పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : కర్దమప్రజాపతి వంశాభివృద్ధి

  •  
  •  
  •  

4-26-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వార లెవ్వ రనిన, భగవంతు డగు నుచథ్యుండును బ్రహ్మనిష్ఠుం డగు బృహస్పతియు ననం బ్రసిద్ధి వహించిరి; పులస్త్యుండు హవిర్భుక్కను నిజభార్య యందు నగస్త్యునిం బుట్టించె; నా యగస్త్యుండు జన్మాంతరంబున జఠరాగ్ని రూపంబై ప్రవర్తించె; వెండియు నా పులస్త్యుండు విశ్రవసునిం గలిగించె; ఆ విశ్రవసునకు నిలబిల యను భార్యవలనం గుబేరుండును, గైకసి యను దానివలన రావణ కుంభకర్ణ విభీషణులునుం బుట్టిరి; పులహునకు గతి యను భార్యవలనఁ గర్మశ్రేష్ఠుండును వరీయాంసుండును సహిష్ణుండును నను మువ్వురు గొడుకులు జనియించిరి; మఱియుఁ గ్రతువునకుఁ గ్రియ యను భార్య యందు బ్రహ్మతేజంబున జ్వలించుచున్న షష్టిసహస్ర సంఖ్యలుగల వాలఖిల్యు లను మహర్షులు గలిగిరి; వశిష్ఠుం డూర్జ యను భార్య యందుఁ జిత్రకేతుండును సురోచియు విరజుండును మిత్రుండును నుల్బణుండును వసుభృద్ధ్యానుండును ద్యుమంతుండును నను సప్తఋషులను, భార్యాంతరంబున శక్తి ప్రముఖ పుత్రులనుం బుట్టించె; అథర్వుం డనువానికిఁ జిత్తి యను భార్య యందు ధృతవ్రతుండు నశ్వ శిరస్కుండు నయిన దధ్యంచుండు పుట్టె; మహాత్ముండగు భృగువు ఖ్యాతి యను పత్ని యందు ధాతయు విధాతయు నను పుత్రద్వయంబును, భగవత్పరాయణ యగు "శ్రీ" యను కన్యకం బుట్టించె; ఆ ధాతృవిధాతృలు మేరు వనువాని కూఁతు లైన యాయతి నియతు లను భార్యలవలన మృకండ ప్రాణులను కొడుకులం బుట్టించిరి: అందు మృకండునకు మార్కండేయుండును, బ్రాణునకు వేదశిరుం డను మునియుం బుట్టిరి ;భార్గవునకు నుశన యను కన్యయందుఁ గవి యనువాఁడు పుట్టె; ఇట్లు కర్దమదుహితలయిన కన్యకా నవకంబు వలనఁ గలిగిన సంతాన పరంపరలచేత సమస్తలోకంబులుఁ బరిపూర్ణంబు లయ్యె; అట్టి సద్యః పాపహరంబును శ్రేష్ఠతమంబును నైన కర్దమదౌహిత్రసంతాన ప్రకారంబు శ్రద్ధాగరిష్ఠచిత్తుండ వగు నీకుం జెప్పితి: ఇంక దక్షప్రజాపతి వంశం బెఱింగింతు వినుము.

టీకా:

వారలు = వారు; ఎవ్వరు = ఎవరు; అనినన్ = అంటే; భగవంతుడు = సర్వశక్తులు కలవాడు; అగు = అయిన; ఉచథ్యుండును = ఉచథ్యుడు {ఉచథ్యుడు – ఔచిత్యము గలవాడు}; బ్రహ్మనిష్ఠుండు = బ్రహ్మజ్ఞాననిష్ఠ గలవాడు; అగు = అయిన; బృహస్పతియున్ = బృహస్పతి {బృహస్పతి - బ్రహ్మవిద్యకు అధిపతి}; అనన్ = అని; ప్రసిద్ధివహించిరి = పేరుపొందిరి; పులస్త్యుండు = పులస్త్యుడు; హవిర్భుక్కు = హవిర్భుక్కు {హవిర్భుక్కు - హవిస్సు (హోమద్రవ్యము) భుజించునది, అగ్ని}; అను = అనెడి; నిజ = తన యొక్క; భార్య = భార్య; అందున్ = అందు; అగస్త్యుని = అగస్త్యుని; పుట్టించెన్ = కనెను; ఆ = ఆ; అగస్త్యుండు = అగస్త్యుడు; జన్మ = జన్మము; అంతరంబున = మరియొక దానిలో; జఠరాగ్ని = జఠరాగ్ని {జఠరాగ్ని - కడుపులోని ఆహారమును జీర్ణముచేయు అగ్ని}; రూపంబు = స్వరూపముగ కలవాడు; ఐ = అయ్యి; ప్రవర్తించె = నడచెను; వెండియున్ = ఇంకనూ; ఆ = ఆ; పులస్త్యుండు = పులస్త్యుడు; విశ్రవసునిన్ = విశ్రవసుని; కలిగించెన్ = పుట్టించెను; ఆ = ఆ; విశ్రవసున్ = విశ్రవసుని; కున్ = కు; ఇలబిల = ఇలబిల {ఇలబిల - నాసారంధ్రములు}; అను = అనెడి; భార్య = భార్య; వలనన్ = అందు; కుబేరుండునున్ = కుబేరుడుని {కుబేరుడు – గుహ్యకుల నాయకుడు, గుటకవేయుటకు మ్రింగుటకు నాయకుడు}; కైకసి = కైకసి {కైకసి - కీకసము (కంఠ మందలి స్వరపేటిక) కలది}; అనుదాని = అనెడి ఆమె; వలనన్ = అందు; రావణ = రావణుడు {రావణుడు - రవము కలవాడు}; కుంభకర్ణ = కుంభకర్ణుడు {కుంభకర్ణుడు - కుండలవంటి చెవులు కలవాడు}; విభీషణులునున్ = విభీషణుడును {విభీషణుడు – భయము పోగొట్టువాడు}; పుట్టిరి = జనించిరి; పులహున్ = పులహున; కున్ = కు; గతి = గతి {గతి - గమనము}; అను = అనెడి; భార్య = భార్య; వలనన్ = అందు; కర్మశ్రేష్ఠుండును = కర్మశ్రేష్ఠుడు {కర్మశ్రేష్ఠుడు - కర్మములు (పనిచేయుట) యందు ఉత్తముడు}; వరీయాంసుండును = వరీయాంసుడు {వరీయాంసుడు - కోరదగినవారిలో గొప్పవాడు, సామర్థ్యము గలవాడు}; సహిష్ణుండును = సహిష్ణుడు {సహిష్ణుడు – సహనము కలవాడు}; అను = అనెడి; మువ్వురు = ముగ్గురు; కొడుకులు = తనయులు; జనియించిరి = పుట్టిరి; మఱియున్ = ఇంకను; క్రతువున్ = క్రతువు {క్రతువు - జరపబడు విధానము}; కున్ = కి; క్రియ = క్రియ {క్రియ - జరుపు పని}; అను = అనెడి; భార్య = భార్య; అందు = అందు; బ్రహ్మతేజంబునన్ = బ్రహ్మజ్ఞానమువలని ప్రకాశముతో; జ్వలించుచున్ = వెలిగిపోతున్నట్టి; షష్టిసహస్ర = ఆరువేలు (6000); సంఖ్యలు = లెక్కకు; కల = ఉన్నట్టి; వాలఖిల్యులు = వాలఖిల్యులు {వాలఖిల్యులు - వాలము (తోక) ఖిల్యులు మిగిలినవారు, అంతరిక్షమున సుర్యుని స్తోత్రము చేయుచు తలక్రిందులుగనుండు వారు, అహోరాత్రము అరువది గడియలుగను ఒక్కొక గడియ వేయి వాలఖిల్యములుగను లెక్కించబడును}; అను = అనెడి; మహర్షులు = గొప్పఋషులు; కలిగిరి = పుట్టిరి; వశిష్ఠుండు = వశిష్ఠుడు; ఊర్జ = ఊర్జ {ఊర్జ - కార్తీకమాసము, ఆహారము నుండి పుట్టు బలము}; అను = అనెడి; భార్య = భార్య; అందున్ = అందు; చిత్రకేతుండును = చిత్రకేతుడు {చిత్రకేతుడు - రంగురంగుల కేతనము(జండా) కలవాడు}; సురోచియున్ = సురోచి {సురోచి - సు (మంచి) రోచి (వెలుగు కలవాడు)}; విరజుండును = విరజుడు {విరజుడు - ధూళి అంటనివాడు}; మిత్రుండును = మిత్రుడు {మిత్రుడు - మితి (కొలతలకి) అధిపతి}; ఉల్బణండును = ఉల్బణుడు {ఉల్బణుడు - ఉబ్బిన వాడు}; వసుభృద్ధ్వానుండును = వసుభృద్ధ్వానుడు {వసుభృద్ధ్వానుడు - వసు (సంపదలను) భృత్ (భరించు) ధ్వానుడు (ధ్వానము కలవాడు)}; ద్యుమంతుండును = ద్యుమంతుడు; అను = అనెడి; సప్త = ఏడుగురు; ఋషులను = ఋషులను; భార్య = భార్యా; అంతరంబునన్ = భేదమున; శక్తి = శక్తి; ప్రముఖ = మొదలైన ప్రముఖలగు; పుత్రులన్ = సుతులను; పుట్టించెన్ = కనెను; అథర్వుండు = అథర్వుండు {అథర్వుండు – అథర్వణవేదమున నధికారి, క్రిందనుండువాడు}; అను = అనెడి; వానికి = అతనికి; చిత్తి = చిత్తి {చిత్తి - ద్రవ్యము (పదార్థము)ను కూడబెట్టునది, చిత్తము తానైనది}; అను = అనెడి; భార్య = భార్య; అందున్ = కి; ధృతవ్రతుండున్ = ధృడమైన వ్రతము కలవాడును; అశ్వశిరస్కుండునున్ = గుఱ్ఱపుతల కలవాడు {అశ్వశిరస్కుడు - హయగ్రీవుడు, అశ్వనితో మొదలగు కాలమానవిశేషము}; దధ్యంచుండు = దధ్యంచుడు {దధ్యంచుడు - దధి (పెరుగు) అంచుడు (కారణుడు), దధన (ధీ) శక్తి ఐనవాడు}; పుట్టెన్ = జన్మించెను; మహాత్ముండు = గొప్పవాడు; అగు = అయిన; భృగువు = భృగువు {భృగువు - తెల్లని తేజస్సు}; ఖ్యాతి = ఖ్యాతి {ఖ్యాతి - ప్రసిద్ధి}; అను = అనెడి; పత్ని = భార్య; అందు = తో; ధాతయున్ = ధాత {ధాత - బ్రహ్మ, ధరించువాడు, పగలుకి అధిపతి}; విధాతయున్ = విధాత {విధాత - బ్రహ్మ, మన్మథుడు, రాత్రికి అధిపతి}; అను = అనెడి; పుత్ర = సుతులను; ద్వయంబును = ఇద్దరను; భగవత్పరాయణ = భగవంతుని యందు లగ్నమైనామె; అగు = అయిన; శ్రీ = శ్రీ {శ్రీ - సంపద, భార్గవి (భృగువుసుత)}; అను = అనెడి; కన్యకంబున్ = ఆడపిల్లను; పుట్టించెన్ = పుట్టించెను; ఆ = ఆ; ధాతృ = ధాతయు; విధాతృ = విధాతయు; మేరువు = మేరువు {మేరువు - మేరుపర్వతము, వెన్నుపూస}; అనువాని = అనెడువాని; కూతులు = కుమార్తెలు; ఐన = అయిన; యాయతి = యాయతి; నియతులు = నియతి; అను = అనెడి; భార్యల = భార్యలు; వలనన్ = అందు; మృకండ = మృకండుడు {మృకండుడు - మృకండ (మృత్యువు) కలవాడు}; ప్రాణులున్ = ప్రాణుడు {ప్రాణుడు - ప్రాణము కలవాడు}; అను = అనెడి; కొడుకులన్ = పుత్రులను; పుట్టించిరి = కంటిరి; అందు = వారిలో; మృకండున్ = మృకండున; కున్ = కు; మార్కండేయుండున్ = మార్కండేయుడు {మార్కండేయుడు - మార్కము (మృత్యువు)ను జయించినవాడు}; ప్రాణున్ = ప్రాణుని; కున్ = కి; వేదశిరుండు = వేదశిరుడు {వేదశిరుడు - వేదమునకు శిరస్సు, ఓంకారము}; అను = అనెడి; మునియున్ = ముని; పుట్టిరి = జన్మించిరి; భార్గవున్ = భార్గవుని; కును = కి; ఉశన = ఉశన {ఉశన - వసించుట}; అను = అనెడి; కన్య = స్త్రీ; అందున్ = అందు; కవి = కవి {కవి - రూపములను వ్యాపింపజేయువాడు, ఉశనసుడు, శుక్రుడు}; అను = అనెడి; వాడు = వాడు; పుట్టెన్ = జన్మంచెను; ఇట్లు = ఈ విధముగ; కర్దమ = కర్దముని యొక్క; దుహితలు = పుత్రికలు; అయిన = అయినట్టి; కన్యకా = ఆడబిడ్డల; నవకంబున్ = తొమ్మండుగురు; వలనన్ = అందు; కలిగిన = పుట్టిన; సంతాన = సంతతి; పరంపర = వరసలు; చేత = తో; సమస్త = సమస్తమైన; లోకంబులున్ = లోకములు; పరిపూర్ణంబులు = నిండినవి; అయ్యెన్ = అయినవి; అట్టి = అటువంటి; సద్యఃపాపహరంబును = అప్పుడే పాపమును పోగొట్టునది; శ్రేష్ఠతమంబును = అత్యంత శ్రేష్ఠమైనది {శ్రేష్ఠము - శ్రేష్ఠతరము - శ్రేష్ఠతమము}; ఐన = అయినట్టి; కర్దమ = కర్దముని; దౌహిత్ర = దుహితల (సుతల) యొక్క; సంతాన = సంతతి; ప్రకారము = వృత్తాంతము; శ్రద్ధా = శ్రద్ధచేత; గరిష్ఠ = గొప్పది యైన; చిత్తుండవు = చిత్తము కలవాడవు; అగు = అయిన; నీకున్ = నీకు; చెప్పితిన్ = చెప్పేను; ఇంక = మరి; దక్షప్రజాపతి = దక్షప్రజాపతి; వంశంబున్ = వంశవృత్తాంతమును; ఎఱింగింతున్ = తెలిపెదను; వినుము = వినుము.

భావము:

వా రెవరంటే జ్ఞానవంతుడైన ఉచథ్యుడు, బ్రహ్మణ్యుడైన బృహస్పతి. వారిద్దరూ ఎంతో ప్రసిద్ధులు. పులస్త్యునికి హవిర్భుక్కు అనే భార్యవల్ల అగస్త్యుడు, విశ్రవసుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. ఆ అగస్త్యుడు జన్మాంతరంలో జఠరాగ్ని రూపంలో ప్రవర్తించాడు. విశ్రవసునికి ఇలబిల అనే భార్యవల్ల కుబేరుడు, కైకసి అనే భార్యవల్ల రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు జన్మించారు. పులహునికి గతి అనే భార్యవల్ల కర్మశ్రేష్ఠుడు, వరీయాంసుడు, సహిష్ణుడు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు. క్రతువుకు క్రియ అనే భార్యవల్ల బ్రహ్మతేజస్సుతో సమానులైన వాలఖిల్యులు అనే మహర్షులు కలిగారు. వారు అరవైవేలమంది. వసిష్ఠునికి ఊర్జ అనే భార్యవల్ల చిత్రకేతుడు, సురోచి, విరజుడు, మిత్రుడు, ఉల్బణుడు, వసుభృద్ధ్యానుడు, ద్యుమంతుడు అనే ఏడుగురు ఋషులు జన్మించారు. మరొక భార్యవల్ల శక్తి మొదలైన కొడుకులు కలిగారు. అథర్వునికి చిత్తి అనే భార్యవల్ల ధృతవ్రతుడూ, అశ్వశిరస్కుడూ అయిన దధ్యంచుడు జన్మించాడు. భృగువునకు ఖ్యాతి అనే భార్యవల్ల ధాత, విధాత అనే ఇద్దరు కొడుకులూ, భగవద్భక్తురాలైన శ్రీ అనే కుమార్తె జన్మించారు. భృగువు పుత్రులైన ధాత, విధాత అనేవారు మేరువు కుమార్తెలయిన ఆయతి, నియతి అనేవారిని పెండ్లాడారు. ధాతకు ఆయతి వల్ల మృకండుడు పుట్టాడు. విధాతకు నియతి వల్ల ప్రాణుడు జన్మించాడు. మృకండునకు మార్కండేయుడు కలిగాడు. ప్రాణునకు వేదశిరుడు పుట్టాడు. భార్గవునికి ఉశన అనే భార్యవల్ల కవి జన్మించాడు. ఈ విధంగా కర్దముని కూతుళ్ళ సంతాన వృత్తాంతం నీకు చెప్పాను. ఈ వృత్తాంతం విన్నవారికి వెంటనే పాపాలు తొలగిపోతాయి. ఇక దక్షప్రజాపతి వంశాన్ని వివరిస్తాను. విను.