పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రచేతసుల తపంబు

  •  
  •  
  •  

4-911-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“అనఘాత్ములారా! యభిన్న ధర్మశీలు రయిన మీకు నందఱకు నా సుమధ్య యైన కన్య యభిన్న ధర్మశీలయు భవ దర్పితాశయయు నయిన భార్య యగు; మీర లప్రతిహత తేజస్కులై దివ్యవర్ష సహస్రంబులు భౌమ దివ్య భోగంబులు మదనుగ్రహులై యనుభవించెద; రంత నా యందుల భక్తిం జేసి నిర్మలాంతఃకరణులై యీ భోగంబులు నిరయ ప్రాయంబులుగాఁ దలంచి మదీయ స్థానంబు నొందెద” రని వెండియు నిట్లనియె.

టీకా:

అనఘాత్ములారా = పుణ్యాత్ములారా; అభిన్న = ఒకేవిధమైన; ధర్మ = ధర్మమున; శీలురు = నడచెడివారు; అయిన = అయినట్టి; మీ = మీ; కున్ = కు; అందఱు = అందరు; కున్ = కి; ఆ = ఆ; సు = చక్కటి; మధ్య = నడుముకలిగినామె; ఐన = అయిన; కన్య = స్త్రీ; అభిన్న = సమగ్రమైన; ధర్మ = ధర్మము గల; శీలయున్ = నడవడిక కలామె; భవత్ = మీ యందు; అర్పిత = అర్పింపబడిన; ఆశయమున్ = ఆశయములు కలామె; అయిన = అయిన; భార్య = భార్య; అగు = అగును; మీరలు = మీరు; అప్రతిహత = తిరుగులేని; తేజస్కులు = తేజస్సు గలవారు; ఐ = అయ్యి; దివ్య = దివ్యమైన; వర్ష = సంవత్సరములు; సహస్రంబులున్ = వేలకొలది; భౌమ = భౌతికమైన; దివ్య = దివ్యమైన; భోగంబులున్ = భోగములను; మత్ = నా యొక్క; అనుగ్రహులు = అనుగ్రహము గలవారు; ఐ = అయ్యి; అనుభవించెదరు = అనుభవించెదరు; అంత = అంతట; నా = నా; అందలన్ = ఎడ; భక్తిన్ = భక్తి; చేసి = వలన; నిర్మల = స్వచ్ఛమైన; అంతఃకరణులు = మనసులు కలవారు; ఐ = అయ్యి; ఈ = ఈ; భోగంబులున్ = భోగములను; నిరయ = నరకమునకు; ప్రాయంబులును = సమానమైనవి; కాన్ = అగునట్లు; తలంచి = భావించి; మదీయ = నా యొక్క; స్థానంబున్ = స్థానమును; ఒందెదరు = పొందెదరు; అని = అని; వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

“పుణ్యాత్ములారా! మీరు అభిన్నమైన ధర్మశీలం కలవారు. ఆమెకూడా అభిన్న ధర్మశీలయై మిమ్ముల నందరినీ సమానమైన ప్రేమతో సేవింపగలదు. మీరు గొప్ప బలవంతులై వేలకొలది దివ్య సంవత్సరాలు భూలోక సుఖాలను, స్వర్గలోక సుఖాలను నా అనుగ్రహం చేత అనుభవిస్తారు. ఆ తరువాత నామీది భక్తివల్ల చిత్తశుద్ధిని పొంది ఆ సుఖాలను నరకప్రాయంగా భావించి నా స్థానాన్ని చేరుకుంటారు” అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు.