పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పురంజను కథ

  •  
  •  
  •  

4-761-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు రతిజ్ఞాన విహీనుండు నకోవిదుండు నిహపరచింతాశూన్యుండుఁ బశుప్రాయుండుఁ ద్వదన్యుండు నైన వాని నెవ్వని వరియింతు? గృహస్థాశ్రమమందు ధర్మార్థ కామ మోక్ష ప్రజానందంబులును యశంబును యతివేద్యంబులు గాని రజస్తమో విహీన పుణ్యలోకంబులును గలుగు; పితృ దేవర్షి మర్త్య భూతగణంబులకుం దనకు నీ లోకంబున గృహస్థాశ్రమంబు సర్వక్షేమార్థం బయిన యాశ్రమంబండ్రు; గావున వదాన్యుండవు, వీరవిఖ్యాతుండవుఁ, బ్రియదర్శనుండవు, స్వయంప్రాప్తుండవు నయి భోగి భోగ సదృశ భుజాదండంబులచే నొప్పు భవాదృశుం దగిలి మాదృశ యగు కన్య వరియింపకుండునే” యని వెండియు.

టీకా:

మఱియున్ = ఇంకను; రతి = రతి; జ్ఞాన = జ్ఞానము; విహీనుడునున్ = లేనివాడు; అకోవిదుండును = నైపుణ్యములేనివాడు; ఇహ = భూలోకేచ్ఛలందు; పర = లగ్నమైన; చింత = వలపు; శూన్యుండు = లేనివాడు; పశు = పశువుతో; ప్రాయుడు = సమానమైనవాడు; త్వత్ = నీకంటె; అన్యుండున్ = ఇతరమైనవాడు; ఐన = అయినట్టి; వానిన్ = వీనిని; ఎవ్వనిన్ = ఎవనిని; వరియింతున్ = వరించెదను; గృహస్థాశ్రమమున్ = గృహస్థాశ్రమము; అందున్ = లో; ధర్మ = ధర్మము; అర్థ = సంపదలు; కామ = కోరికలు; మోక్ష = ముక్తి; ప్రజా = సంతానము; ఆనందంబులును = సంతోషములును; యశంబును = కీర్తి; అతి = మిక్కిలి; వేద్యంబులుకాని = తెలియుటకు వీలుకాని; రజః = రజోగుణము; తమః = తమోగుణము; విహీన = లేనట్టి; పుణ్య = పుణ్యవంతమైన; లోకంబులునున్ = లోకములును; కలుగున్ = కలుగును; పితృ = పితృదేవతలు, పితరులు; దేవర్షి = దేవఋషులు; మర్త్య = మానవులు; భూత = జంతు; గణంబుల్ = సమూహముల; కున్ = కు; తన = తన; కున్ = కి; ఈ = ఈ; లోకంబునన్ = లోకములో; గృహస్థాశ్రమంబున్ = గృహస్థాశ్రమము; సర్వ = అఖిల; క్షేమ = శుభములు; అర్థంబున్ = కలిగించెడిది; అయిన = అయినట్టి; ఆశ్రమంబున్ = ఆశ్రమము; అండ్రు = అంటారు; కావున = అందుచేత; వదాన్యుండవు = దాతవు; వీరవిఖ్యాతుండవు = వీరునిగా ప్రసిద్ధిపొందిన వాడవు; ప్రియ దర్శనుండవు = ప్రీతిగా చూచువాడవు; స్వయంప్రాప్తుండవు = తనంతతాను కలిగిన వాడవు; అయి = అయ్యి; భోగి = భోగములను, పాము; భోగ = అనుభవించుటకు, పడగ; సదృశ = వంటి; భుజా = భుజములు అనెడి; దండంబుల = దండముల; చేన్ = చేత; భవ = నీ; ఆదృశుని = వంటివానిని; మా = మా; దృశ = వంటివారు; అగు = అయిన; కన్య = స్త్రీ; వరియింపకుండునే = వరింపదా ఏమి; అని = అని; వెండియున్ = ఇంకను.

భావము:

నిన్ను కాదని రతిజ్ఞానం లేనివాడు, పండితుడు కానివాడు, ఇహపర చింతాశూన్యుడు, పశుప్రాయుడు అయిన మరొకని ఎలా వరిస్తాను? గృహస్థాశ్రమంలో ధర్మార్థ కామమోక్షాలు, సంతాన సుఖం, కీర్తి, రజస్తమస్సులు లేని పుణ్యలోకాలు లభిస్తాయి. పితృదేవతలకు, దేవర్షులకు, మానవులకు, భూతగణాలకు, తనకు గృహస్థాశ్రమం ఈ లోకంలో సర్వక్షేమాలు కలిగించే ఆశ్రమం అని అంటారు. కాబట్టి దాతవు, వీరుడవు, సుందరుడవు, స్వయంగా లభించినవాడవు, సర్పాల వంటి భుజదండాలు కలిగినవాడవు అయిన నిన్ను నావంటి కన్య వరించకుండా ఎలా ఉండగలదు?” అని మళ్ళీ ఇలా అన్నది.