పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పూర్వ సఖుని ఉవాచ

  •  
  •  
  •  

4-895-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వెండియు నిట్లనియె “ఇట్లు ముకుందయశంబునం జేసి భువనపావనంబు, మనశ్శుద్ధికరంబు, సర్వోత్కృష్టఫలప్రదాయకంబు, దేవర్షివర్య ముఖ వినిస్సృతంబు నైన యీ యధ్యాత్మ పారోక్ష్యంబు నెవ్వండు పఠియించు నెవ్వండు విను నట్టివాఁరు లింగశరీరవిధూననంబు గావించి ముక్త సమస్త బంధుడయి విదేహకైవల్యంబు నొంది సంసారమునందుఁ బరిభ్రమింప" డనిన మైత్రేయునకు విదురుం డిట్లనియె.

టీకా:

వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; ఇట్లు = ఈ విధముగ; ముకుంద = విష్ణుమూర్తి; యశంబునన్ = కీర్తి; చేసి = వలన; భువన = లోకములను; పావనంబున్ = పవిత్రము చేయునది; మనస్ = మనస్సును; శుద్ధికరంబు = శుద్ధి చేయునది; సర్వ = అన్నిటికన్నను; ఉత్కృష్ట = శ్రేష్ఠమైన; ఫల = ఫలితములను; ప్రదాయకంబున్ = చక్కగా కలుగ జేయునది; దేవర్షి = దేవఋషులలో; వర్యా = శ్రేష్ఠుని; ముఖ = నోటినుండి; వినిస్సృతంబున్ = చక్కగా వినిపింపబడినది; ఐన = అయిన; ఈ = ఈ; అధ్యాత్మ = ఆధ్యాత్మిక; పారోక్ష్యంబున్ = ఉపాఖ్యానమును; ఎవ్వండు = ఎవరైతే; పఠియించు = చదివునో; ఎవ్వండు = ఎవరైతే; వినున్ = వినునో; అట్టి = అటువంటి; వారున్ = వారు; లింగశరీర = లింగశరీరమును; విధూననంబున్ = విడువబడినదిగా; కావించి = చేసి; ముక్త = విముక్తమైన; సమస్త = సమస్తమైన; బంధులు = బంధములు కలవాడు; అయి = అయ్యి; విదేహ = దేహరహితమైన; కైవల్యమున్ = ముక్తిని; ఒంది = పొంది; సంసారమున్ = ఇక సంసారము; అందున్ = అందు; పరిభ్రమింపరు = తిరుగరు; అనినన్ = అనగా; మైత్రేయున్ = మైత్రేయుని; కున్ = కి; విదురుండు = విదురుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

(మైత్రేయుడు విదురునితో) ఇంకా ఇలా అన్నాడు. “నారదముని బోధించిన హరికీర్తిని కొనియాడే ఈ ఆధ్యాత్మ పారోక్ష్యం లోకాన్ని పవిత్రం చేస్తుంది. మనశ్శుద్ధిని కలిగిస్తుంది. అన్నిటికంటే గొప్పదైన ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి దీనిని చదివేవాడు, విన్నవాడు లింగశరీరాన్ని విడిచి సమస్త బంధాలను త్రెంచుకొని విదేహ కైవల్యాన్ని పొందుతాడు. సంసారంలో భ్రమించడు” అని చెప్పిన మైత్రేయునితో విదురుడు ఇలా అన్నాడు.