పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పురంజను కథ

  •  
  •  
  •  

4-834-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్లు ధర్మపత్ని వెంటరాఁ జని యందుఁ జంద్రమసా తామ్రపర్ణీ నవోదక లను నదుల పుణ్యజలంబుల సుస్నాతుం డయి ప్రక్షాళిత బాహ్యాభ్యంతర మలుండును గందమూల ఫల బీజ పుష్ప పర్ణ తృణ తోయాహారుండునై కాయకర్శనంబైన తపం బాచరించుచు శీతోష్ణ వర్ష వాతంబులు క్షుత్పిపాసలుఁ బ్రియాప్రియంబులు సుఖదుఃఖంబులు నను ద్వంద్వంబుల సమదర్శనుండై జయించి తపోవిద్యాయమ నియమంబులం జేసి పక్వకషాయుండై బ్రహ్మంబునందు నిజాత్మ ననుసంధించి విజితేంద్రియ ప్రాణ చిత్తుండై స్థాణువుం బోలె దివ్యవర్ష శతంబు దపంబు చేసి భగవంతుం డయిన వాసుదేవుని యందుఁ బ్రీతి వహించుచు నన్యం బెఱుంగక వర్తించుచుఁ దన్ను స్వప్నమందు ‘మమేదం శిరశ్ఛిన్నమితి’ యను ప్రతీతియందుం బోలె వ్యతిరిక్తునిఁగా వ్యాపకునిఁగా నంతఃకరణవృత్తిసాక్షినింగా నెఱింగి.

టీకా:

అట్లు = ఆ విధముగ; ధర్మపత్ని = భార్య {ధర్మపత్ని - అగ్నిసాక్షిగా పెండ్లాడిన భార్య}; వెంటన్ = కూడా; రాన్ = రాగా; చని = వెళ్ళి; అందున్ = అక్కడ; చంద్రమసా = చంద్రమస; తామ్రపర్ణి = తామ్రపర్ణి; నవోదకలున్ = నవోదకలు; అను = అనెడి; నదుల = నదులలోని; పుణ్య = పుణ్యవంతమైన; జలంబులన్ = నీటిలో; సుస్నాతుండు = చక్కగా స్నానము చేసినవాడు; అయిన్ = అయ్యి; ప్రక్షాళిత = చక్కగా శుభ్రపరచబడిన; బాహ్య = వెలుపలి; అభ్యంతర = లోపలి; మలుండు = మలములు కలవాడు; కందమూల = కంద దుంపలు; ఫల = ఫలములు; బీజ = గింజలు; పుష్ప = పూలు; పర్ణ = ఆకులు; తృణ = గడ్డి; తోయ = నీరు; ఆహారుండున్ = ఆహారముగా కలవాడు; ఐ = అయ్యి; కాయ = దేహమును; కర్శనంబున్ = కృశింపజేయునది; ఐన = అయిన; తపంబున్ = తపస్సును; ఆచరించుచున్ = చేయుచూ; శీత = చల్లదనము; ఉష్ణ = వేడిమి; వర్ష = వర్షము; వాతంబులు = వాయువులు; క్షుత్ = ఆకలి; పిపాసలు = దప్పులు; ప్రియ = ఇష్టమైనవి; అప్రియంబులున్ = అయిష్టమైనవి; సుఖ = సుఖములు; దుఃఖ = దుఃఖములు; అను = అనెడి; ద్వంద్వంబులన్ = ద్వంద్వభావములను; సమ = సమానమైన; దర్శనుండు = చూచెడివాడు; ఐ = అయ్యి; జయించి = లొంగదీసుకొని; తపః = తపస్సు; విద్యా = జ్ఞానము; యమ = యమము; = నియమంబులన్ = నియమములను; చేసి = వలన; పక్వకషాయుండు = పరిపక్వుడు {పక్వకషాయుడు – పరిపక్వము చెందిన విషయాభిలాషములు కలవాడు, విషయములపై కోరికలు లేనివాడు}; ఐ = అయ్యి; బ్రహ్మంబున్ = పరబ్రహ్మము; అందున్ = అందు; నిజ = తన యొక్క; ఆత్మన్ = ఆత్మను; అనుసంధించి = లగ్నముచేసి; విజిత = జయించిన; ఇంద్రియ = ఇంద్రియములు; ప్రాణ = ప్రాణములు; చిత్తుండు = మనసు కలవాడు; ఐ = అయ్యి; స్థాణువున్ = కదలికలేనిదాని, రాయి; పోలెన్ = వలె; దివ్యవర్ష = దివ్యసంవత్సరముల; శతంబున్ = నూటిని; తపంబున్ = తపస్సు; చేసి = చేసి; భగవంతుండు = విష్ణుమూర్తి {భగవంతుడు - మహిమాన్వితుడు, విష్ణువు}; అయిన = అయిన; వాసుదేవుని = విష్ణుమూర్తి {వాసుదేవుడు - వసించెడివాడు, విష్ణువు}; అందున్ = ఎడల; ప్రీతి = ఆసక్తి; వహించున్ = కలిగియుండెను; అన్యంబున్ = ఇతరమును; ఎఱుంగక = తెలియక; వర్తించుచున్ = ప్రవర్తిస్తూ; తన్నున్ = తనను; స్వప్న = కల; అందున్ = లో; మమ = నాది; ఇదమ్ = ఇదిగో; శిరస్ = తల; ఛిన్నమ్ = తెగగొట్టబడినది; ఇతి = అయ్యెన్; అను = అనెడి; ప్రతీతి = నానుడి; అందున్ = లో; పోలెన్ = వలె; వ్యతిరిక్తునిన్ = దేహమునకు భిన్నమైనవాని; తన = అగునట్లు; వ్యాపకునిన్ = సర్వ వ్యాపకుని; కాన్ = అగునట్లు; అంతఃకరణ = మనస్సు యొక్క; వృత్తి = ప్రవర్తనలకు; సాక్షినిన్ = సాక్షి; కాన్ = అగునట్లు; ఎఱింగి = తెలిసి.

భావము:

ఈ విధంగా భార్య తన వెంట రాగా మలయధ్వజుడు చంద్రమస, నవోదకం అనే నదులలో తీర్థమాడి మనసులోని మాలిన్యాన్ని, దేహంలోని మాలిన్యాన్ని తొలగించుకున్నాడు. కందమూలాలను, పండ్లను, విత్తనాలను, పువ్వులను, ఆకులను, గడ్డిని, నీళ్ళను ఆహారంగా తీసుకొంటూ గొప్ప తపస్సు చేసాడు. శీతోష్ణాలు, వర్షపాతాలు, ఆకలి దప్పులు, ప్రియాప్రియాలు, సుఖదుఃఖాలు అనే ద్వంద్వాలను సమానంగా భావించాడు. తపోవిద్యల చేత, యమ నియమాల చేత కామాది వాసనలను దహించి బ్రహ్మంలో తన ఆత్మను కూర్చి, ఇంద్రియాలను, ప్రాణాన్ని, మనస్సును గెలిచాడు. మ్రోడులాగా నిలిచి నూరు దివ్య సంవత్సరాలు తపస్సు చేసాడు. భగవంతుడైన వాసుదేవునిపై ప్రీతి తప్ప మరొకటి తెలియక ప్రవర్తించాడు. తనను కలలో ‘మమేదం శిర శ్ఛిన్న మిత్యాది’ (నా యీ శిరస్సు తెగగొట్ట బడినది) అన్న నానుడికి తగినట్లు తనను దేహానికి భిన్నంగా, సాక్షిగా తెలిసికొని…