పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ఈశ్వర దక్షుల విరోధము

  •  
  •  
  •  

4-54-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“అంత శ్వశురుండగు దక్షునకు జామాత యైన భర్గునకు నన్యోన్య విరోధంబు పెరుఁగుచుండ నతిచిరంబగు కాలం బరిగె; నంత దక్షుండు రుద్రవిహీనంబగు యాగంబు లేనిది యైనను శర్వుతోడి పూర్వ విరోధంబునను బరమేష్ఠి కృతంబైన సకల ప్రజాపతి విభుత్వగర్వంబు ననుం జేసి బ్రహ్మనిష్ఠులగు నీశ్వరాదుల ధిక్కరించి యరుద్రకంబుగా వాజపేయ సవనంబు గావించి తదనంతరంబ బృహస్పతిసవన నామకం బైన మఖంబు చేయ నుపక్రమించిన నచ్చటికిం గ్రమంబున.

టీకా:

అంత = అంతట; శ్వశురుండు = మామ, భార్యతండ్రి; దక్షున్ = దక్షుని; కున్ = కి; జామాత = అల్లుడు; ఐన = అయినట్టి; భర్గున్ = శివుని; కున్ = కిని; అన్యోన్య = వారిలోవారికి, మధ్యన; విరోధంబున్ = శత్రుత్వము; పెరుగుచున్ = ఎక్కువవుతూ; ఉండన్ = ఉండగా; అతి = మిక్కిలి; చిరంబు = ఎక్కువైనది; అగు = అయినట్టి; కాలంబున్ = కాలము; అరిగెన్ = గడచెను; అంత = అంతట; దక్షుండు = దక్షుడు; రుద్ర = శివుడు {రుద్రుడు - మిక్కిలి కోపిష్టి, శివుడు}; విహీనంబున్ = లేనిది; అగు = అయినట్టి; యాగంబున్ = యజ్ఞము; లేనిది = లేనిది; ఐనను = అయినను; శర్వు = శివుని; తోడి = తోటి; పూర్వ = పూర్వపు; విరోధంబునన్ = శత్రుత్వముచేతను; పరమేష్ఠి = బ్రహ్మదేవుడు {పరమేష్ఠి - అత్యున్నతమైన స్థానమున ఉండువాడు, బ్రహ్మదేవుడు}; కృతంబున = నియమింపబడుటచే; ఐన = అయిన; సకల = సమస్తమైన; ప్రజాపతి = ప్రజాపతులపైన; విభుత్వ = విభుడిగానుండు యధికారపు; గర్వంబున్ = గర్వము; జేసి = వలన; బ్రహ్మనిష్ఠులు = వేదములందు నిష్ఠకలవారు; అగు = అయిన; ఈశ్వర = శివుడు {ఈశ్వరుడు - ఈశత్వము ప్రభుత్వము కలవాడు, శివుడు}; ఆదులన్ = మొదలైనవారిని; ధిక్కరించి = కాదని; అరుద్రకంబున్ = రుద్రుడు లేనిది; కాన్ = అగునట్లు; వాజపేయ = వాజపేయము అనెడి {వాజపేయము - ఆహారస్వీకార ప్రథానమైన యాగము}; సవనంబున్ = యజ్ఞమును; కావించి = చేసి; తదనంతరంబ = తరవాత; బృహస్పతిసవన = బృహస్పతము అనెడి {బృహస్పతిసవనము - వాగుచ్ఛారణ ప్రధానమైన యాగము}; నామకంబు = పేరుకలది; ఐన = అయిన; మఖంబున్ = యజ్ఞమును; చేయన్ = చేయుటకు; ఉపక్రమించిన = ప్రారంభించగా; అచ్చటికిన్ = అక్కడకి; క్రమంబునన్ = క్రమముగా.

భావము:

అప్పుడు మామ అయిన దక్షునికి, అల్లుడైన శివునికి పరస్పర వైరం నానాటికీ పెరుగుచుండగా చాలాకాలం గడిచింది. బ్రహ్మ దక్షుణ్ణి ప్రజాపతులందరికీ అధ్యక్షుణ్ణి చేయగా ఆ అధికారగర్వంచేత, పరమేశ్వరునిపై ఉన్న పగచేత దక్షుడు బ్రహ్మవేత్తలను, పరమేశ్వరుణ్ణి ధిక్కరించి, రుద్రహీనమైన వాయపేయం అనే యజ్ఞాన్ని చేసాడు. తరువాత బృహస్పతి సవనం అనే యజ్ఞాన్ని చేయటానికి పూనుకోగా అక్కడికి క్రమంగా....