పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : శివుం డనుగ్రహించుట

  •  
  •  
  •  

4-148-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్లగుటం దత్కర్మంబు లొకానొకనికి విపర్యాసంబు నొందుటకుఁ గారణం బెయ్యదియో? భవదీయ రోషంబు హేతువని తలంచితినేనిఁ ద్వదీయ పాదారవింద నిహిత చిత్తులై సమస్తభూతంబుల యందు నినుం గనుంగొనుచు భూతంబుల నాత్మయందు వేఱుగాఁ జూడక వర్తించు మహాత్ముల యందు నజ్ఞులైనవారి యందుఁబోలె రోషంబు దఱచు వొరయ దఁట; నీకుఁ గ్రోధంబు గలదే?" యని.

టీకా:

అట్లు = ఆవిధముగ; అగుటన్ = అవుట; చేసి = వలన; తత్ = ఆ; కర్మంబులు = పనులు; ఒకానొకనికి = ఏవరో ఒకనికి; విపర్యాయంబు = వ్యత్యాసము; ఒందుట = కలుగుట; కున్ = కి; కారణంబున్ = హేతువు; ఎయ్యదియో = ఏదో; భవదీయ = నీ యొక్క; రోషంబు = కోపము; హేతువు = కారణము; అని = అని; తలంచితిన్ = అనుకొందము; ఏనిన్ = అంటే; త్వదీయ = నీ యొక్క; పాద = పాదములు అనెడి; అరవింద = పద్మములందు; నిహిత = లగ్నమైన; చిత్తులు = మనసులు కలవారు; ఐ = అయ్యి; సమస్త = సమస్తమైన; భూతంబుల = భూతముల; అందున్ = లోను; నినున్ = నిన్నే; కనుంగొనుచున్ = దర్శిస్తూ; భూతంబులన్ = భూతములను; ఆత్మ = తమ; అందున్ = లో; వేఱు = వేరు; కాన్ = అగునట్లు; చూడక = చూడకుండగ; వర్తించు = ప్రవర్తించు; మహాత్ముల = గొప్పవారి; అదున్ = లో; అజ్ఞులు = జ్ఞానము లేనివారు; ఐన = అయిన; వారిన్ = వారి; అందున్ = లో; పోలెన్ = వలె; రోషంబున్ = కోపము; తఱచు = తరచుగా; ఒరయదట = కలుగదట; నీకున్ = నీకు; క్రోధంబున్ = కోపము; కలదే = ఉందా ఏమి; అని = అని.

భావము:

అయినప్పుడు ఒకరి విషయంలో ఆ కర్మలు తల్లక్రిందులుగా కావటానికి నీ కోపం కారణం అని అనుకుందామా? నీ పాదపద్మాలపై మనస్సు నిల్పి సమస్త ప్రాణులలోను నిన్ను చూస్తూ ఇతర ప్రాణులను తనకంటే వేరుగా ఉండకుండా మహాత్ములు ప్రవర్తిస్తారు. అటువంటి మహాత్ములకు మూర్ఖులకు కలిగినట్లు కోపం కలుగదు కదా! మహానుభావుడవైన నీకు కోపం ఎక్కడిది?