పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట

  •  
  •  
  •  

4-104-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు దక్షిణాగ్ని యందు వేల్చిన నందుఁ దపం బొనర్చి సోమలోకంబున నుండు సహస్ర సంఖ్యలు గల 'ఋభు' నామధేయు లైన దేవత లుదయించి బ్రహ్మతేజంబునం జేసి దివ్య విమానులై యుల్ముకంబులు సాధనంబులుగా ధరియించి రుద్రపార్షదులయిన 'ప్రమథ' 'గుహ్యక' గణంబులఁ బాఱందోలిన వారును బరాజితులైరి; తదనంతరంబ నారదు వలన నభవుండు దండ్రిచే నసత్కృతురా లగుటం జేసి భవాని పంచత్వంబునొందుటయుం 'బ్రమథగణంబులు' 'ఋభునామక దేవతల'చేఁ బరాజితు లగుటయు విని.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; దక్షిణాగ్ని = దక్షిణాగ్ని {త్రేతాగ్నులు - 1గార్హపత్యాగ్ని 2ఆహవనీయాగ్ని 3దక్షిణాగ్ని}; అందు = లో; వేల్చినన్ = హోమము చేయగ; అందున్ = దానిలో; తపంబు = తపించుట; ఒనర్చి = చేసి; సోమలోకంబునన్ = సోమలోకమున {సోమలోకము - సోములు అనెడి గంధర్వుల లోకము}; ఉండు = ఉండెడి; సహస్ర = వేల; సంఖ్యలు = కొలది; కల = ఉన్న; ఋభు = ఋభువులు అనెడి {ఋభువులు - ఋతువులకు సంబంధించిన దేవతలు}; నామ = పేరు కలిగినవారు; ఐన = అయిన; దేవతలు = దేవతలు; ఉదయించి = పుట్టి; బ్రహ్మతేజంబునన్ = బ్రాహ్మణతేజస్సు; చేసి = వలన; దివ్య = దివ్యమైన; విమానులు = విమానమెక్కినవారు, విశిష్ట మానములు కలవారు; ఐ = అయ్యి; ఉల్ముకంబులు = మండుతున్న కొరివిలను; సాధనంబులు = ఆయుధములు; కాన్ = అగునట్లు; ధరియించి = ధరించి; రుద్ర = శివుని; పార్షదులు = అనుచరులు; అయిన = అయిన; ప్రమథ = ప్రమథుల; గుహ్యక = గుహ్యకులను యక్షులు; గణంబులన్ = సమూహములను; పాఱందోలిన = పారదోలిన, తరిమేసిన; వారును = వారుకూడ; పరాజితులు = ఓడినవారు; ఐరి = అయిరి; తదనంతరంబ = తరువాత; నారదు = నారదుని; వలనన్ = ద్వారా; అభవుండు = శివుడు {అభవుడు - పుట్టుక లేనివాడు, శివుడు}; తండ్రి = తండ్రి (దక్షుడు); చేన్ = చేత; అసత్ కృతురాలు = చెడు మర్యాదలు పొందినామె; అగుటన్ = అగుట; చేసి = వలన; భవాని = సతీదేవి; పంచత్వంబున్ = మరణము {పంచత్వంబు - పంచతత్వములను భూతములను చెందుట, మరణము}; ఒందుటయున్ = పొందుట; ప్రమథగణంబులు = ప్రమథగణములు; ఋభు = ఋభువులు అనెడి; నామకః = పేరు కలిగిన; దేవతల = దేవతల; చేతన్ = వలన; పరాజితులు = ఓడినవారు; అగుటయున్ = అగుట; విని = విని.

భావము:

ఈ విధంగా భృగువు దక్షిణాగ్నిలో వ్రేల్వగా తపస్సు చేసి సోమలోకాన్ని పొందిన ఋభువులు అనే దేవతలు వేలకొలదిగా పుట్టి, బ్రహ్మతేజస్సుతో దివ్యవిమానా లెక్కి, మండుతున్న కొరవులు ఆయుధాలుగా ధరించి, రుద్రుని అనుచరులైన ప్రమథులను, గుహ్యకులను తరిమివేశారు. ఆ తరువాత తండ్రిచేత అవమానింపబడి భవాని మరణించిందని, ప్రమథాదులు ఋభువులచేత ఓడిపోయారని నారదుని వలన శివుడు విన్నాడు.