభాగాన్ని ఇవ్వకపోవడం వల్ల నీవు దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేశావు. అది అసంపూర్ణంగా మధ్యలో ఆగిపోయింది. అటువంటి దక్షయజ్ఞాన్ని నీవు పునరుద్ధరించు. దక్షుని బ్రతికించు. భగునికి కన్నులను, భృగుమహర్షికి మీసాలను, పూషునికి దంతాలను అనుగ్రహించు. అవయవాలు తుత్తునియలైన దేవతలకు, ఋత్విక్కులకు ఆరోగ్యం ప్రసాదించు. మిగిలిన యజ్ఞకార్యం సమస్తం పూర్తి కావించి ఈ యాగాన్ని నీ భాగంగా స్వీకరించు.”