పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పూర్వ సఖుని ఉవాచ

  •  
  •  
  •  

4-851-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఏనే నీవు గాని యన్యుండవు గావు; నీవే నేఁ గాని యన్యుండంగా; నిట్లని యెఱుంగుము; విద్వాంసులు మన యిద్దఱ యందు నంతరంబు నీక్షింపరు; పురుషుండు దన్నొక్కనినె యాదర్శ చక్షువులందు భిన్నరూపునింగాఁ దలంచు చందంబున మన యిద్దఱికిని భేదంబు గలిగిన యట్ల తోఁచు; నని యివ్విధంబున నతం డతనిచేత నీవు పూర్వంబున మదీయసఖుండవైన హంస” వని తెలుపంబడి స్వస్థుండై తద్వియోగ నష్టంబైన జ్ఞానంబు గ్రమ్మఱం బొందె” నని చెప్పి నారదుండు ప్రాచీనబర్హిం జూచి యీ యధ్యాత్మతత్త్వంబు రాజకథామిషంబున నీకు నెఱింగించితి;" ననిన.

టీకా:

ఏనే = నేనే; నీవున్ = నీవు; కాని = కాని; అన్యుండవు = ఇతరుడవు; కావు = కావు; నీవే = నీవే; నేన్ = నేను; కాని = కాని; అన్యుండన్ = ఇతరుడను; కాను = కాను; ఇట్లు = ఈ విధముగ; అని = అని; ఎరుంగుము = తెలిసికొనుము; విద్వాంసులు = జ్ఞానులు; మన = మనలను; ఇద్ధఱన్ = ఇద్ధరి; అందున్ = మధ్యన; అంతరంబున్ = తేడాను; ఈక్షింపరు = చూడరు; పురుషుండున్ = మానవుడు; తన్నున్ = తనను; ఒక్కనినే = ఒకడినే; ఆదర్శచక్షువులు = అద్దములు, ఆదర్శములనెడి కన్నులు; అందున్ = లో; భిన్న = విభిన్న; రూపునిన్ = స్వరూపముగా; తలంచున్ = అనుకొనెడి; చందంబునన్ = విధముగనే; మన = మనకు; ఇద్దఱి = ఇద్ధరి; కినిన్ = కి; భేదంబున్ = వేరువేరు అనేడి భావము; కలిగిన = ఉన్నట్టి; అట్ల = విధముగా; తోచున్ = అనిపించును; అని = అని; ఇవ్విధంబునన్ = ఈ విధముగ; అతండున్ = అతడు; అతని = అతని; చేతన్ = చేత; నీవున్ = నీవు; పూర్వంబునన్ = మొదటినుండి; మదీయ = నా యొక్క; సఖుండవు = స్నేహితుడవు; ఐన = అయిన; హంసవు = హంసవే; అని = అని; తెలుపంబడి = తెలియజేయబడి; స్వస్థుండు = చిత్తశాంతి కలవాడు, నిజస్థితిలో ఉన్నవాడు; ఐ = అయ్యి; తత్ = ఆ; వియోగ = వియోగమునందు; నష్టంబున్ = నష్టపోయినది; ఐన = అయిన; జ్ఞానంబున్ = జ్ఞానమును; క్రమ్మఱన్ = మరల; పొందెన్ = పొందెను; అని = అని; చెప్పి = చెప్పి; నారదుండు = నారదుడు; ప్రాచీనబర్హిన్ = ప్రాచీనబర్హిని; చూచి = చూసి; ఈ = ఈ; అధ్యాత్మ = అధ్యాత్మ; తత్త్వంబున్ = తత్త్వమును; రాజ = రాజు యొక్క; కథా = కథ యనెడి; మిషంబునన్ = వంకతో; నీకున్ = నీకు; ఎఱింగించితిన్ = తెలిపితిని; అనిన = అనగా.

భావము:

నేనే నీవు. నీవే నేను. అంతేకాని వేరుకాదు. పండితులు మనలో తేడాను చూడరు. ఒక్కటే అయినా అద్దంలో ప్రతిబింబించే రూపమూ, బింబరూపమూ వేరుగా తోచినట్లు మన ఇద్దరికీ భేదం లేకున్నా భేదం ఉన్నట్లు కనిపిస్తుంది” ఈ విధంగా అవిజ్ఞాతుడు చేసిన బోధవల్ల తేరుకొని అతని ఎడబాటువల్ల తాను కోల్పోయిన జ్ఞానాన్ని వైదర్భి రూపంలో ఉన్న పురంజనుడు పొందాడు” అని చెప్పి నారదుడు ప్రాచీనబర్హిని చూచి “ఈ ఆధ్యాత్మతత్త్వాన్ని రాజుకథ నెపంతో నీకు చెప్పాను” అని చెప్పగా…