పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రచేతసుల తపంబు

  •  
  •  
  •  

4-945-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంతఁ జాక్షుషమన్వంతరంబున దైవచోదితుండై యిష్ట ప్రజాసర్గంబు గావించుచుఁ బ్రసిద్ధుండైన దక్షుండు పూర్వదేహంబు గాలవిద్రుతం బగుచుండం బ్రచేతసులకు నమ్మారిష యను భార్య యందు సంభవించి నిజకాంతింజేసి సమస్తతేజోధనుల తేజంబును బిహితంబుగాఁ జేయుచుఁ గర్మదాక్ష్యంబున దక్షుం డను నామంబు వహించి బ్రహ్మ చేతం బ్రజాసర్గరక్షయందు నియోగింపంబడి మరీచ్యాదులం దత్తద్వ్యాపారంబులందు నియోగించి యుండె; నంత.

టీకా:

అంతన్ = అంతట; చాక్షుస = చాక్షుస అనెడి; మన్వంతరంబునన్ = మన్వంతరములో {మన్వంతరములు - పద్నాలుగు, 1స్వాయంభువ 2స్వారోచిష 3ఉత్తమ 4తామస 5రైవత 6చాక్షుస 7వైవస్వతత 8సూర్యసావర్ణి 9దక్షసావర్ణి 10బ్రహ్మసావర్ణి 11ధర్మసావర్ణి 12రుద్రసావర్ణి 13రౌచ్య 14భౌచ్య మన్వంతరములు ( పాఠాంతరములు కూడ కలవు) ప్రస్తుతము వైవస్వతమన్వంతరము జరుగుచున్నది}; దైవ = దైవముచేత; చోదితుండు = ప్రేరేపింపబడినవాడు; ఐ = అయ్యి; ఇష్ట = యజ్ఞరూపమైన; ప్రజా = సంతానము; సర్గంబున్ = సృష్టించుట; కావించుచున్ = చేయుచూ; ప్రసిద్ధుండున్ = ప్రసిద్ధిపొందినవాడు; ఐనన్ = అయినట్టి; దక్షుండు = దక్షుడు; పూర్వ = పాత; దేహంబున్ = శరీరమును; కాల = కాలమున; విద్రుతంబున్ = కరిగింపబడినది; అగుచుండన్ = అగుతుండగా; ప్రచేతసుల్ = ప్రచేతసుల; కున్ = కు; ఆ = ఆ; మారిష = మారిష; అను = అనెడి; భార్య = భార్య; అందున్ = అందు; సంభవించి = పుట్టి; నిజ = తన; కాంతిన్ = ప్రభలు; జేసి = వలన; సమస్త = సమస్తమైన; తేజః = తేజస్సు; ధనుల్ = సంపదగా గలవారి; తేజంబునున్ = తేజస్సులను; పిహితంబునున్ = కప్పబడినవి; చేయుచున్ = చేయుచూ; కర్మ = యజ్ఞకర్మలు చేయుట యందు; దాక్ష్యంబునన్ = దక్షత, సమర్థత వలన; దక్షుండు = దక్షుడు; అను = అనెడి; నామంబున్ = పేరు; వహించి = ధరించి; బ్రహ్మ = బ్రహ్మదేవుని; చేతన్ = చేత; ప్రజా = సంతానమును; సర్గ = సృష్టిని; రక్ష = రక్షించుట; అందున్ = అందు; నియోగింపంబడి = నియమించబడి; మరీచి = మరీచి; ఆదులన్ = మొదలగువారి; అందున్ = యెడల; తత్తత్ = ఆయా; వ్యాపారంబుల్ = వ్యవహారములు; అందున్ = లో; నియోగించి = నియమించి; ఉండెన్ = ఉండెను; అంత = అంతట.

భావము:

పూర్వం చాక్షుష మన్వంతరంలో శివదూషణం చేసిన కారణం చేత దక్షుడు మనుష్యుడై ప్రచేతసులకు, మారిషకు పుట్టాడు. కర్మలో దక్షు డవటం చేత దక్షుడు అనే పేరును అతడు ధరించాడు. బ్రహ్మచేత ప్రజాసృష్టి చేయటానికి నియోగింపబడిన దక్షుడు మరీచుడు మొదలైన వారిని ఆయా పనులలో నియోగించాడు. అప్పుడు…