పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పూర్వ సఖుని ఉవాచ

  •  
  •  
  •  

4-853-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన యోగీంద్రుండు రాజేంద్రున కిట్లనియె “నరేంద్ర! యేమి కతంబున నాత్మ చేత నేక ద్వి చతుష్పాదంబును బహుపాదంబును నపాదంబు నగుచుఁ బురంజను దేహంబు ప్రకటం బొనర్చు; నా కతంబున బురంజనుండు పురుషుం డయ్యె; నట్టి పురుషునకు నామ క్రియా గుణంబుల విజ్ఞాయమానుండు గాకుండుటం జేసి యవిజ్ఞాత శబ్దంబునం జెప్పంబడు; సఖుం డీశ్వరుండు; పురుషుండు సాకల్యంబునం జేసి దేహపరిగ్రహంబు చేయ నిశ్చయించు నప్పుడు నవద్వార కలితంబును ద్విహస్త చరణ యుక్తంబును నయిన పురం బేది గల, దది లెస్స యని తలఁచి యప్పురం బను దేహంబునందుఁ బురుషుం డింద్రియంబులం జేసి యే బుద్ధి నధిష్ఠించి విషయంబుల ననుభవించు; నహంకార మమకారంబులకు నే బుద్ధితత్త్వంబు గారణం బగు; నట్టి బుద్ధి ప్రమదోత్తమ యనంబడె; దానికి సఖులు జ్ఞానకర్మకారణంబులైన యింద్రియగుణంబులు; సఖీజనంబులు దదీయ వృత్తులు; పంచముఖోరగం బనం బంచవృత్తి యైన ప్రాణం; బేకాదశ మహాభటులన బృహద్బలుండు నుభయేంద్రియ నాయకుండునైన మనంబు; నవద్వార సమేతంబైన యప్పురంబు చుట్టివచ్చిన పాంచాలదేశంబు లనం బంచవిషయంబులు; నవద్వారంబు లన నక్షి నాసికా కర్ణ ముఖ గుద శిశ్నంబు; లందు నక్షినాసాస్యంబు లైదునుం బ్రాగ్ద్వార పురస్కృ తంబులు; దక్షిణోత్తర కర్ణంబులు దక్షిణోత్తరద్వారంబులు; గుద శిశ్నంబులు పశ్చిమద్వారంబు; లందు నేకస్థల నిర్మితంబులైన ఖద్యోతా విర్ముఖులు నేత్రంబులు; విభ్రాజితం బన రూపంబు; ద్యుమంతు డనం జక్షురింద్రియంబు; నళినీ నాళిను లన నాసికా ద్వారంబులు; సౌరభం బన గంధం: బవధూత యన ఘ్రాణేంద్రియంబు; ముఖ్య యన నాస్యంబు; విపణం బన వాక్కు; రసజ్ఞుం డన రసం; బపణం బన వ్యవహారంబు; బాహూదనం బన వివిధాన్నంబు; పితృహు వన దక్షిణకర్ణంబు; దేవహూ వన నుత్తరకర్ణంబు; చండవేగుం డనం గాలోపలక్షకం బైన సంవత్సరంబు; గంధర్వు లన దివంబులు; గంధర్వీ జనంబు లన రాత్రులు; పరీవర్తనం బన నాయుర్హరణంబు; గాలకన్యక యన జర; యవనేశ్వరుం డన మృత్యు; వతని సైనికులన నాధివ్యాధులు; ప్రజ్వారుం డనం బ్రాణిహింస యందు శ్రీఘ్రవేగంబు గలిగి శీతోష్ణ భేదంబులం ద్వివిధం బైన జ్వరంబు; దక్షిణ పాంచాలం బనం బితృలోక ప్రాపకంబును బ్రవృత్తి రూపకంబు నైన శాస్త్రం; బుత్తర పాంచాలం బన దేవలోక ప్రాపకంబు నివృత్తి సంజ్ఞికంబు నయిన శాస్త్రంబు; శ్రుతధరుం డన శ్రోత్రం; బాసురీ నామకం బనం బశ్చాద్ద్వారంబైన మేఢ్రంబు; గ్రామకం బన సురత సుఖంబు; దుర్మదుం డన గుహ్యేంద్రియంబు; నిరృతి నామకం బైన పశ్చిమద్వారం బన గుదంబు; వైశసం బన నరకంబు; లుబ్ధకుం డనం బాయువు; సంధు లన హస్త పాదంబు; లంతఃపురం బన హృదయంబు; విషూచి యన మనం;” బని వెండియు నిట్లనియె.
సంకేత పదాలు జాబితా

టీకా:

అనినన్ = అనగా; యోగి = యోగులలో; ఇంద్రుండు = ఇంద్రుని వంటివాడు; రాజ = రాజులలో; ఇంద్రున్ = ఇంద్రుని వంటివాని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; నరేంద్ర = రాజా {నరేంద్ర - నరులలో ఇంద్రుని వంటి వాడు, రాజు}; ఏమి = ఏమి; కతంబునన్ = కారణముచేత; ఆత్మ = ఆత్మ; చేతన్ = చేత; ఏక = ఒకటే (1) {ఏకపాదులు - ఒకటే మూలము కలవి, చెట్లు}; ద్వి = రెండు (2) {ద్విపాదులు - రెండు పాదములు కలవి, మానవులు పక్షులు}; చతుష్ = నాలుగు (4) {చతుష్పాదులు - నాలుగు పాదములు కలవి, జంతువులు మొదలైనవి}; పాదంబునున్ = పాదములు కలవి; బహుపాదంబునున్ = అనేక పాదములు కలవి {బహు పాదులు - అనేక పాదములు కలవి, కీటకాదులు}; అపాదంబునున్ = పాదములు లేనివి {అపాదములు - పాదములు లేనివి, పాములు మొదలగునవి}; అగుచున్ = అగుతూ; పురంజను = పురంజనుని; దేహంబున్ = శరీరము; ప్రకటంబున్ = వెల్లడి; ఒనర్చున్ = చేయునో; ఆ = ఆ; కతంబునన్ = కారణముచేత; పురంజనుండు = పురంజనుడు; పురుషుండు = పురుషుడు; అయ్యెన్ = అయ్యెను; అట్టి = అటువంటి; పురుషున్ = పురుషుని; కున్ = కి; నామ = పేర్లు; క్రియా = పనులు; గుణంబులన్ = గుణములతో; విజ్ఞాయమానుండు = తెలియబడువాడు; కాకుండుటన్ = కాకపోవుట; చేసి = వలన; అవిజ్ఞాత = అవిజ్ఞాత (తెలియబడనివాడు); శబ్దంబునన్ = పదముచేత, మాటచేత; చెప్పంబడున్ = చెప్పెదరు; సఖుండు = స్నేహితుడు; ఈశ్వరుండు = పరమాత్మ; పురుషుండున్ = పురుషుడు; సాకల్యంబునన్ = స్వప్న కలితము; చేసి = వలన; దేహ = శరీరము; పరిగ్రహంబున్ = స్వీకరించుట; చేయన్ = చేయుటకు; నిశ్చయించున్ = నిర్ణయించుకొను; అప్పుడున్ = అప్పుడు; నవ = తొమ్మిది (9); ద్వార = రంధ్రములు; కలితంబును = కలిగినది; ద్వి = రెండు (2); హస్త = చేతులు; చరణ = పాదములు; యుక్తంబునున్ = కలిగినది; అయిన = అయినట్టి; పురంబున్ = దేహము; ఏది = ఏదైతే; కలదు = కలదో; అది = అదే; లెస్స = సరియగునది; అని = అని; తలచి = భావించి; ఆ = ఆ; పురంబున్ = పురము; అను = అనెడి; దేహంబున్ = శరీరము; అందున్ = లో; పురుషుండు = పురుషుడు; ఇంద్రియంబులన్ = ఇంద్రియములను; చేసియే = వలననే; బుద్ధిన్ = బుద్ధిని; అధిష్ఠించి = ఆశ్రయించి; విషయంబులన్ = ఇంద్రియగోచరములను; అనుభవించున్ = అనుభవించును; అహంకార = నేను యనెడి అభావము; మమకారంబుల్ = నాది యనెడి అభావముల; కున్ = కు; ఏ = ఏ; బుద్ధి = బుద్ధి; తత్త్వంబున్ = లక్షణము; కారణంబున్ = కారణము; అగున్ = అగునో; అట్టి = అటువంటి; బుద్ధిన్ = బుధ్దిని; ప్రమదోత్తమ = ఉత్తమస్త్రీ {ప్రమదోత్తమ - ప్ర (మిక్కిలి) మద (మదించిన, మత్తు కలి గుండెడి) ఆమె (స్త్రీ) వారిలో ఉత్తమురాలు, ఉత్తమస్త్రీ}; అనంబడె = అనబడినది; దాని = దాని; కిన్ = కి; సఖులు = స్నేహితులు; జ్ఞాన = జ్ఞానములకు; కర్మ = కర్మలకు; కారణంబులున్ = కారణములు; ఐన = అయినట్టి; ఇంద్రియ = ఇంద్రియముల యొక్క; గుణంబులున్ = లక్షణములు; సఖీజనంబులున్ = స్నేహితురాళ్లు; తదీయ = వాని; వృత్తులు = నడవడికలు; పంచ = ఐదు (5); ముఖ = ముఖములు, పడగలుగల; ఉరగంబున్ = పాము; అనన్ = అనగా; పంచ = ఐదు (5); వృత్తి = ప్రవృత్తి; ఐన = అయిన; ప్రాణంబున్ = ప్రాణము {పంచప్రాణములు - 1 ప్రాణము 2 అపానము 3 న్యాసము 4 ఉదానము 5 సమాన వాయువులు}; ఏకాదశ = పదకొండు (11); మహా = గొప్ప; భటులు = భటులు; అనన్ = అనగా; బృహత్ = అతిమిక్కిలి; బలుండును = బలము కలవాడును; ఉభయ = రెండు (2) జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు; ఇంద్రియ = ఇంద్రియములకును; నాయకుండును = నియమించువాడు; ఐన = అయిన; మనంబున్ = మనస్సు; నవ = తొమ్మిది (9); ద్వార = రంధ్రములు; సమేతంబున్ = కలిగినది; ఐన = అయిన; ఆ = ఆ; పురంబున్ = పురము; చుట్టి = చుట్టును; వచ్చిన = వచ్చిన; పాంచాలదేశంబులు = పాంచాలదేశములు; అనన్ = అనగా; పంచ = ఐదు (5); విషయంబులున్ = ఇంద్రియార్థములు; నవ = తొమ్మిది (9); ద్వారంబులు = గుమ్మములు; అనన్ = అనగా; అక్షి = కన్నులు; నాసికా = ముక్కు రంధ్రము; కర్ణ = చెవులు; ముఖ = నోరు; గుద = మలద్వారము; శిశ్నంబులు = మూత్రద్వారము; అందున్ = వానిలో; అక్షి = కన్నులు; నాస = ముక్కు రంధ్రములు; అస్యంబున్ = నోరు; ఐదునున్ = అయిదు (5); ప్రాక్ = తూర్పు; ద్వార = గుమ్మములు; పురస్కృతంబులు = ముందున్నవి; దక్షిణ = కుడి పక్క; ఉత్తర = ఎడమ పక్క; కర్ణంబులున్ = చెవులు; దక్షిణ = దక్షిణపు దిక్కు; ఉత్తర = ఉత్తరపు దిక్కు; ద్వారంబులున్ = గుమ్మములు; గుద = మలద్వారము; శిశ్నంబులు = మూత్రద్వారములు; పశ్చిమ = పడమటిదిక్కు; ద్వారంబులున్ = గుమ్మములు; అందున్ = వానిలో; ఏక = ఒకే; స్థల = ప్రదేశమున; నిర్మితంబులు = ఏర్పరుపబడినవి; ఐన = అయిన; ఖద్యోత = ఖద్యోతుడు {ఖద్యోతుడు - ఆకాశమును వెలుగువాడు, సూర్యుడు}; అవిర్ముఖులు = అవిర్ముఖులు {ఆవిర్ముఖుడు - స్పష్టమైన ముఖము కలవాడు, చంద్రుడు}; నేత్రంబులు = కన్నులు; విభ్రాజితంబున్ = విభ్రాజితము; అనన్ = అనగా; రూపంబున్ = రూపము; ద్యుమంతుడు = ద్యుమంతుడు; అనన్ = అనగా; చక్షుః = చూసెడి; ఇంద్రియంబున్ = ఇంద్రియము; నళిని = నళిని; నాళినులు = నాళినులు; అనన్ = అనగా; నాసికా = ముక్కు; ద్వారంబులు = రంధ్రములు; సౌరభంబున్ = సౌరభము; అనన్ = అనగా; గంధంబున్ = వాసన; అవధూత = అవధూత; అనన్ = అనగా; ఘ్రాణేంద్రియంబున్ = వాసన చూసెడి ఇంద్రియము; ముఖ్య = ముఖ్యము; అనన్ = అనగా; ఆస్యంబున్ = నోరు; విపణంబున్ = విపణము, దుకాణము; అనన్ = అనగా; వాక్కు = వాగింద్రియము; రసజ్ఞుండు = రసజ్ఞుడు; అనన్ = అనగా; రసంబున్ = రుచి; ఆపణంబున్ = ఆపణము, వ్యాపారము; అనన్ = అనగా; వ్యవహారంబున్ = లోకవ్వహారము; బాహూదనంబున్ = బాహూదనము; అనన్ = అనగా; వివిధ = పలు రకములైన; అన్నంబున్ = ఆహారములు; పితృహువు = పితృహువు; అనన్ = అనగా; దక్షిణ = కుడి పక్క; కర్ణంబున్ = చెవి; దేవహువు = దేవహువు; అనన్ = అనగా; ఉత్తర = ఎడమ పక్క; కర్ణంబున్ = చెవి; చండ = భయంకరమైన; వేగుండు = వేగముకలవాడు; అనన్ = అనగా; కాల = కాలము యొక్క; ఉపలక్షకంబున్ = ఉప లక్షణము యైనది; ఐన = అయిన; సంవత్సరము = సంవత్సరము; గంధర్వులు = గంధర్వులు; అనన్ = అనగా; దివంబులు = పగళ్ళు; గంధర్వీజనంబులు = గంధర్వస్త్రీలు; అనన్ = అనగా; రాత్రులు = రాత్రుళ్ళు; పరీవర్తనంబున్ = పరీవర్తనంబు, మారిపోవుట; అనన్ = అనగా; ఆయుః = ఆయుష్షు; హరణంబున్ = వ్యయమగుట; కాలకన్యక = కాలకన్యక; అనన్ = అనగా; జర = ముసలితనము; యవనేశ్వరుండు = యవనేశ్వరుడు; అనన్ = అనగా; మృత్యువు = మరణదేవత; అతని = అతని యొక్క; సైనికుల్ = సైనికులు; అనన్ = అనగా; ఆధి = మానసిక; వ్యాధులు = జబ్బులు; ప్రజ్వారుండు = ప్రజ్వారుండు, మిక్కిలి జ్వరము; అనన్ = అనగా; ప్రాణి = ప్రాణుల; హింస = మరణసమయము; అందున్ = లో; శ్రీఘ్ర = త్వరతగల; వేగంబున్ = వేగము; కలిగి = ఉండి; శీత = చల్లదనము; ఉష్ణ = వేడి; భేదంబులన్ = తేడాలతో; ద్వి = రెండు (2); విధంబున్ = రకములు; ఐన = అయిన; జ్వరంబున్ = జ్వరము; దక్షిణపాంచాలంబున్ = దక్షిణపాంచాలము; అనన్ = అనగా; పితృలోక = పితృలోకమును; ప్రాపకంబున్ = లభింపజేయు; ప్రవృత్తి = కర్మల వర్తించవలసిన; రూపకంబున్ = పద్ధతులు కలవి; ఐన = అయిన; శాస్త్రంబున్ = శాస్త్రములు; ఉత్తరపాంచాలంబున్ = ఉత్తరపాంచాలము; అనన్ = అనగా; దేవలోక = దేవలోకమును; ప్రాపకంబున్ = లభింపజేయు; నివృత్తి = నివృత్తి, వైరాగ్యము; సంజ్ఞికంబున్ = పేరుకలవి; అయిన = ఐన; శాస్త్రంబున్ = శాస్త్రములు; శ్రుతధరుండు = శ్రుతధరుండు; అనన్ = అనగా; శ్రోత్రంబున్ = శ్రోత్రేంద్రియము; ఆసురీనామకంబున్ = ఆసురీనామకంబున్, రాక్షస సంబంధమైన; అనన్ = అనగా; పశ్చాత్ = పడమటిదిక్కు; ద్వారంబున్ = ద్వారము; ఐన = అయిన; మేఢ్రంబున్ = పురుషావయవము; గ్రామకంబు = గ్రామకంబు; అనన్ = అనగా; సురతసుఖంబున్ = సంభోగము; దుర్మదుండు = దుర్మదుండు; అనన్ = అనగా; గుహ్యేంద్రియంబు = రహస్యేంద్రియము; నిరృతి = నిరృతి అనెడి; నామకంబున్ = పేరు కలది; ఐన = అయిన; పశ్చిమ = పడమటిదిక్కు; ద్వారంబున్ = ద్వారము; అనన్ = అనగా; గుదంబు = మలద్వారము; వైశసంబున్ = వైశసము; అనన్ = అనగా; నరకంబున్ = నరకము; లుబ్ధకుండు = లుభ్ధకుండు, పిసినారి; అనన్ = అనగా; పాయువు = మలవిసర్జనము చేయు తావు; సంధులు = సంధులు; అనన్ = అనగా; హస్త = చేతులు; పాదంబులున్ = కాళ్ళు; అంతఃపురంబున్ = అంతఃపురము; అనన్ = అనగా; హృదయంబున్ = హృదయము; విషూచి = విషూచి {విషూచి - మనసు, విష్వచ్ఛ, విషూచీన, (విష అంటే వ్యాపతౌ, వాచస్పతం) అన్ని వైపులకు (పరిపరి విధాల) పోవునది.}; అనన్ = అనగా; మనంబున్ = మనస్సు; అని = అని; వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

అనిన ప్రాచీనబర్హితో నారదుడు ఇలా అన్నాడు “రాజేంద్రా! ఏ కారణం చేత ఒక పాదం కలది (చెట్టు), రెండు పాదాలు కలది (మానవుడు, పక్షి), మూడు పాదాలు కలది, నాలుగు పాదాలు కలది (జంతువు), పెక్కు పాదాలు కలది (కీటకం), పాదాలు లేనిది (పాము) అయి పెక్కురకాలుగా చేతనతో కూడిన జీవునివల్ల దేహం వ్యక్తమవుతుందో ఆ కారణంచేత పురంజనుడు పురుషు డయ్యాడు. ఆ పురుషునికి నామ క్రియాగుణాలచే తెలియబడ్డ అవిజ్ఞాతుడు అనే మిత్రుడే ఈశ్వరుడు. పురుషుడు తొమ్మిది ద్వారాలతోను, రెండు చేతులతోను, పాదాలతోను కూడిన దోషరహితమైన దేహంలో ప్రవేశించాలని కోరుకుంటాడు. కాబట్టి పురం అంటే దేహం. పురుషుడు బుద్ధిని ఆశ్రయించి ఇంద్రియాలచేత విషయసుఖాలను అనుభవిస్తాడు. అహంకార మమకారాలను పొందుతాడు. కాబట్టి ఉత్తమ స్త్రీ అంటే బుద్ధి. ఆ బుద్ధికి స్నేహితులు అంటే జ్ఞాన, కర్మ కారణాలైన ఇంద్రియ గుణాలు. చెలికత్తెలంటే ఇంద్రియ వ్యాపారాలు. అయిదు తలల పాము అంటే పంచవృత్తి అయిన ప్రాణం. పదకొండుమంది మహాభటులు అంటే జ్ఞాన కర్మేంద్రియాలు పది, వాటిని ప్రేరేపించే మనస్సు (బృహద్బలుడు). తొమ్మిది ద్వారాలతో కూడిన ఆ పురాన్ని చుట్టి వచ్చిన పాంచాల దేశాలు అంటే శబ్దం మొదలైన పంచ విషయాలు. నవద్వారాలు అంటే రెండు కన్నులు, రెండు ముక్కు రంధ్రాలు, ఒక నోరు, రెండు చెవులు, గుదం, మగగురి. అందులో రెండు కన్నులు, రెండు ముక్కు రంధ్రాలు, ఒక నోరు ఈ ఐదు తూర్పున ఉండే ద్వారాలు. కుడి చెవి దక్షిణ ద్వారం. ఎడమచెవి ఉత్తర ద్వారం. గుదం, శిశ్నం అనేవి రెండు పడమటి ద్వారాలు. అందులో ఒకేచోట నిర్మింపబడిన ఖద్యోత, ఆవిర్ముఖి అంటే కన్నులు. విభ్రాజితం అంటే రూపం. ద్యుమంతుడు అంటే నేత్రేంద్రియం. నళిని, నాళిని అంటే ముక్కు రంధ్రాలు. సౌరభం అంటే గంధం. అవధూత అంటే ఘ్రాణేంద్రియం. ముఖ్య అంటే నోరు. విపణం అంటే వాగింద్రియం. రసజ్ఞుడు అంటే రసనేంద్రియం. ఆపణం అంటే సంభాషణం. బహూదనం అంటే పలురకాలైన అన్నం. పితృహువు అంటే కుడిచెవి. దేవహువు అంటే ఎడమ చెవి. చంద్రవేగుడు అంటే కాలాన్ని సూచించే సంవత్సరం. గంధర్వులు అంటే పగళ్ళు. గంధర్వీజనులు అంటే రాత్రులు. పరీవర్తనం అంటే ఆయుఃక్షయం. కాలకన్యక అంటే ముసలితనం. యవనేశ్వరుడు అంటే మృత్యువు. అతని సైనికులు ఆధివ్యాధులు. ప్రజ్వారుడు అంటే వేగంగా చావును కలిగించే జ్వరం. శీతం, ఉష్ణం అనే ఈ జ్వరం రెండు రకాలు. దక్షిణ పాంచాలం అంటే పితృలోకాన్ని పొందించేదీ, ప్రవృత్తి రూపకమూ అయిన శాస్త్రం. ఉత్తర పాంచాలం అంటే దేవలోకాన్ని పొందించేదీ, నివృత్తి రూపకమూ అయిన శాస్త్రం. శ్రుతధరుడు అంటే చెవి. ఆసురి అనే పేరు కలిగిన పడమటి ద్వారం శిశ్నం. గ్రామకం అంటే రతి. దుర్మదుడు అంటే యోని. నిరృతి అనే పేరు కలిగిన పడమటి ద్వారం గుదం. వైశసం అంటే నరకం. లుబ్ధకుడు అంటే మలద్వారం. సంధులు అంటే చేతులు కాళ్ళు. అంతఃపురం అంటే హృదయం. విషూచి అంటే మనస్సు” అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు.