పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రచేతసుల తపంబు

  •  
  •  
  •  

4-934-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దేవా! మదీయ స్వాధ్యాయాధ్యయనంబులును, గురు ప్రసాదంబును, విప్రవృద్ధానువర్తనంబును, నార్యజననమస్కరణంబును, సర్వభూతా నసూయయు, నన్న విరహితంబుగా ననేక కాలం బుదకంబుల యందు సుతప్తంబయిన తపంబు చేయుటయు, నివి యన్నియును బురాణ పురుషుండ వైన భవదీయ పరితోషంబు కొఱకు నగుంగాక యని విన్నవించెద;" మని వెండియు నిట్లనిరి.

టీకా:

దేవా = భగవంతుడా; మదీయ = మా యొక్క; స్వాధ్యాయము = వేదాధ్యయము; అధ్యయనంబు = చదువులు; గురు = గురుదేవుల; ప్రసాదంబునున్ = అనుగ్రహము; విప్ర = బ్రాహ్మణుల; వృద్ధ = పెద్ధల; అనువర్తనంబున్ = అనుసరించుటలు; ఆర్య = పూజనీయమైన; జన = వారికి; నమస్కరణంబునున్ = నమస్కరించుటలు; సర్వ = అఖిల; భూతా = జీవుల; అనసూయయున్ = అసూయ లేకపోవుటను; అన్న = ఆహారము; విరహితంబుగాన్ = లేకుండగా; అనేక = ఎక్కువ; కాలంబున్ = కాలము; ఉదకంబుల్ = నీళ్ళ; అందున్ = లో; సు = మిక్కిలి; తప్తంబున్ = తపింపబడినది; అయిన = అయిన; తపంబున్ = తపస్సును; చేయుటయున్ = చేయుట; ఇవి = ఇవి; అన్నియునున్ = అన్ని; పురాణపురుషుండవున్ = పూరాణకాలము నుండియు ఉన్న పురుషుడవు; ఐన = అయిన; భవదీయ = నీ యొక్క; పరితోషంబున్ = సంతోషము; కొఱకున్ = కోసము; అగుగాక = అగుగాక; అని = అని; విన్నవించెదమున్ = చెప్పుకొనెదము; అని = అని; వెండియున్ = మరల; ఇట్లు = ఇట్లు; అనిరి = అనిరి.

భావము:

దేవా! మా వేదాధ్యయనం, గురుప్రసాదం, విప్రవృద్ధ సేవ, ఆర్యజన వందనం, సకల జీవులయందు అసూయ లేకపోవటం, అన్నం లేకుండా చాలాకాలం నీటిలో ఉగ్రతపం చేయటం మొదలైనవన్నీ పురాణ పురుషుడవైన నీకు సంతోషాన్ని కలిగించు గాక!