పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : కర్దమప్రజాపతి వంశాభివృద్ధి

  •  
  •  
  •  

4-17-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియుఁ గృపావలోకన మందహాస సుందర వదనారవిందంబులు గల మహాత్ముల సందర్శించి; యమందానంద కందళిత హృదయార విందుండై సాష్టాంగ దండప్రణామంబు లాచరించి పుష్పాంజలి గావించి నిటలతట ఘటిత కరపుటుం డై దుర్నిరీక్ష్యంబైన తత్తేజోవిశేషంబు దేఱి చూడంజాలక ముకుళితనేత్రుండై తత్పదాయత్త చిత్తుం డగుచు సర్వలోక గరిష్ఠంబు లైన మృదుమధుర గంభీర భాషణంబుల నిట్లని స్తుతియించె.

టీకా:

మఱియున్ = ఇంకను; కృపావలోకన = దయతో కూడిన చూపులు; మందహాస = చిరునవ్వులు కల; సుందర = అందమైన; వదన = మోములు అనెడి; అరవిందంబులున్ = పద్మములు; కల = కలిగిన; మహాత్ముల = గొప్పవారిని; సందర్శించి = చక్కగా చూసి; అమంద = మిక్కిలి {అమంద – తక్కువ కాని}; ఆనంద = ఆనందముతో; కందళిత = వికసించిన; హృదయ = హృదయ మనెడి; అరవిందుండు = పద్మము కలవాడు; ఐ = అయ్యి; సాష్టాంగదండప్రణామంబులు = సాష్టాంగనమస్కారములు {సాష్టాంగ దండ ప్రణామము - స (తోకూడిన) అష్టాంగ (ఎనిమిది అంగములు, 1నుదురు 2కళ్ళు 3ముక్కు 4చెవులు 5నోరు 6వక్షము 7కాళ్లు 8చేతులు) దండ (కఱ్ఱవలె తిన్ననైన) విధముగ నుండి చేయు ప్రణామము (నమస్కారము)}; ఆచరించి = చేసి; పుష్పాంజలిన్ = పుష్పాంజలిని {పుష్పాంజలి - పుష్పములు గల దోసిలి జోడించి చేయు నమస్కారము}; కావించి = చేసి; నిటలతట = నుదురు ప్రదేశమున; ఘటిత = చేర్చబడిన; కరపుటుండు = దోసిలి కలవాడు; ఐ = అయ్యి; దుర్నిరీక్ష్యంబు = తేరిపారచూడ శక్యము కానిది; ఐన = అయినట్టి; తత్ = ఆ; తేజః = తేజస్సు యొక్క; విశేషంబు = గొప్పదనమును; తేఱి = తేరిపార; చూడన్ = చూచుటకు; చాలక = సామర్థ్యము సరిపడక; ముకుళిత = ముకుళించిన, దించిన; నేత్రుండు = కన్నులు కలవాడు; ఐ = అయ్యి; తత్ = వారి; పద = పాదము లందు; ఆయత్త = లగ్నమైన; చిత్తుండు = మనసు కలవాడు; అగుచున్ = అవుతూ; సర్వ = సమస్తమైన; లోక = లోకము లందు; గరిష్ఠంబులు = గొప్పవి; ఐన = అయినట్టి; మృదు = సున్నితమైన; మధుర = మధురమైన; గంభీర = గంభీరమైన; భాషణంబులన్ = మాటలతో; ఇట్టు = ఈ విధముగ; అని = పలికి; స్తుతియించె = స్తోత్రములు చేసెను.

భావము:

ఇంకా కరుణాకటాక్షవీక్షణాలను ప్రసరింపజేసే ముఖాలలో చిరునవ్వులు చిందులాడుతున్న ఆ మహాత్ములను చూచి అత్రి పట్టరాని ఆనందంతో పొంగిపోయి, సాగిలపడి నమస్కరించి, పుష్పాంజలి సమర్పించి, నుదుట చేతులు మోడ్చి, కన్నులకు మిరుమిట్లు గొలిపే ఆ త్రిమూర్తుల తేజస్సును చూడలేక కన్నులు మూసుకొని, వారి పాదాలపైనే తన మనస్సును లగ్నం చేసి మృదువుగా, మధురంగా, గంభీరంగా ఇలా స్తుతించాడు.
”అనఘతపోభిరాముఁ డగు” పద్యంలోనుంచి క్రమాలంకారం పొంగి పొర్లిందా అన్న అభాసం స్పురించే “కృపావలోకన మందహాస సుందర వదనారవిందంబులు గల మహాత్ముల” పదాల అందం చూసారా?