పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : శివుం డనుగ్రహించుట

  •  
  •  
  •  

4-135-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అది మఱియును, మందార పారిజాత సరళ తమాల సాల తాల తక్కోల కోవిదార శిరీ షార్జున చూత కదంబ నీప నాగ పున్నాగ చంపక పాట లాశోక వకుళ కుంద కురవక కన కామ్ర శతపత్ర కింశు కైలా లవంగ మాలతీ మధూక మల్లికా పనస మాధవీ కుట జోదుంబు రాశ్వత్థ ప్లక్ష వట హింగుళ భూర్జ పూగ జంబూ ఖర్జూ రామ్రాతక ప్రియాళు నారికే ళేంగుద వేణు కీచక ముఖర తరు శోభితంబును, కలకంఠ కాలకంఠ కలవింక రాజకీర మత్తమధుకర నానా విహంగ కోలాహల నినద బధిరీభూత రోదోంతరాళంబును, సింహ తరక్షు శల్య గవయ శరభ శాఖామృగ వరాహ వ్యాఘ్ర కుర్కుర రురు మహిష వృక సారంగ ప్రముఖ వన్యసత్త్వ సమాశ్రయ విరాజితంబును, కదళీషండ మండిత కమల కహ్లార కైరవ కలిత పులినతల లలిత కమలాకర విహరమాణ కలహంస కారండవ సారస చక్రవాక బక జలకుక్కుటాది జలవిహంగకుల కూజిత సంకులంబును, సలిలకేళీవిహరమాణ సతీరమణీ రమణీయ కుచమండల విలిప్త మృగమద మిళిత హరిచందన గంధ సుగంధి జలపూరిత గంగాతరంగణీ సమావృతంబును నైన కైలాసపర్వతంబు వొడగని, యరవిందసంభవ పురందరాది దేవగణంబు లత్యద్భుతానందంబులం బొంది ముందటఁ దార హీర హేమమయ విమాన సంకులంబును, పుణ్యజన మానినీ శోభితంబును నైన యలకాపురంబు గడచి; తత్పుర బాహ్యప్రదేశంబునం దీర్థపాదుండైన పుండరీకాక్షు పాదారవిందరజః పావనంబును, రతికేళీ వ్యాసంగ పరిశ్రమ నివారక సలిల కేళీవిలోల దేవకామినీ పీనవక్షోజ విలిప్త కుంకుమపంక సంగత పిశంగవర్ణ వారిపూర విలసితంబు నునై; నందాలకనందాభిధానంబులు గల నదీ ద్వితయంబు దాఁటి తత్పురోభాగంబున వనగజ సంఘృష్ట మలయజ పరిమిళిత మలయపవ నాస్వాదన ముహుర్ముహురు న్ముదిత మానస పుణ్యజనకామినీ కదంబంబును, వైదూర్య సోపాన సమంచిత కనకోత్పల వాపీ విభాసితంబును, గింపురుష సంచార యోగ్యంబును నగు సౌగంధిక వన సమీపంబు నందు.
కైలాస పర్వత వర్ణన ::: 45 రకాల చెట్లు, 11 రకాల పక్షులు, 13 రకాల జంతువులు, 3 రకాల పువ్వులు

టీకా:

అది = అది; మఱియును = ఇంకను; మందార = మందారచెట్లు; పారిజాత = పారిజాతవృక్షములు; సరళ = తెల్లతెగడచెట్లు; తమాల = కానుగచెట్లు; సాల = మద్దిచెట్లు; తాల = తాడిచెట్లు; తక్కోల = తక్కోలచెట్లు; కోవిదార = ఎఱ్ఱకాంచనచెట్లు; శిరీష = శిరీషపూలచెట్లు; అర్జున = తెల్లమద్ధిచెట్లు; చూత = తియ్యమామిడిచెట్లు; కదంబ = కడిమిచెట్లు; నీప = మంకెన, కడిమి చెట్లు; నాగ = నాగమల్లి, సర్పగంధి చెట్లు; పున్నాగ = సురపొన్న చెట్లు; చంపక = సంపెంగ చెట్లు; పాటల = కలిగొట్టు చెట్లు; అశోక = అశోకవృక్షములు; వకుళ = పొగడచెట్లు; కుంద = మొల్ల; కురవక = ఎఱ్ఱగోరింట చెట్లు; కనకామ్ర = కనకాంబరము చెట్లు; శతపత్ర = తామర; కింశుక = మోదుగ చెట్లు; ఏలా = ఏలక్కాయ చెట్లు; లవంగ = లవంగచెట్లు; మాలతీ = జాజి; మధూక = ఇప్పచెట్లు; మల్లికా = మల్లెచెట్లు; పనస = పనసచెట్లు; మాధవీ = మాదీఫలచెట్లు, పూలగురివింద; కుటజ = కొండమల్లి; ఉదుంబర = అత్తి, మేడిచెట్టు; అశ్వత్థ = రావిచెట్టు; ప్లక్ష = జువ్విచెట్లు; వట = మఱ్ఱి చెట్లు; హింగుళ = ఇంగువ చెట్లు; భూర్జ = బూజపత్త్ర, కాగితపు చెట్లు; పూగ = పోకచెట్లు; జంబూ = నేరేడుచెట్లు; ఖర్జూర = ఖర్జూర, రాజపూగచెట్లు; ప్రియాళు = మోరటిచెట్లు; నారికేళ = కొబ్బరిచెట్లు; ఇంగుద = అందుగచెట్లు; వేణు = గారివెదురు; కీచక = బొంగువెదురుచెట్లు; ముఖర = మొదలైన; తరు = చెట్లతో; శోభితంబును = శోభిల్లుతున్నది; కలకంఠ = కోకిలలు; కాలకంఠ = నెమళ్ళు; కలవింక = పావురములు; రాజకీర = రామచిలుకలు; మత్తమధుకర = మదించిన తుమ్మెదలు; నానావిధ = రకరకముల; విహంగ = పక్షుల; కోలాహల = కోలాహలము; నినద = అరుపులతో; బధిరీ = చెవుడు; భూత = కలిగిస్తున్న; రోదస్ = ఆకాశ; అంతరాళంబును = అంతయును {అంతరాళము - ఎల్లదిక్కులకు నడిమి చోటు}; సింహ = సింహములు; తరక్షు = సివంగి; శల్య = ముళ్ళపందులు; గవయ = అడవిదున్నలు; శరభ = శరభమ-గములు; శాఖామృగ = కోతులు; వరాహ = అడవిపందులు; వ్యాఘ్ర = పెద్దపులులు; కుర్కుర = కుక్కలు; రురు = నల్లచారల దుప్పులు; మహిష = అడవిదున్నలు, ఎనుబోతులు; వృక = తోడేళ్ళు; సారంగ = లేళ్ళు; ప్రముఖ = మొదలైన ప్రసిద్ధమైన; వన్య = అడవి; సత్త్వ = జంతువులకు; సమ = చక్కటి; ఆశ్రయ = ఆశ్రయముగా; విరాజితంబును = విరాజిల్లుతున్నదియును; కదళీ = అరటి; షండ = తోపుల, సమూహములతో; మండిత = అలంకృతమైన; కమల = పద్మములు, తామరపూలు; కహ్లార = తెల్లకలువలు; కైరవ = ఎఱ్ఱకలువలు; కలిత = కూడిన; పులిన = ఇసుక; తల = ప్రదేశములు; లలిత = అందమైన; కమలాకర = సరోవరములు; విహరమాణ = ఎగురుతున్న; కలహంస = రాయంచ; కారండవ = కొక్కిరాలు; సారస = బెగ్గురుపక్షలు; చక్ర = చక్రవాకపక్షులు; బక = కొంగలు; జలకుక్కుట = నీటికోళ్ళు; ఆది = మొదలైన; జలవిహంగ = నీటిపక్షుల; కుల = సమూహముల; కూజిత = కూతలతో; సంకులంబును = కలగలపులుకలదియును; సలిల = జల; కేళీ = క్రీడలలో; విహరమాణ = విహరించుటచేత; సతీరమణీ = అందమైనస్త్రీల, సతీదేవి; రమణీయ = అందమైన; కుచమండల = స్థనప్రదేశముల; విలిప్త = చక్కగా అలదుకొన్న; మృగమద = కస్తూరి; మిళిత = కలిసిన; హరిచందన = గంధము; గంధ = సువాసనతో కూడిన; సుగంధి = పరిమళపు; జల = నీటితో; పూరిత = నిండిన; గంగా = గంగ అనెడి; తరంగిణీ = నదిచేత; సమ = చక్కగా; ఆవృతంబును = అవరింపబడినదియును; ఐన = అయిన; కైలాసపర్వతంబున్ = కైలాసపర్వతమును; పొడగని = గుర్తుపట్టి; అరవిందసంభవ = బ్రహ్మదేవుడు; పురందర = ఇంద్రుడు; ఆది = మొదలైన; దేవ = దేవతల; గణంబులు = సమూహములు; అతి = మిక్కిలి; అద్భుత = అద్భుతము; ఆనందంబులన్ = ఆనందములను; పొంది = పొంది; ముందటన్ = ఎదురుగ; తార = తారకలు; హీర = మంచు; హేమ = బంగారము; మయ = తోకూడిన; విమాన = విమానములతో; సంకులంబును = కలిగి యున్నదియును; పుణ్యజన = రాక్షస; మానినీ = స్త్రీలతో; శోభితంబును = శోభిల్లుతున్నది; ఐన = అయిన; అలకాపురంబున్ = అలకాపురమును; కడచి = దాటి; తత్ = ఆ; పుర = పట్టణము; బాహ్య = వెలుపలి; ప్రదేశంబునన్ = ప్రదేశములో; తీర్థపాదుండు = పాదములు అందు పుణ్యనది (గంగానది) కలవాడు; ఐన = అయిన; పుండరీకాక్షు = విష్ణుమూర్తి {పుండరీ కాక్షుడు - పుడరీకములు (పద్మములు) వంటి కన్నులు కలవాడు, నారాయణుడు}; పాద = పాదములు అనెడి; అరవింద = పద్మముల యొక్క; రజస్ = ధూళిచేత; పావనంబును = పవిత్రమైనదియును; రతి = శృంగార; కేళీ = క్రీడలలో; వ్యాసంగ = మునిగితేలుట వలని; పరిశ్రమ = అలసటను; నివారక = పోగొట్టునట్టి; సలిల = జల; కేళీ = క్రీడలందు; విలోల = విహరిస్తున్న; దేవ = దేవతా; కామినీ = స్త్రీల; పీన = బలమైన; వక్షోజ = కుచములందు; విలిప్త = చక్కగ పులిమిన; కుంకుమ = కుంకుమ; పంక = ముద్ద; సంగత = కూడిన; పిశంగ = గోరోజనము; వర్ణ = రంగు; వారి = నీటితో; పూర = నిండి; విలసితంబును = విలసిల్లుతున్నవియును; ఐ = అయ్యి; నంద = నంద; అలకనంద = అలకనంద అనెడి; అభిధానంబులు = పేర్లు; కల = కలిగినట్టి; నదీ = నదుల; ద్వితయంబు = యుగళము, రెంటిని; దాటి = దాటి; తత్ = వాటి; పురః = ముందు; భాగంబున = భాగములో; వన = అడవి; గజ = ఏనుగులచే; సంఘృష్ట = మిక్కిలి ఒరసుకొనబడుట వలని; మలయజ = మంచిగంధము; పరిమిళిత = చక్కగా కలిసిన; మలయ = వీచు; పవన = గాలిని; ఆస్వాదన = ఆస్వాదించుటచే; ముహుర్ముహుర్ = మళ్ళీ మళ్ళీ; ముదిత = సంతోషిస్తున్న; మానస = మనసులు కలిగిన; పుణ్యజన = రాక్షస; కామినీ = స్త్రీల; కదంబంబును = గుంపులు కలిగినదియును; వైదూర్య = పచ్చలు పొదిగిన; సోపాన = మెట్లుతో; సమ = చక్కగ; అంచిత = అలంకరించబడిన; కనక = బంగారపురంగు; ఉత్పల = కలువపూలు కలిగిన; వాపీ = బావులతోను; విభాసితంబును = విలసిల్లుతున్నది; కిపురుష = కింపురుషులతో; సంచార = విహారమునకు; యోగ్యంబును = తగినది; అగు = అయిన; సౌగంధిక = సౌగంధికము అనెడి; వన = వనము; సమీపంబున్ = దగ్గర; అందు = లో.

భావము:

ఇంకా ఆ వెండికొండ మందారం, పారిజాతం, తెల్లతెగడ, కానుగు, మద్ది, తాడి, తక్కోలం, ఎఱ్ఱకాంచనం, దిరిసెనం, తెల్లమద్ది, తియ్యమామిడి, కడిమి, మంకెన, నాగవల్లి, సురపొన్న, సంపెంగ, కలిగొట్టు, అశోకం, పొగడ, మొల్ల, ఎఱ్ఱగోరింట, కనకాంబరం, తామర, మోదుగ, ఏలకి, లవంగం, జాజి, ఇప్ప, మల్లె, పనస, పూల గురివెంద, కొండమల్లె, మేడి, రావి, జువ్వి, మఱ్ఱి, ఇంగువ, బుజపత్తిరి, పోక, రాజపూగం, నేరేడు, ఖర్జూరం, ఆమ్రాతకం, మోరటి, కొబ్బరి, అందుగ, గారవెదురు, బొంగువెదురు మొదలైన చెట్లతో శోభిల్లుతున్నది. కోయిలలు, నెమళ్ళు, పావురములు, రామచిలుకలు, గండుతుమ్మెదలు, మొదలైన రకరకాల పక్షుల కలకలంతో భూమ్యాకాశాల మధ్యప్రదేశం ప్రతిధ్వనిస్తున్నది. సింహాలు, సివంగులు, ముళ్ళపందులు, అడవిదున్నలు, శరభమృగాలు, కోతులు, అడవిపందులు, పెద్దపులులు, కుక్కలు, నల్లచారల దుప్పులు, ఎనుబోతులు, తోడేళ్ళు, లేళ్ళు మొదలైన గొప్ప అడవి జంతువులకు ఆశ్రయంగా ఉన్నది. అరటితోపులతోను, తామరపూలతోను, తెల్లకలువలతోను, ఎఱ్ఱకలువలతోను కూడిన ఇసుక ప్రదేశాలతో అందంగా ఉన్న సరోవరాలలో విహరిస్తున్న రాజహంసలు, కొక్కిరాళ్ళు, బెగ్గురుపక్షులు, జక్కవలు, కొంగలు, నీటికోళ్ళు మొదలైన నీటిపక్షుల కూతలతో కలకలంగా ఉంది. జలక్రీడలతో విహరిస్తున్న అందమైన స్త్రీల చనుదోయికి అలదుకొన్న కస్తూరి కలిపిన మంచిగంధపు సువాసనలు కలిగిన గంగానది చేత ఆవరింపబడి ఉన్నది. అటువంటి కైలాసపర్వతాన్ని చూచి బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలందరు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని పొంది, ఎదురుగా అలకాపురాన్ని చూచారు. అది చుక్కలతో, మంచుతో, బంగారంతో కూడిన విమానాలతో, పుణ్యస్త్రీ సమూహంతో శోభిల్లుతున్నది. ఆ నగరం వెలుపల పూజ్యపాదుడైన విష్ణువు యొక్క పాదపద్మాల ధూళిచేత పవిత్రమై, రతికేళిచేత కలిగిన శ్రమను తొలగించే జలక్రీడలో మునిగిన దేవతాస్త్రీల ఎత్తైన స్తనాలకు అలదుకున్న కుంకుమతో కూడిన గోరోజనం రంగును పొందిన నంద, అలకనంద అనే రెండు నదులున్నాయి. వాటిని దాటి ఎదుట సౌగంధికవనాన్ని చూశారు. ఆ వనంలో ఏనుగులు రాచుకొనడం వల్ల మంచి గంధపుచెట్లనుండి వెలువడే సువాసనలతో కలిసిన గాలిని ఆస్వాదిస్తూ యక్షకన్యలు మాటిమాటికి సంతోషిస్తున్నారు. పచ్చలు పొదిగిన మెట్లు కల దిగుడు బావుల్లో బంగారు కలువలు ప్రకాశిస్తున్నాయి. కింపురుషులు సంచరించడానికి అనువైన ఆ సౌగంధికవనంలో...